Share News

Union Budjet 2024: కేంద్ర బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారు.. హల్వా వేడుక అంటే ఇదే..

ABN , Publish Date - Jan 16 , 2024 | 11:52 AM

కేంద్ర బడ్జెట్‌ను నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ రూపొందిస్తుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రెజెంటేషన్ తర్వాత, బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు.

 Union Budjet 2024: కేంద్ర బడ్జెట్‌ని ఎలా తయారు చేస్తారు.. హల్వా వేడుక అంటే ఇదే..

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఎన్నో రాష్ట్రాలున్న దేశంలో అందరికీ సమ న్యాయం ఎలా చేస్తారు, అన్ని మంత్రిత్వ శాఖలకు డబ్బులు ఎలా కేటాయిస్తారు, కేటాయింపులో ప్రాధాన్యత క్రమాలు ఏంటి, రెవెన్యూ కేటాయింపులు, ప్రీ బడ్జెట్ సమావేశం, మధ్యంతర బడ్జెట్ అంటే ఏంటి. బడ్జెట్ ప్రవేశ పెట్టేముందు జరుపుకునే హల్వా వేడుక ఎందుకు జరుపుకుంటారు.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి. వాటన్నింటికీ సమాధానం తెలుసుకుందాం.

ఫిబ్రవరి 1న బడ్జెట్

కేంద్ర బడ్జెట్‌ను నీతి ఆయోగ్, ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ (MoF) రూపొందిస్తుంది. బడ్జెట్ తయారీ కార్యకలాపాలు సాధారణంగా ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి, అంటే దాన్ని పార్లమెంటులో ప్రవేశ పెట్టే తేదీకి ఆరు నెలల ముందు అన్నమాట. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. ప్రెజెంటేషన్ తర్వాత, బడ్జెట్‌ను ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాలి. ఏటా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ఏడాది మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరో బడ్జెట్‌ను(2024–25) సమర్పించనున్నారు.

బడ్జెట్ ఎలా తయారు చేస్తారంటే..?

సర్క్యులర్ జారీ : అన్ని శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్త సంస్థలకు రాబోయే ఆర్థిక సంవత్సరానికి అంచనాలను సిద్ధం చేయమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక సర్క్యులర్‌ను జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్‌లో ఆయా మంత్రిత్వ శాఖలకనుగుణంగా మార్గదర్శకాలుంటాయి.

రాబడి, వ్యయాల అంచనాలు: ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాల డేటాను పరిశీలిస్తుంది. మొత్తం బడ్జెట్ లోటు లెక్కించడానికి ఆదాయ, వ్యయాల అంచనాలను పోల్చి చూస్తుంది. అప్పుడు కేంద్రం ప్రధాన ఆర్థిక సలహాదారు (CEO)ని సంప్రదించి, లోటును తీర్చడానికి ప్రభుత్వానికి అవసరమైన రుణాల స్థాయిని నిర్ణయిస్తుంది.

రెవెన్యూ కేటాయింపు: అన్ని సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న తరువాత, ఆర్థిక మంత్రి వివిధ శాఖలకు వారి భవిష్యత్తు ఖర్చుల కోసం ఆదాయ కేటాయింపులపై నిర్ణయం తీసుకుంటారు. నిధుల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు ఉంటే, ఆర్థిక మంత్రిత్వ శాఖ కొనసాగే ముందు కేంద్ర మంత్రివర్గం లేదా ప్రధానితో సంప్రదింపులు జరుపుతుంది.

ప్రీ-బడ్జెట్ సమావేశం: ఆర్థిక మంత్రి వారి ప్రతిపాదనలు, డిమాండ్ల గురించి తెలుసుకోవడానికి ప్రీ-బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. ఈ మీటింగ్‌లో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు ఉంటాయి.

తుది పిలుపు: ప్రీ-బడ్జెట్ సంప్రదింపులు పూర్తయిన తర్వాత, ఆర్థిక మంత్రి డిమాండ్లపై తుది పిలుపునిస్తారు. వీటిని ఖరారు చేయడానికి ముందు ప్రధానితో కూడా చర్చిస్తారు.

హల్వా వేడుక, బడ్జెట్ ముద్రణ: కేంద్ర బడ్జెట్ తయారీ ప్రక్రియ ముగింపునకు గుర్తుగా, ప్రభుత్వం హల్వా వేడుకను నిర్వహిస్తుంది. ఈ వేడుక ఏటా ఆనవాయితీగా వస్తోంది. హల్వా వేడుక తర్వాత బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభిస్తారు. హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖలోని అందరు సిబ్బందికి అందిస్తారు.

బడ్జెట్ ప్రదర్శన: చివరగా, ఆర్థిక మంత్రి లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెడతారు. 2016 వరకు ఫిబ్రవరి చివరి రోజున బడ్జెట్ ప్రవేశపెట్టేవారు. అయితే, 2017 నుంచి ఏటా ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను సమర్పిస్తున్నారు. యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్ లో అందరూ బడ్జెట్ ముఖ్యాంశాలను చూడవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 16 , 2024 | 11:53 AM