Share News

National: అందరిచూపు ఢిల్లీ వైపు!

ABN , Publish Date - May 25 , 2024 | 06:25 AM

లోక్‌సభ ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్‌ జరగనుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హరియాణలోని

National: అందరిచూపు ఢిల్లీ వైపు!

  • దేశవ్యాప్తంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్‌.. 6 రాష్ట్రాలు, 2 యూటీల్లో 58 సీట్లకు ఓటింగ్‌

  • ఢిల్లీ, హరియాణలోని అన్ని స్థానాలకు

  • యూపీలో 14, బిహార్‌, బెంగాల్లో 8 చోట్ల

న్యూఢిల్లీ, మే 24(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల సమరంలో ఆరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 నియోజకవర్గాల్లో శనివారం ఓటింగ్‌ జరగనుంది. దేశ రాజధానిలోని 7 స్థానాలు, హరియాణలోని మొత్తం 10 సీట్లకు ఈ విడతలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఆరుచోట్ల సిటింగ్‌ ఎంపీలను మార్చిన బీజేపీకి, ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌, కాంగ్రెస్‌ మధ్యన గట్టి పోటీ నెలకొంది. మద్యం కేసులో జైలుపాలై బెయిల్‌ మీద బయటకు వచ్చిన ఆప్‌ అధినేత, సీఎం కేజ్రీవాల్‌ ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలతో ప్రచారం సాగించారు.

ఇదే సమయంలో పార్టీ ఎంపీ స్వాతి మలీవాల్‌ తనపై సీఎం నివాసంలోనే దాడి జరిగిందని ఆరోపించడం, ఈ కేసులో కేజ్రీ పీఏ విభవ్‌ అరెస్టు కావడంతో ఎన్నికలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అంతేగాక ఆప్‌, కాంగ్రెస్‌ తొలిసారిగా బీజేపీపై సంయుక్త అభ్యర్థులను నిలిపిన నేపథ్యంలో ఢిల్లీ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా, ఆరో దశలో యూపీలోని 14, పశ్చిమబెంగాల్‌, బిహార్‌లో 8 స్థానాల చొప్పున, ఒడిసాలో 6, జార్ఖండ్‌లో 4, జమ్ముకశ్మీర్‌లో ఒక్కో నియోజకవర్గంలో పోలింగ్‌ జరుగనుంది. వీటిలో మొత్తం 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

11.13 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఒడిసాలోని 42 అసెంబ్లీ సీట్లకూ శనివారం ఓటింగ్‌ నిర్వహించనున్నారు. మరోవైపు అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం ఆయా రాష్ట్రాల యంత్రాంగాన్ని ఆదేశించింది. కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలు ఢిల్లీలో ఓటు వేయనున్నారు.


బీజేపీ అభ్యర్థులు, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, ఇంద్రజీత్‌ సింగ్‌, క్రిషన్‌పాల్‌ గుర్జర్‌, మనేకా గాంధీ, సంబిత్‌ పాత్రా, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, పీడీపీ చీఫ్‌ మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్‌ నేతలు దీపేందర్‌సింగ్‌ హుడా, రాజ్‌ బబ్బర్‌ తదితరులు ఈ విడతలో పోటీలో ఉన్న ప్రముఖులు. ఢిల్లీలో ఉన్న తెలుగువారిని మెప్పించేందుకు శుక్రవారం ఆంధ్రా, తెలంగాణ భవన్‌లో భోజనం చేసి పలువురి దృష్టిని ఆకర్షించిన రాహుల్‌ గాంధీ శనివారం మెట్రోలో ప్రయాణించారు. ఈ ఎన్నికలు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగ సంస్థలపై దాడులపై ప్రజల నిరసనకు సంకేతంగా నిలవాలని,, కాంగ్రెస్‌, ఇండియా కూటమి అభ్యర్థుల గెలుపునకు దోహదం చేయాలని సోనియా వీడియో విడుదల చేశారు.

జంగల్‌ మహల్‌

బెంగాల్‌లో పోలింగ్‌ జరగనున్న 8 స్థానాలూ గిరిజనుల పట్టున్న జంగల్‌ మహల్‌ ప్రాంతంలోనివే. వీటిలో గత ఎన్నికల్లో బీజేపీ 5, టీఎంసీ 3 చోట్ల గెలిచాయి. ఈసారి ఎన్నికలు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, సీఎం మమత ప్రతిష్ఠకు సవాలుగా మారాయి. మేదినీపూర్‌, పురూలియా, బంకూర తదితర కీలక నియోజకవర్గాలున్న ఈ ప్రాంతంలో అత్యధికంగా సంతాల్‌, ముండా, ఒరాన్‌ తదితర ఆదివాసీ తెగల ప్రజలు నివసిస్తారు. కోల్‌కతా హైకోర్టు మాజీ జడ్జి జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ, ప్రతిపక్ష నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి ఈ విడతలో పోటీలో ఉన్నారు. వివిధ పార్టీలు, స్వతంత్రులు మొత్తంగా 79 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాగా, యూపీలోని సుల్తాన్‌పురి నుంచి మనేకాగాంధీ, ఆజంఘడ్‌ నుంచి సమాజ్‌ వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ అన్న కుమారుడు అభ్యర్థి ధర్మేంద్రయాదవ్‌ భవితవ్యం తేల్చుకోనున్నారు. లాల్‌బహదూర్‌శాస్త్రి, వీపీ సింగ్‌, మురళీ మనోహర్‌ జోషి వంటి ఉద్ధండులు పోటీ చేసిన ప్రయాగ్‌రాజ్‌, తొలి ప్రధాని నెహ్రూ ప్రాతినిధ్యం వహించిన ఫూల్‌పూర్‌, శ్రావస్తి తదితర నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

Updated Date - May 25 , 2024 | 06:35 AM