Share News

వీడేం మనిషిరా బాబు.. కాల్‌గర్ల్‌ అంటూ వధువు ఫోన్‌ నంబర్‌.. ఫేస్‌బుక్‌, మెట్రో స్టేషన్‌ టాయ్‌లెట్లలో రాతలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:23 AM

కాల్‌గర్ల్‌ కావాలా.. అయితే సంప్రదించండి అంటూ ఓ నూతన వధువు ఫోన్‌ నంబర్‌ను ఫేస్‌బుక్‌, మెట్రో రైల్వే టాయ్‌లెట్‌(Metro Railway Toilet)లపై రాసి, వేధింపులకు గురిచేసిన ఘరానా నేరగాడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీడేం మనిషిరా బాబు.. కాల్‌గర్ల్‌ అంటూ వధువు ఫోన్‌ నంబర్‌.. ఫేస్‌బుక్‌, మెట్రో స్టేషన్‌ టాయ్‌లెట్లలో రాతలు

  • క్యాటరింగ్‌ మాటున బెదిరింపులు, వేధింపులు

  • 11 కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: కాల్‌గర్ల్‌ కావాలా.. అయితే సంప్రదించండి అంటూ ఓ నూతన వధువు ఫోన్‌ నంబర్‌ను ఫేస్‌బుక్‌, మెట్రో రైల్వే టాయ్‌లెట్‌(Metro Railway Toilet)లపై రాసి, వేధింపులకు గురిచేసిన ఘరానా నేరగాడిని సైబర్‌ క్రైం పోలీసులు అరెస్ట్‌ చేశారు. బషీర్‌బాగ్‌ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ కవిత.. వివరాలను వెల్లడించారు. అనంతపూర్‌కు చెందిన ఎం. ఉన్నూరు స్వామి (34) యూస్‌ఫగూడలో ఉంటూ క్యాటరింగ్‌ పనులు చేస్తుంటాడు. క్యాటరింగ్‌కు సంబంధించి పాంప్లెట్లు, పోస్టర్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాకుండా జస్ట్‌ డయల్‌లో కూడా నమోదు చేసుకున్నాడు. పనుల కోసం నిరుద్యోగ యువకులు ఇతడిని సంప్రదించేవారు. ఆన్‌లైన్‌ ద్వారా పెళ్లిళ్లు, ఫంక్షన్‌లకు క్యాటరింగ్‌ కోసం మనుషులు కావాలని సంప్రదించే వారికి వీరిని పంపేవాడు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత ఎక్కువ డబ్బులు డిమాండ్‌ చేసి, ఇవ్వకుంటే గొడవ పడేవాడు. అంతటితో ఆగక ఫంక్షన్‌లో వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి, అసభ్యకరంగా దూషించడంతోపాటు డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో ఇతడిపై నగరంలో ఇప్పటికే 10 కేసులు నమోదయ్యాయి. పోలీసు కేసుల నుంచి తప్పించుకునేందుకు స్వామి తరచూ ఫోన్‌ నెంబర్లు మార్చేవాడు.

నూతన వధువుకు వేధింపులు

బోయినపల్లిలో ఓ నూతన జంట రిసెప్షన్‌ వేడుకకు క్యాటరింగ్‌ బాయ్స్‌ కోసం జస్ట్‌డయల్‌ను సంప్రదించింది. క్యాటరింగ్‌ కోసం మనుషులను సరఫరా చేస్తానని, అందుకు రూ.7,500 ఇవ్వాలని స్వామి ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫంక్షన్‌ ముగిసిన తర్వాత ఎక్కువ సమయం ఉంచుకున్నారు.. పని ఎక్కువ చేయించుకున్నారంటూ రెట్టింపు డబ్బు (రూ.15వేలు) డిమాండ్‌ చేశాడు. పెళ్లి బృందం వారు ఒప్పుకోకపోవడంతో వారితో గొడవపడ్డాడు. పలు ఫోన్‌నంబర్లతో ఫోన్‌లు చేసి దూషించడమే కాకుండా అంతుచూస్తానని బెదిరించేవాడు. వధువు వివరాలతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి అసభ్య ఫొటోలు, సందేశాలు పంపేవాడు. అంతేకాకుండా మెట్రో టాయ్‌లెట్లలో కాల్‌గర్ల్‌ కావాలా సంప్రదించండంటూ వధువు ఫోన్‌ నంబర్‌ పెట్టాడు. దాంతో నూతన దంపతుల ఫోన్‌లకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌, అసభ్య సందేశాలు వస్తున్నాయి. దాంతో మనస్తాపానికి గురైన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు నిందితుడు ఉన్నూరు స్వామిని అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి 2 ఫోన్లు, 3 సిమ్‌కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పటికి 30 సిమ్‌కార్డులను మార్చినట్లు తమ విచారణలో గుర్తించామని డీసీపీ తెలిపారు. క్యాటరింగ్‌ పేరుతో మనుషులను సరఫరా చేస్తున్న ఇతడు, అడిగినంత డబ్బు ఇవ్వకుంటే మహిళల నంబర్లు తీసుకొని సోషల్‌ మీడియాలో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని తెలిపారు. ఈ కేసులో నిందితుడిని అరెస్ట్‌ చేసిన సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ కె.సైదులు, ఎస్సైలు ప్రసేన్‌రెడ్డి, తేజశ్రీలతో పాటు కానిస్టేబుళ్లు నరేష్ కుమార్‌, విజయ్‌, మణికంఠ, తిరుమలేష్‏లను డీసీపీ అభినందించారు.

ఇదికూడా చదవండి: Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

Updated Date - Apr 14 , 2024 | 11:39 AM