Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికర సన్నివేశం..
ABN , Publish Date - Nov 22 , 2024 | 12:26 PM
అధికార పార్టీలో ఉన్నవారే ఫైనాన్స్ కమిటీలో ఉంటే న్యాయం జరగదని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి పీఏసీ పదవి ఇవ్వకుండా ఎన్జీఏ కూటమి కొత్త సాంప్రదాయానికి తెరతీసిందని విమర్శించారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా పీఏసీ పదవులు ప్రతిపక్షానికే ఇస్తారన్నారు.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో (AP Assembly Premises) శుక్రవారం ఉదయం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. వైఎస్సార్‌పీసీ నేత, మాజీ మంత్రి, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) , జనసేన అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇద్దరు ఒకరిని ఒకరు పలకరించుకుని.. అలిగనం చేసుకున్నారు.
ప్రతిపక్షం అంటే నెంబర్ గేమ్ కాదు...
తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అధికార పార్టీలో ఉన్నవారే ఫైనాన్స్ కమిటీలో ఉంటే న్యాయం జరగదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతిపక్షానికి పీఏసీ పదవి ఇవ్వకుండా ఎన్జీఏ కూటమి కొత్త సాంప్రదాయానికి తెరతీసిందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలలో కూడా పీఏసీ పదవులు ప్రతిపక్షానికే ఇస్తారన్నారు. ప్రజాస్వామ్య విలులవలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు మంచి సాంప్రదాయాలు తీసుకు రావాలన్నారు. ప్రతిపక్షం అంటే నెంబర్ గేమ్ కాదని.. ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తామని గతంలో జగన్ అన్నారు.. కాని సభా సాంప్రదయాలు కొనసాగించారని ఈ సందర్భంగా బొత్స సత్యానారాయణ గుర్తు చేశారు.
తాలిబన్లు మాత్రమే ఇవ్వలేదు..
పీఏసీని చాలా సదుద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిచారని, ప్రజాస్వామ్య స్ఫూర్తితో దీనిని పెట్టారని బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్ళు చేసిన పద్దులను వాళ్ళ పార్టీ వాళ్లే చూసుకుంటాం అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ ఇవ్వడం సాంప్రదాయమని, మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశమైన సరే ప్రతిపక్షానికి పీఏసీ ఇస్తారని చెప్పారు. తాలిబన్లు మాత్రమే ఇవ్వలేదని.. వీళ్లు అదే సంప్రదాయం పాటిస్తారా.. అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం లేదని, ఈ ప్రభుత్వం సంప్రదాయాలను తుంగలో తొక్కిందని.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాబట్టి తాము ఓటింగ్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని చెప్పారు. ఇలాంటి చెడు సంప్రదాయం తీసుకురావడం సమంజసం కాదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
పీఏసీ వాచ్ దాగ్‌లా..
వైఎస్సార్‌పీసీ నేత, మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. పీఏసీ పోలింగ్‌నూ వైఎస్సార్‌పీసీ బాయకాట్ చేస్తుందని తెలిపారు. అధికారంలో ఉన్న సభ్యులకు పీఏసీ చైర్మన్ ఇవ్వలేదని.. ప్రతిపక్ష హోదా లేని నాయకుడికీ గతంలో చైర్మన్ పదవి ఇచ్చినా సందర్బాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం లోటుపాట్లను ఎత్తి చూపుతుందనే అభిప్రాయంతో ప్రతిపక్ష హోదా లేకున్నా పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. దేశ వ్యాప్తంగా గతంలో అనేక కుంభ కోణాలను పీఏసీ వెలికి తీసిందని, నిధులు దుర్వినియోగం కాకుండా పీఏసీ వాచ్ దాగ్‌లా పని చేస్తుందన్నారు. 1994 లో ఉమ్మడి రాష్ర్టంలో ప్రతి పక్ష హోదా లేకున్నా చైర్మన్‌గా అవకాశం ఇచ్చారని, గతంలో తమకు అసెంబ్లీలో పూర్తి బలం ఉన్నా ఆనవాయితీ మేరకు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చామని పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి అన్నారు.