Share News

AP Politics: అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు.. గోడౌన్ నిండా..

ABN , Publish Date - Mar 27 , 2024 | 02:48 AM

ఎన్నికల ముంగిట వైసీపీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి విమానాశ్రయ సమీపంలోని ప్రైవేట్‌ గోదాముల్లో పెద్దఎత్తున కానుకలు, ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారు.

AP Politics: అడ్డంగా దొరికిపోయిన వైసీపీ నేతలు.. గోడౌన్ నిండా..
YSRCP

  • గొడుగులు, బొట్టుబిళ్లలు, రిస్ట్‌వాచీలు!

  • గుట్టలుగా వైసీపీ తాయిలాలు

  • తిరుపతి విమానాశ్రయం సమీపంలోని

  • గోదాముల్లో దాచి పెట్టిన వైనం

  • టీడీపీ నిరసనతో రంగంలోకి అధికారులు

  • వైసీపీ కీలక నేత ఒత్తిడితో తొలుత తాత్సారం

  • ఎట్టకేలకు తనిఖీలు.. బయటపడిన సామగ్రి

తిరుపతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముంగిట వైసీపీ(YCP) నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. తిరుపతి(Tirupati) విమానాశ్రయ సమీపంలోని ప్రైవేట్‌ గోదాముల్లో పెద్దఎత్తున కానుకలు, ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారు. ఇవి మంగళవారం బయటపడ్డాయి. వీటిలో గొడుగులు, కండువాలు, బొట్టు బిళ్లలు, సీఎం జగన్‌, వైఎస్‌ చిత్రాలతో కూడిన రిస్ట్‌వాచీలు గుట్టలు గుట్టలుగా ఉండడంతో అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. ‘గోదాముల్లో వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వ’ శీర్షికన మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంపై టీడీపీ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఎన్నికల అధికారులు గోదాములను పరిశీలించేందుకు వెళ్లారు. వీరి రాకను గమనించిన గోదాముల్లోని సిబ్బంది వెనుక నుంచి తాళాలు వేసుకొని పరారయ్యారు. దీంతో బయట నిలిపి ఉంచిన వైసీపీ సామాగ్రితో కూడిన వాహనాన్ని సీజ్‌ చేశారు. అయితే గోదాము లోపల ఏముందో తెలియాల్సిందేనని టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. నగదు ఉండొచ్చన్న అనుమానాలను లేవనెత్తారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు ఇక్కడి ఘటనలను ఫొటోలు తీసి సీ-విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న సీఐ, తహసీల్దారు మీడియా సమక్షంలో వాహనంలోని మూటలను తెరిపించారు. ఓటర్లకు పంచిపెట్టేందుకు గొడుగులు, బొట్టు బిళ్లలు, రిస్ట్‌వాచీలు, ఈవీఎం నమూనాలు, టోపీలు, బ్యాడ్జీలు, వైసీపీ జెండాలు తదితర వస్తువులు బయటపడ్డాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 27 , 2024 | 09:00 AM