Share News

AP Elections 2024: ఇదేదో తేడాగా ఉందే!

ABN , Publish Date - Mar 25 , 2024 | 04:44 AM

ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది..? పాలక పక్షమైన వైసీపీ అక్రమాలపై ఫిర్యాదులేమో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి..

AP Elections 2024: ఇదేదో తేడాగా ఉందే!

  • రాష్ట్ర అధికారుల తీరుపై ఈసీ విస్మయం

  • అధికార పక్షం అక్రమాలపై..

  • కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు

  • అడిగితే అంతా బాగుందంటున్న..

  • కొందరు కలెక్టర్లు, ఎస్పీలు

  • పొంతనలేని సమాచారంపై అనుమానం

  • వారి పుట్టుపూర్వోత్తరాలపై కమిషన్‌ ఆరా

  • కొందరిపై అంతర్గతంగా విచారణ

  • వారం తర్వాత వరుసపెట్టి వేటు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి) :

ఆంధ్రప్రదేశ్‌లో అసలేం జరుగుతోంది..? పాలక పక్షమైన వైసీపీ (YSR Congress) అక్రమాలపై ఫిర్యాదులేమో కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి.. ఏమడిగినా అంతా బాగుందని కొందరు కలెక్టర్లు, ఎస్పీలు అధికారిక నివేదికలు పంపిస్తున్నారు. ఇదేదో తేడాగానే ఉందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) అనుమానిస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అర డజను మంది కలెక్టర్లు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఎస్పీల వ్యవహార శైలిపై కన్నేసింది. ముఖ్యమంత్రి జగన్‌ తన పార్టీ అభ్యర్థుల ఎంపికకు ముందే ఎక్కడ ఏ అధికారి ఉండాలో నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే జిల్లాల్లో తన మనుషులనుకున్నవారిని, చెప్పినట్లు నడుచుకునే వారిని కలెక్టర్లు, ఎస్పీలుగా మోహరింపజేశారు. వారే ఇప్పుడు వివాదస్పద నిర్ణయాలతో ఈసీకి చిరాకు తెప్పిస్తున్నట్లు తెలిసింది. అనేక జిల్లాల్లో అధికార యంత్రాంగం అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులను, అధికారులను కూడా వైసీపీ కార్యకర్తలుగా పనిచేయించుకుంటున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అటు ప్రతిపక్షాల ద్వారా, ఇటు మీడియా ద్వారానే కాకుండా తన సొంత మార్గాల ద్వారా కూడా కమిషన్‌ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించకుంటోంది. వాటిపై వివరణ అడిగినప్పుడు కొందరు కలెక్టర్లు.. వాస్తవాలను ఈసీ ముందుంచుతున్నారు. కానీ ఆ అరడజను మంది మాత్రం ‘అంతా బాగుంది. ఇక్కడ ఏమీ జరగడం లేదు. సందేహించాల్సింది ఏమీ లేదు’ అని నివేదికలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ నాయకుడి దౌర్జన్యం


తమకు అందిన సమాచారం, కలెక్టర్లు ఇస్తున్న నివేదికలకు పొంతన కుదరకపోవడంతో ఈసీలో అనుమానం మొలకెత్తింది. దీంతో ఆ కలెక్టర్ల పూర్వాపరాలు.. పనితీరు.. ఏ ప్రాతిపదికన ప్రస్తుత పోస్టులోకి వచ్చారన్న వివరాలపై ఆరా తీస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల ద్వారా తెలిసింది. అదే సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షించాల్సిన కొందరు ఎస్పీలు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తలెత్తాయి. వీరు కాకుండా ఇద్దరు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులపైనా ఈసీకి అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఇవేవో ఆషామాషీ ఆరోపణలు కాదు. సహేతుకమైన ఆధారాలతో ఫిర్యాదులు అందుతుండడంతో ఈసీ వాటిపై దృష్టి సారించింది. ఇప్పటికే కొంత మందిపై అంతర్గత విచారణ కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నందున.. ఈసీ అధికారులు వారం తర్వాత ఆంధ్రపై ఫోకస్‌ పెడతారని, ఆ వెంటనే జగన్‌ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్న కొందరు అధికారులపై వరుసబెట్టి వేటువేస్తారని తెలుస్తోంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 08:32 AM