Share News

YS Sharmila: షర్మిలను ఓదార్చుతున్న సోనియా గాంధీ.. వైరల్‌గా మారిన పాత ఫొటో..

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:26 PM

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోదరి షర్మిల

YS Sharmila: షర్మిలను ఓదార్చుతున్న సోనియా గాంధీ.. వైరల్‌గా మారిన పాత ఫొటో..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం రాజశేఖర్ రెడ్డి కుమార్తె, ప్రస్తుత ఎపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ కండువా కప్పగా ఆమె హస్తం పార్టీలో చేరారు. వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జీవితమంతా కాంగ్రెస్‌ కోసమే పనిచేశారని, కాంగ్రెస్‌ సేవలోనే మరణించారని గుర్తు చేసుకున్నారు. ఆయన అడుగుజాడల్లో తాను నడుస్తున్నట్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం దూరమవ్వడం.. ఆ తర్వాత వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టడం.. అన్న గెలుపు కోసం షర్మిల కృషి చేయడం.. ఆ తర్వాత వైసీపీకి ఆమె దూరమవ్వడం.. తెలంగాణలో పార్టీ పెట్టడం.. దానిని విలీనం చేసి చివరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరడం అంతా చూస్తుండగానే జరిగిపోయాయి.

నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌కు దూరమయ్యి తిరిగి అదే పార్టీకి చెంతకు చేరిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్‌గా మారింది. షర్మిల తండ్రి, ఉమ్మడి ఏపీ సీఎం రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో తీవ్ర బాధలో ఉన్న ఆమెను కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఓదార్చుతున్న ఈ ఫొటో తాజాగా చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ప్రస్తుత సీఎం జగన్ భార్య వైఎస్ భారతి కూడా కనిపిస్తున్నారు. ఈ ఫొటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఫొటో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


కాగా.. కాంగ్రెస్‌ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని వైఎస్ షర్మిల చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చూడాలని తన తండ్రి కలగన్నారని, దానిని నెరవేర్చేందుకు తనవంతు కృషి చేస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. పార్టీ ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్పినా చేస్తానన్న షర్మిల.. అవసరమైతే అండమాన్ నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

"మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - Jan 07 , 2024 | 12:28 PM