Share News

YS Jagan: తమ్ముడు చెప్పాడని.. అన్నయ్య ‘మేలు’!

ABN , Publish Date - Mar 29 , 2024 | 06:14 AM

తమ్ముడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి కాగా, అన్నయ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి. ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్‌ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక ర్యాంపులు రాసిచ్చేశారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్‌ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాశ్‌ రెడ్డికి చేసిన మేళ్లు ఏమిటో.. ‘దేవుడికీ, రాష్ట్ర

YS Jagan: తమ్ముడు చెప్పాడని.. అన్నయ్య ‘మేలు’!

  • అక్రమాధికారికి అన్నయ్య ‘మేలు’

  • అక్రమాలు రుజువైనా రక్షణ.. ధర్మచంద్రారెడ్డిపై అభియోగాలు హుష్‌

  • అవినాశ్‌ కోరగానే ఫైలు కదిపిన సీఎం.. మధ్యలో ధనుంజయ రెడ్డి పెత్తనం

  • కోడ్‌కు ముందే జరిగిన తతంగం.. ‘పాత తేదీ’తో ఉత్తర్వులు జారీ!?

  • దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడు!

  • ఇక్కడేమో... తమ్ముడు అడుగుతాడు.

  • అన్నయ్య అనుసరిస్తాడు!

(అమరావతి - ఆంధ్రజ్యోతి) :

తమ్ముడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి (YS Avinash Reddy) కాగా, అన్నయ్య ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy). ఇప్పటికే ఒక తమ్ముడు అనిల్‌ రెడ్డికి రాష్ట్రంలోని ఇసుక ర్యాంపులు రాసిచ్చేశారు. మరో తమ్ముడికి మన్యంలోని మైన్‌ వ్యాపారం అప్పగించారు. ఇక అవినాశ్‌ రెడ్డికి చేసిన మేళ్లు ఏమిటో.. ‘దేవుడికీ, రాష్ట్ర ప్రజలందరికీ’ తెలుసు! ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పోస్టింగ్‌లు, తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై అభియోగాలు తొలగించాలని అవినాశ్‌ కోరడమే ఆలస్యమన్నట్లుగా... అన్నయ్య జగన్‌ వాటిని నెరవేర్చుతున్నారు. వారిసమీప బంధువు, కడప మాజీ ఆర్‌డీఓ ధర్మచంద్రారెడ్డిపై ఉన్న అభియోగాలన్నీ ఒక్క కలంపోటుతో మాఫీ చేసేశారు.

గొడ్డలి వేటు వేసి.. నంగనాచి కబుర్లు



ఇదీ అ..ధర్మ చంద్రారెడ్డి నిర్వాకం

ధర్మచంద్రారెడ్డి సుదీర్ఘకాలం కడప ఆర్‌డీఓగా పనిచేశారు. అంతకుముందు ఆయన విశాఖ జిల్లా భీమిలి తహసిల్దార్‌గా పనిచేశారు. ఆ సమయంలో అత్యంత విలువైన 27.44 ఎకరాల భూమి విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ పై కోర్టులో అప్పీల్‌ చేయలేదు. దీంతో ఆ భూమి చేజారిపోయింది. ఏపీసీఎస్‌ రూల్స్‌ (కండక్ట్‌)- 1964లోని రూల్‌ 3ను ఉల్లంఘించారని ఆయనపై అభియోగాలు నమోదు చేశారు. అందులో 3వ అభియోగం రుజువైంది కూడా. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఆయన డిప్యూటీ కలెక్టర్ల సంఘానికి ప్రతినిధి కూడా!

అవినాశ్‌ను ఆశ్రయించి..

తాను తప్పు చేయలేదనుకుంటే ముఖ్యమంత్రికో, ప్రధాన కార్యదర్శికో లేఖ రాయాలి. చర్యలు తీసుకోవద్దని కోరాలి. అదీ లేదంటే... డి ప్యూటీ కలెక్టర్ల సర్వీసు అంశాలు చూసే భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) లేదా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికో విన్నపం చేయవ చ్చు. అధికారులు అనుసరించాల్సిన పద్ధతి ఇదే. కానీ... ఆయన నేరుగా సీఎం తమ్ముడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌ రెడ్డికి లేఖ రాశారు. ‘ధర్మచంద్రారెడ్డి నిజాయితీపరుడు’ అని సర్టిఫికెట్‌ ఇస్తూ ఆయన జగన్‌కు లేఖ రాశారు. పైగా... ‘మనోడే’ అని కూడా చెప్పారు. ‘‘ధర్మచంద్రారెడ్డి భీమిలి తహసిల్దార్‌గా పని చేస్తున్న సమయంలో ఆయనపై కొన్ని అభియోగాలు నమోదుచేశారు. మానవతా దృక్పథంతో వాటిని ఉపసంహరించాలని కోరుతున్నా. ఆయన నిజాయితీపరుడు. బాగా కష్టపడి పనిచేస్తాడని తెలుసు. పులివెందుల నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ధర్మచంద్రారెడ్డి నాకు ఇచ్చిన వినతిపత్రాన్ని మీ పరిశీలనకు పంపిస్తున్నాను. అతని వ్యక్తిగత విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని వీలైనంత త్వరగా అతనికి మేలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అవినాశ్‌ తన లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.

అన్న పాటించాడు

అవినాశ్‌ లేఖపై ముఖ్యమంత్రి జగన్‌ స్పందించారు. ఈ అంశంపై వెంటనే రెవెన్యూ శాఖ నుంచి ఫైల్‌ తెప్పించాలని తన కార్యాలయాన్ని ఆదేశించారు. ఇదంతా ఎన్నికల ప్రవర్తనా నియమావళి రావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు జరిగింది. సీఎం ఆదేశాలతో ఆయన కార్యదర్శి ధనుంజయ రెడ్డి రంగప్రవేశం చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అజయ్‌ జైన్‌కు ఓ లేఖ రాశారు. ‘‘డిప్యూటీ కలెక్టర్‌ గా ఉన్న ధర్మచంద్రా రెడ్డిపై ఉన్న అభియోగాలను ఉపసంహరించాలని కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి రాసిన లేఖను మీకు పంపిస్తున్నాం. తగిన నిర్ణయం తీసుకునేందుకు ఫైల్‌ను పంపించండి’’ అని అజయ్‌జైన్‌ ను ఆదేశిస్తూ లేఖ రాసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ఇదెక్కడి ఆదేశం?

ధనుంజయరెడ్డిది కార్యదర్శి హోదా. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శిది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదా. ధర్మచంద్రారెడ్డిపై నమోదు చేసిన అభియోగాలను సెటిల్‌ చేయాల్సింది రెవెన్యూ శాఖనే. పైగా ధర్మచంద్రారెడ్డిపై నమోదైన అభియోగాల్లో 3వది నిరూపితమైంది. అలాంటిది, కడప ఎంపీ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకొని సంబంధిత ఫైలును పంపించాలని రెవెన్యూ స్పెషల్‌ సీఎ్‌సను ఆదేశించడమేమిటి? ఇదెక్కడి విడ్డూరం? మరో నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్‌ రాబోతుందనగా ఈ తరహా ఆదేశాలు పంపించడం దేనికి సంకేతం? అధికారం ఉండగానే సొంత మనుషులకు మేలుచేసిపెట్టాలన్న ప్రయత్నం కాదా? ఇందులో విచిత్రం ఏమంటే, అభియోగాలు ఎదుర్కొంటున్న ధర్మచంద్రారెడ్డి, ఆయన కోసం లేఖ రాసిన అవినాశ్‌ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌, ఆయన కార్యదర్శిగా ఉన్న ధనుంజయరెడ్డి... ఇలా వీరంతా ఉమ్మడి కడప జిల్లావారే కావడం. ఎన్నికల కోడ్‌ రాకముందే కేసును సెటిల్‌చేద్దామనుకొని రెవెన్యూశాఖపై తీవ్రంగానే ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద రెవెన్యూశాఖ ధర్మచంద్రారెడ్డి ఫైలును రెడీ చేసి సీఎం కార్యాలయానికి పంపించినట్లు తెలిసింది. ఈ విషయంలో సీఎం నిర్ణయం తీసుకొన్నారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ధర్మచంద్రా రెడ్డిపై అభియోగాలను ఉపసంహరిస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు కూడా ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో... పాత తేదీతో ఉత్తర్వులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం తతంగంపై రెవెన్యూ యంత్రాంగంలో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది.

Updated Date - Mar 29 , 2024 | 07:59 AM