Share News

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:37 PM

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.. ఏపీ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు.

YS Sunitha: మా అన్న జగన్‌.. వైసీపీకి ఓటేయకండి!

ఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) కుమార్తె సునీతా రెడ్డి (Sunitha Reddy).. ఏపీ సీఎం జగన్‌ (CM Jagan)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు జగన్‌కి, అయన పార్టీ వైసీపీ (YCP)కి ఓటు వేయవద్దని కోరారు. తన అనుకునే వాళ్లకి కాకుండా అందరికీ సహాయం చేసే వాళ్ళకి మాత్రమే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. హత్యలకు పాల్పడే వారికి పాలించే హక్కు లేదని సునీత తేల్చి చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా వివేకా హత్య కేసు గురించి అడుగుతున్నారని.. ఈ కేసులో పోరాటంలో అండగా నిలిచిన టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan), ఎంపీ రఘురామ కృష్ణరాజు (Raghurama Krishnaraju)కు సునీత ధన్యవాదాలు తెలిపారు.

హంతకులు మన మధ్యే ఉన్నా..

సునీత మాట్లాడుతూ.. ‘‘మీడియా ముందుకు రావటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. వివేకా కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. ఏపీ ప్రజల మద్దతు, తీర్పు నాకు అవసరం. సాధారణంగా హత్య కేసు 4, 5 రోజుల్లో తేలుతుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు మాత్రం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఓడిస్తే వివేకానందారెడ్డి సైలెంట్‌ అవుతారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) సొంతవారే మోసం చేసి ఓడించారు. ఈ కేసు దర్యాప్తు మాత్రం ఏళ్లుగా సాగుతోంది. పెదనాన్న 11.30 వరకూ నా కోసం ఎన్నికల్లో ప్రచారం చేశాడని అవినాశ్‌ చెప్పాడు. మార్చురీ వద్ద అవినాశ్ నాతో మాట్లాడారు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్న తెలియనట్లే ఉంటుంది’’ అని పేర్కొన్నారు.

వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారు..

‘‘వివేకా హత్యకేసును ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మద్దతు తీర్పు నాకు కావాలి. సీబీఐ దర్యాప్తునకు వెళదామని అప్పట్లో జగన్‌ని అడిగా. సీబీఐ దర్యాప్తునకు వెళ్తే అవినాశ్ బీజేపీలోకి వెళ్తారని జగన్ అన్నారు. అయినా సరే.. నేను సీబీఐకి ఫిర్యాదు చేశా. ఆ తర్వాత నాతోపాటు నా భర్తకు వేధింపులు ఎదురయ్యాయి. సీబీఐ పైన కూడా కేసులు పెట్టడం మొదలు పెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. మా నాన్న హత్య కేసులో భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ప్రమేయం ఉంది. వారిద్దరిని జగన్ రక్షిస్తున్నారు. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. జగన్ కేసులు అవుతున్న విధంగానే ఈ కేసు డ్రాగ్ అవడం నాకు ఇష్టం లేదు. సీబీఐకి ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు’’ అని సునీత పేర్కొన్నారు.

ఆ విషయం జగన్‌కెలా తెలిసింది?

ఇంకా సునీత మాట్లాడుతూ.. ‘‘షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. 700 మందిపైగా కుటుంబ సభ్యులు ఉన్నారు, నాకు వాసుదైవ కుటుంబం ఉంది అని పులివెందులలో ఆరోజు చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటున్నా. ఎన్ని గొడవలు ఉన్నా అందరం కలిసే ఉన్నాం. కానీ, నాకు అండగా ఎవరూ ముందుకు రాలేదు. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి. గొడ్డలితో నరికి చంపారు అనే విషయం ఆయనకి ఎలా తెలుసు? అన్న విషయం బయటికి రావాలి. జగన్ వివేకానంద రెడ్డిని గొడ్డలితో చంపారు అని చెప్పారు.. అదెలా తెలిసింది ? నేను ఇంకా పోరాటం చేస్తాను. ప్రజలు నాది న్యాయమైన పోరాటం అని గుర్తిస్తే వారు జగన్‌కు ఓటు వేయరు. ఇలాంటి క్రైం కనిపించొద్దంటే ప్రజలంతా ముందుకు రావాలి. ప్రభుత్వం ప్రభావం కనిపిస్తుంది అందుకే కేసు ముందుకు వెళ్ళడం లేదు’’ అని పేర్కొన్నారు

అప్పుడే నమ్మాల్సి వచ్చింది..

‘‘వివేకానంద రెడ్డి కేసులో వైసీపీలో ఉన్న కొందరు నేతలు గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. బీజేపీ నేత ఆదినారాయణ కూడా నాకు మద్దతు తెలిపారు. వివేకానంద రెడ్డి కేసులో 8 మంది పేర్లు బయటకు వచ్చాయి. నా పోరాటం న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుంటే మా పై కేసులు పెడతారా..? సీబీఐ నన్ను కూడా అనుమనితురాలుగా విచారణ చేశారు. జగన్‌తో భేటీ అయినపుడు.. ఆయన మాట్లాడిన విధానం చూసి అప్పుడు అనుమానించ లేదు. సొంత కుటుంబం మీద అనుమానం రాదు. కానీ ఒక్కో వాస్తవం బయటికి వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. ఇచ్చిన మాట మీద నిలబడతా, విశ్వసనీయత అంటూ జగన్ పదేపదే చెప్తున్నారు. కానీ, జగన్ అన్న ఈ చెల్లికి ఇచ్చిన మాటను ఎందుకు విస్మరించారో సమాధానం ఇవ్వాలి’’ అని సునీత తెలిపారు.

విజయసాయి రెడ్డిని ఎందుకు విచారించడం లేదు?

‘‘సొంత వాళ్లను అంత సులువుగా అనుమానించలేం, అందుకే జగన్ ని కలిసినప్పుడు నాకు ఆయనపై అనుమానం రాలేదు. నేను ప్రజల్లోకి వెళ్తా, ఎలా వెళ్లాలనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే మాపై కేసులు మోపారు. అనుమనితులుగానే నన్ను, నా భర్తను కూడా ప్రశ్నించారు. దస్తగిరి తనని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారని చెపుతున్నారు. దీన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలి. సీబీఐ (CBI) మీద తీవ్రమైన ప్రభావం ఉంది. జాతీయ మీడియాపై కూడా ఎంత ప్రభావం ఉందో ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. ఒక మాజీ సీఎం సోదరుడు హత్య కేసు అదే ఇంకో రాష్ట్రంలో జరిగితే... జాతీయ మీడియా ఇదే విధంగా స్పందించేదా! జాతీయ మీడియాలో ఏపీ అంశాలు ఏమైనా వస్తున్నాయా ? ఈ రోజు సమావేశానికి కూడా రాలేదు అంటే అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి బాబాయ్ చనిపోయారు అంటే ఎంత పెద్ద కేసు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy)ని సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదు?’’ అని సునీత ప్రశ్నించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 01 , 2024 | 01:08 PM