Share News

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!

ABN , Publish Date - Apr 14 , 2024 | 04:11 AM

ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు ‘గాయాలవుతున్నాయి’. గత 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు అంటే...

Attack On CM Jagan: అప్పుడలా.. ఇప్పుడిలా..!
YS Jagan

  • జగన్‌కు ఎన్నికల ‘గాయాలు’

  • 2019లో కోడికత్తి ఘటన.. ఇప్పుడు రాయి దాడి

అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు(YS Jagan) ‘గాయాలవుతున్నాయి’. గత 2019 ఎన్నికలకు ఆరు మాసాల ముందు అంటే.. 2018, అక్టోబరు 25న విశాఖపట్నంలో ప్రజాసంకల్ప యాత్రకు విరామమిచ్చిన అప్పటి విపక్ష నేత జగన్‌.. హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ క్రమంలో విశాఖపట్నం విమానాశ్రయంలో వేచి ఉన్న సమయంలో ‘కోడికత్తి‘ దాడి జరిగింది. ఎడమ భుజంపై గాయమైంది. అయితే.. అక్కడ ప్రాథమిక చికిత్స చేయించుకున్న జగన్‌.. విమానం ఎక్కి నేరుగా హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడ మాత్రం ‘ఎంపిక’ చేసుకున్న ఆసుపత్రిలో చేరి వైద్యం చేయించుకుని కట్లతో బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఎన్నికల్లో సానుభూతి పొందారు. అనంతరం.. ఎన్నికల ప్రచారంలోనూ తనపై హత్యాయత్నం జరిగిందని జగన్‌ చెప్పుకొచ్చారు.


కట్‌ చేస్తే.. తాజాగా శనివారం రాత్రి విజయవాడ శివారు ప్రాంతమైన సింగ్‌నగర్‌ లో జరిగిన ‘రాయిదాడి’ ఘటన తర్వాత కూడా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దాడి జరిగిన వెంటనే సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న బస్సులో ఉన్న వైద్యుడు ఒకరు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం.. బస్సు యాత్ర ముందుకు సాగింది. అయితే.. కొంత దూరం వెళ్లాక.. వైసీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ కూడా గాయానికి మందురాసి బ్యాండెయిడ్‌ వేశారు. ఇక, శనివారం యాత్ర ముగిసిన తర్వాత నేరుగా విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. వాస్తవానికి ఆయన స్థాయికి తగినట్టు ఏదైనా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాల్సి ఉండగా.. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయితే.. ఈ పరిణామాలను గమనిస్తే 2019 ఎన్నికలకు ముందు ఎలా అయితే.. కోడికత్తి గాయాన్ని ప్రచారానికి వాడుకున్నారో.. ఇప్పుడు ‘రాయి’ ఘటనను కూడా ప్రచారానికి వినియోగించుకునే అవకాశం ఉందని విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 14 , 2024 | 07:11 AM