Share News

JD Lakshminarayana: రాజకీయాల్లో వ్యక్తి పూజ రాచరికానికి దారి తీస్తుంది

ABN , Publish Date - Jan 12 , 2024 | 02:59 PM

రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే... అది రాచరికానికి దారి తీస్తుందని.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) అన్నారు.

JD Lakshminarayana: రాజకీయాల్లో వ్యక్తి పూజ రాచరికానికి దారి తీస్తుంది

విజయవాడ: రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే... అది రాచరికానికి దారి తీస్తుందని.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) అన్నారు. శుక్రవారం నాడు జై భారత్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... అంబేద్కర్ విగ్రహాన్ని ఈనెల 19వ తేదీన ప్రారంభించడం మంచిదన్నారు. ‘నా విగ్రహాలు కన్నా...‌నా పుస్తకాల ద్వారా నన్ను గుర్తించండి’ అని అంబేద్కర్ చెప్పారన్నారు. రాజ్యాంగం మంచిదే అయినా.. అధికారంలో ఉన్నా పార్టీ రాజ్యాంగాన్ని సక్రమంగా ఉపయోగించకపోతే అది వృథానే అవుతుందన్నారు. ప్రజలు కూడా రాజ్యాంగాన్ని మంచిగా అమలు చేసే వారినే ఎన్నికల్లో ఎన్నుకోవాలన్నారు. ఏపీలో బీజేపీని ఎప్పుడో ఓడించారని.. కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రం ప్రజాభిప్రాయానికి భిన్నంగా బీజేపీతో అంట కాగుతున్నాయని మండిపడ్డారు.

మతోన్మాద పార్టీలను గద్దె దించాలి

గతంలో జయప్రకాష్ నారాయణ తరహాలో ఇప్పుడు వడ్డే శోభనాద్రీశ్వరావు అందరినీ ఏకం చేస్తున్నారన్నారు. మతోన్మాద పార్టీలను గద్దె దించితేనే ఈ సమావేశానికి ఒక అర్ధమని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు నాలుగుసార్లు కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం వచ్చినా ఉపయోగించుకోలేదని.. పైగా వారి స్వార్థం కోసం‌ కేంద్రం కాళ్ల మీద పడిన సందర్భాలు చూశామన్నారు. ప్రత్యేక హోదాకు ప్రాంతీయ పార్టీలు ముగింపు పలికాయని.. ఆ పార్టీలే ఇప్పుడు ముగిసిన అధ్యాయం అంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ఉద్యమం ద్వారా ప్రత్యేక హోదా సాధించుకోవాలని తెలిపారు. నల్ల చట్టాలు, జల్లికట్టు పోరాటాల స్ఫూర్తి కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్నికలల్లో ప్రత్యేక హోదా స్లోగన్ కాదని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి సాధించుకోవాలన్నారు. సంఘటిత శక్తిగా ఎదిగే పోరాటంలో జై భారత్ పార్టీ భాగస్వామిగా ఉంటుందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 12 , 2024 | 03:08 PM