Share News

Devineni Uma: వసంత కృష్ణప్రసాద్ అవినీతి చిట్టాను కోర్టు ముందు ఉంచుతా

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:11 PM

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( YCP MLA Vasantha Krishnaprasad ) అవినీతి చిట్టా మొత్తం కోర్టు, ప్రజల ముందు ఉంచుతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) హెచ్చరించారు. వసంత కృష్ణప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై స్పందించారు.

Devineni Uma: వసంత కృష్ణప్రసాద్  అవినీతి చిట్టాను కోర్టు ముందు ఉంచుతా

ఎన్టీఆర్ జిల్లా (మైలవరం): వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ( YCP MLA Vasantha Krishnaprasad ) అవినీతి చిట్టాను కోర్టు, ప్రజల ముందు ఉంచుతానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) హెచ్చరించారు. వసంత కృష్ణప్రసాద్ తనకు పంపిన లీగల్ నోటీసులపై దేవినేని స్పందించారు. టీడీపీ కార్యాలయంలో దేవినేని మాట్లాడుతూ... ‘‘కృష్ణప్రసాద్‌కి సలహా ఇస్తున్నా, దమ్మూ ధైర్యం ఉంటే అడ్వకేట్ కమిషన్ వేయించు. ప్రకృతి సంపద దోచుకున్న ఎమ్మెల్యే నువ్వు.. నా మీద 10కోట్ల పరువు నష్టం వేస్తావా? ముఖ్యమంత్రి జగన్‌, మంత్రులకే పరువు లేదు, నీకు క్షమాపణ చెప్పాలా? ముఖ్యమంత్రి కార్యాలయం చుట్టూ నీ అవినీతి డబ్బు, బిల్లుల కోసం తిరుగుతున్నావా లేదా? ఒక ప్రజా ప్రతినిధిగా అభివృద్ధి కోసం కాకుండా కాంట్రాక్టుల బిల్లుల కోసం తిరుగుతున్నావా? బిల్లుల కోసం అక్కడ ముఖ్యమంత్రిని కాళ్లా వేళ్లా పడి ఇక్కడ వేరే పార్టీలో సీటివ్వమని అడుగుతున్నావు. గట్టిగా తిడితే ఈ ఎమ్మెల్యే‌ ఒక నెల రోజులు పారిపోతాడు’’ అని దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు.

బూడిద బకాసురుడు వసంత కృష్ణప్రసాద్

‘‘అక్రమంగా సంపాదించిన డబ్బుతో నా మీద కేసులు పెడతావా. కొండపల్లి అడవిలో నీ దోపిడీకి ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యారు. ఒకే రోజు మూడు పార్టీలు మార్చినా కుటుంబం మీది, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావో తెలీదు. ఇబ్రహీంపట్నంలో నీ బావమరిదిని అడ్డం పెట్టుకుని నేషనల్ హైవేకి బూడిద రవాణా చేశావు. నీవు బూడిద బకాసురుడివి. నీ ఇసుక దోపిడీని ప్రశ్నిస్తే.. నీ అనుచరులు గంటా నవీన్ అనే విలేకరిని చంపిన మాట వాస్తవం కాదా? పొదిలి రవి అనే నీ బందువుని బినామీ ఆస్తుల కోసం చంపలేదా? బాపట్ల మేరీ బందువులను తీసుకొస్తా, ఒక అడ్వకేట్‌ని పెట్టి కమిషన్ వేయించు. కొండపల్లి అడవి దోపిడీ నిజం కాదా? తాడేపల్లి కొంపలో పగిలిన కళ్లజోడు మీద కూడా కోర్టులో పెట్టి కమిషన్ వేయించు. నీ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగుల స్టేట్మెంట్స్ రికార్డెడ్‌గా ఏపీ హైకోర్టులో ఉంది. ఈ పాపాలన్నీ బయటికి వస్తే నిన్ను ఎలక్షన్ కమిషన్ కూడా ఈ ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా బహిష్కరిస్తుంది. ఓటు అనే ఆయుధంతో ప్రజలతో రాబోయే ఎన్నికల్లో నిన్ను తరిమి తరిమి కొడతాం. అన్ని విషయాలను కోర్టుముందు ఆధారాలతో పెడతాం, కోర్టులే సమాధానం చెబుతాయి’’ అని వసంత కృష్ణప్రసాద్‌కి దేవినేని ఉమామహేశ్వరరావు సవాల్ విసిరారు.

Updated Date - Jan 09 , 2024 | 10:24 PM