TDP: చంద్రబాబు ఇంటికి వైసీపీ కీలక నేతలు
ABN , Publish Date - Feb 15 , 2024 | 06:26 PM
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండంటంతో తెలుగుదేశం పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ(YSRCP) నుంచి టీడీపీ(TDP)లోకి భారీగా నేతలు చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ హై కమాండ్ పలు ప్రణాళికలు రచిస్తోంది.
అమరావతి: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండంటంతో తెలుగుదేశం పార్టీ చేరికలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వైసీపీ(YSRCP) నుంచి టీడీపీ(TDP)లోకి భారీగా నేతలు చేరుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా టీడీపీ హై కమాండ్ పలు ప్రణాళికలు రచిస్తోంది. ప్లాన్‌లో భాగంగా టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) ఉండవల్లిలోని నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆశావాహులు, పార్టీలో చేరికలకు వచ్చిన వారితో చంద్రబాబు నివాస ప్రాంతం కోలాహలంగా మారింది.
టీడీపీలోకి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు..?
చంద్రబాబును ఉండవల్లిలోని నివాసంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు గురువారం కలిశారు. ఇటీవలే ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. త్వరలో తెలుగుదేశంలో శ్రీకృష్ణదేవరాయులు చేరనున్నట్లు సమాచారం. అయితే గత కొంత కాలంగా వైసీపీ అధిష్ఠానంపై ఎంపీ అసంతృప్తితో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు వెళ్లారు. అయితే ఆ సమయంలో ఎంపీపై జగన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి వైసీపీ హై కమాండ్‌తో అట్టిముట్టన్నట్లుగానే ఎంపీ ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఎంపీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత అతను టీడీపీలోకి చేరడానికి మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే చంద్రబాబును ఆయన కలిశారు. టీడీపీలో చేరితేనే తనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ఆ పార్టీలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన పసుపు కండువా కప్పుకోనున్నట్లు సమాచారం.
చంద్రబాబు ఇంటికి అట్లా చిన్న వెంకటరెడ్డి
అలాగే.. నరసరావుపేట నుంచి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు వైసీపీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకటరెడ్డి వచ్చారు.100 కార్ల భారీ కాన్వాయ్‌తో చంద్రబాబు నివాసం వద్దకు ఆయన, అనుచరులు చేరుకున్నారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరనున్నారు. కాగా.. చంద్రబాబును టీడీపీ సీనియర్ నాయకులు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, ఉక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిల ప్రియ కలిశారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఇన్‌చార్జి ముద్రబోయిన వెంకటేశ్వరరావును పిలిచి చంద్రబాబు మాట్లాడుతున్నారు. చింతలపూడి నియోజకవర్గాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రజకులను ఎస్సీల్లో చేర్చాలంటూ నరసరావుపేటకు చెందిన టీడీపీ రజక నాయకులు చంద్రబాబును కలిసేందుకు ఆయన నివాసం వద్దకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నరసరావు పేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు భారీ ఎత్తున చేరనున్నారు.