Share News

Pawan Kalyan: ఎన్నికల వేళ కులగణన ఎందుకు జగన్..!?

ABN , Publish Date - Jan 26 , 2024 | 10:22 PM

సీఎం జగన్మోహన్ రెడ్డి (CM JAGAN) కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శుక్రవారం నాడు ఎక్స్ వేదికగా ఓ లేఖ రాశారు. ‘AP కుల ఆధారిత జనాభా లెక్కలు' కు సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను ఈ లేఖలో సంధించారు.

Pawan Kalyan: ఎన్నికల వేళ కులగణన ఎందుకు జగన్..!?

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM JAGAN) కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) శుక్రవారం నాడు ఎక్స్ వేదికగా ఓ లేఖ రాశారు. ‘AP కుల ఆధారిత జనాభా లెక్కలు' కు సంబంధించి వైసీపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలను ఈ లేఖలో సంధించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడకుండా చూడాలని సూచించారు. తనపై విమర్శలు చేయకుండా ఈ లేఖలో చెప్పిన సలహాలను పాటిస్తారని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

ఈ లేఖలో పవన్ ఏం చెప్పారంటే...

ఈ కులగణన ఉద్దేశం మీకు ఎన్నికల ముందే ఎందుకు వచ్చింది?

ఈ ప్రక్రియ కారణాలు వివరిస్తూ మీరు ఎందుకు ఏ విధమైన ప్రభుత్వపరమైన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదు?

ఇది రాజ్యాంగం మా అందరికీ ఆర్టికల్ 21 ప్రకారం చెప్పిన వ్యక్తిగత గోప్యత, భద్రతా, స్వేచ్ఛ హరించడం కాదా?

కులగణన మీ ఉద్దేశం ఐతే, మరి మీకు ఉపకులం, ఆదాయం, భూమి యాజమాన్యం వివరాలు, కోళ్లు, మేకలు, ఆవులు, గేదలు ఇవన్నీ ఎందుకు?

బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీమ్ కోర్టులో ఉన్న నేపథ్యంలో, గౌరవ సుప్రీమ్ కోర్ట్ తన తీర్పుని ప్రకటించక ముందే మీరు మీ స్వీయ ప్రయోజనాలకు ఎందుకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు?

జనగణన ఒక సంక్షిప్తమైన ప్రక్రియ, ఇది ఎంతో మంది నిపుణలతో చెయ్యవలసిన ప్రక్రియ, మీ వలంటీర్లకు ఆ అర్హత, సామర్థ్యాలు ఎలా ఉన్నాయ్ అని నిర్ధారించారు?

ఇలాంటి డేటా సేకరణ ప్రక్రియ గతంలో కేంబ్రిడ్జ్ సర్వే చేసినప్పుడు అది ఏ విధంగా సమాజంలో అశాంతిని, అల్లర్లకు ప్రేరేపించాయి అనే విషయం మీకు తెలియదా? వాటిని ఎన్నికల కోసం స్వీయ ప్రయోజనాలకు మీరు ఎలా వాడుకున్నారో మాకు తెలియదు అనుకుంటున్నారా?

ఇవన్నీ మీ అధికార దాహానికి ప్రతీక కాదా? ఒక వేళ కాకపొతే, ఇలా సేకరించిన డేటా ఏ విధమైన దుర్వినియోగం జరగకుండా మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి?

ప్రజల నుంచి డేటా సమ్మతి అనేది మీరు ఎలా తీసుకుంటున్నారు? అందరూ మీ నియంతృత్వానికి తలవంచుతారు అనుకుంటున్నారా?

ప్రభుత్వ వనరులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని స్వీయ ప్రయోజనాలకు వాడుకోవడం, దేశ రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి తూట్లు పోడవటం కాదా?

వలంటీర్లు ద్వారా వైసీపీ ప్రభుత్వం సేకరిస్తున్న కుల గణన, ఇతర వివరాలను ఏ కంపెనీ భద్రపరుస్తారుసుంది అనే అంశంపై శ్వేత పత్రం విడుదల చెయ్యాలి.

వైసీపీ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలపై రాజకీయంగానే న్యాయ పరమైన మార్గాలను కూడా విశ్లేషించే దిశగా ఆలోచిస్తాం అని పవన్ కళ్యాణ్ ఈ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - Jan 26 , 2024 | 10:26 PM