Minister Ravi: వర్షాల నేపథ్యంలో మంత్రి రవి కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 09:21 PM
ఏపీ ప్రాజెక్టుల్లో వరద ఉధృతి పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Ravi Kumar) తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అమరావతి: ఏపీ ప్రాజెక్టుల్లో వరద ఉధృతి పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Minister Ravi Kumar) తెలిపారు. ఆదివారం నాడు సచివాలయంలో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో వర్షాల నేపథ్యంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ముంపు గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని అన్నారు. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాాలు జారీ చేశారు. వరద ప్రభావిత గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే తీవ్ర చర్యలు తప్పవని మంత్రి గొట్టిపాటి రవి హెచ్చరించారు.
కూర రామయ్య సాహనం ఆదర్శనీయం
మరోవైపు.. లైన్‌మెన్ కూర రామయ్య చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని మంత్రి రవి కుమార్ అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
ప్రాణాలకు సైతం తెగించి..
ఆ వర్షాలకు పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే పలు గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో అల్లూరి జిల్లా సున్నంపాడు, దేవరపల్లికి మధ్య నిలిచిపోయిన విద్యుత్‌ను ప్రాణాలకు సైతం తెగించి రామయ్య పునరుద్ధరించిన సంగతి మంత్రి రవికుమార్ దృష్టికి వచ్చింది. దీంతో ఎక్స్(ట్విటర్) వేదికగా మంత్రి ప్రశంసల వర్షం కురిపించారు.
ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది..
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ.."ప్రజలకు సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని లైన్ మన్ రామయ్య నిరూపించారు. ఆయన చేసిన సాహనం తోటి ఉద్యోగులు అందరికీ ప్రత్యక్ష ఉదాహరణ. వరద ఉద్ధృతిని సైతం లెక్క చేయకుండా తీగలపై నడిచి విద్యుత్ పునరుద్ధరించిన రామయ్యకు అభినందనలు. ఆయన సాహసం ఇతర ఉద్యోగులకు ఆదర్శనీయం. సంక్షోభం నుంచి ఎలా బయటపడాలనే విషయంలో అందరికీ ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ప్రజావసరాలను తీర్చడంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రామయ్య నిరూపించారు.