Share News

AP NEWS: ఏపీ ఎన్నికల అధికారులపై ఈసీ ఆగ్రహం

ABN , Publish Date - Jan 09 , 2024 | 09:52 PM

ఏపీ ఎన్నికల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్నీ వివరాలను తేలుసుకున్న తర్వాతే వచ్చామని విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై సీరియస్ అయింది.

AP NEWS: ఏపీ ఎన్నికల అధికారులపై ఈసీ ఆగ్రహం

అమరావతి: ఏపీ ఎన్నికల అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం ( Central Election Commission ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్నీ వివరాలను తేలుసుకున్న తర్వాతే వచ్చామని విజయవాడ, తిరుపతి, అనంతపురం అధికారులపై సీరియస్ అయింది. ఏపీలో ఎన్నికలకు సంబంధిచిన సరళిపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంపై ఇక్కడి అధికారులను నిలదీసింది. ఇక్కడి అధికారులు రాజకీయ వత్తిళ్లకు తట్టుకోలేమంటే వెంటనే తప్పుకోవాలని సూచించింది. ఇక్కడి అధికారులకు రాజకీయ పార్టీలతో అనుబంధం ఉంటే కూడా తప్పుకోమని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల తర్వాత మంచి పోస్టింగ్‌ల్లోకి రావచ్చని తెలిపింది. రాష్ట్రంలో ఏ అధికారి ఎలా ఉన్నారో తమ దగ్గర రిపోర్ట్ ఉందని... తమకు తెలియదనుకోవద్దని కమిషన్ హెచ్చరించింది.

మద్యం, డబ్బు పంపిణీ నిరోధంపై పలు జిల్లాల్లో తీసుకున్న చర్యలపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీ నుంచి ఎందుకు ఇన్ని ఫిర్యాదులు వస్తున్నాయని అధికారులపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. Form -7 పరిశీలనపై EROలు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోగా చర్యలు తీసుకోవాలని ఈసీ హెచ్చరించింది. చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని అధికారులను చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రశ్నించారు. కొంత మంది ఏపీ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బోగస్ పేర్లు తొలగించాలని ఆయా పక్షాలు ఫిర్యాదులు ఇచ్చినా పరిశీలించకపోవడం పట్ల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రాఫ్ట్ జాబితాలో అవే పేర్లు ఉండటం ఏమిటని ఈసీ ప్రశ్నించింది.

Updated Date - Jan 09 , 2024 | 09:52 PM