Share News

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

ABN , Publish Date - Feb 29 , 2024 | 04:13 PM

Andhrapradesh: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు. విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది.

AP News: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు అరెస్ట్

పల్నాడు, ఫిబ్రవరి 29: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) కుమారుడు శరత్ అరెస్ట్ అయ్యారు. విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్‌లో శరత్‌పై కేసు నమోదు అయ్యింది. ఏపీ డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు అయ్యింది. నిధులు మళ్లించి పన్ను ఎగవేసారనే ఆరోపణలపై శరత్‌తో పాటు మొత్తం ఏడుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 420, 409, 467,471, 477(A),120 B రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్లపై కేసు ఫైల్ అయ్యింది. ఎఫ్‌ఐఆర్‌లో పుల్లారావు భార్య, బావమరిదితో పాటు మరో ఐదుగురుపై కేసు నమోదు అయ్యింది. అలెక్సా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పన్ను ఎగవేసారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పుల్లారావు కుమారుడు శరత్ వద్ద ప్రస్తుతం విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్‌లో పోలీసులు స్టేట్‌మెంట్ రికార్డ్ చేస్తున్నారు.

కొడుకు అరెస్ట్‌పై తండ్రి...

కొడుకు అరెస్టుపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఓటమి భయంతో జగన్ రెడ్డి రోజురోజుకీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాజకీయక్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ‘‘మా అబ్బాయి కంపెనీలో డైరెక్టర్‌గా కూడా లేరు, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదు. అలాంటి వ్యక్తికి, జీఎస్టీ ఎగవేతలకు ఏమిటి సంబంధం?’’ అని ప్రశ్నించారు.

చిలకలూరిపేటలో మంత్రి రజిని వైఫల్యాలే వారి ఓటమికి బాటలు పరిచాయన్నారు. అదే సమయంలో నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పార్టీని బలోపేతం చేసుకున్నామన్నారు. ఇవాళ ఎన్నికలకు ముందే గెలుపు ఖాయమై బలమైన స్థాయికి చేరుకున్నామన్నారు. ఇప్పటికే చిలకలూరిపేట నుంచి విడదల రజినీని వేరేచోటకు బదిలీ చేశారన్నారు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటికి పోటీగా నిలపడానికి కూడా వైసీపీ అభ్యర్థులు దొరక్క వెదుక్కుంటోందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కావాలని, పనిగట్టుకుని, అక్కసుతో తమ పై బురద జల్లాలని చూస్తున్నారన్నారు. దిగజారి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమందిని సీఎం లను చూశాను. అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇలాంటి కుట్రపూరిత, కక్షపూరిత రాజకీయాలు, దాడులు, అరెస్టుల్ని మాత్రం ఎక్కడా చూడలేదు. అక్రమ కేసులకు భయపడేది మాత్రం లేదు. దీటుగా ఎదుర్కొంటాం. న్యాయపరమైన మార్గాల ద్వారా చేయాల్సినది చేస్తాం’’ అని ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

TS DSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

Roja: పవన్‌తో పాటు బండ్ల గణేష్‌పై రోజా సంచలన వ్యాఖ్యలు..


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 29 , 2024 | 04:26 PM