Share News

AP Politics: అర్ధరాత్రి పోలీసుల జులుం.. టీడీపీ కార్యకర్త ఇంట్లోకి దూరి..

ABN , Publish Date - Apr 17 , 2024 | 10:10 AM

సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 50 మందికిపై పోలీస్‌ సిబ్బంది, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు.

AP Politics: అర్ధరాత్రి పోలీసుల జులుం.. టీడీపీ కార్యకర్త ఇంట్లోకి దూరి..
Andhra Pradesh Police

మేదరమెట్ల, ఏప్రిల్‌ 16: సోమవారం అర్ధరాత్రి పోలీసులు(AP Police) బాపట్ల జిల్లా(Bapatla) మేదరమెట్ల గ్రామంలో ప్రజలను భయభ్రాంతులను చేశారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 10 మంది ఎస్‌ఐలు, 50 మందికిపై పోలీస్‌ సిబ్బంది, ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌తో గ్రామంలోని ఓ టీడీపీ(TDP) కార్యకర్త ఇంటిని చట్టుముట్టారు. గోడలు దూకి, తలుపులు బాదుతూ హంగామా సృష్టించారు. ఆ ఇంటికి 100 మీటర్ల వరకూ తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎవరూ అటువైపు తొంగి చూడకుండా కట్టడి చేశారు. ప్రశ్నించిన వారికి పోలీస్‌ దురుసు సమాధానమే దిక్కయింది. ఇంటి యజమాని, సామాన్య టీడీపీ కార్యకర్త బోయపాటి శివశంకర్‌ను తమదైన పోలీసు భాషలో డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అంటూ బెదిరించారు. వారి భాషకు, పోలీస్‌ ప్రవర్తనకు వణికిపోతున్న మహిళలను ఓ మూల కూర్చోమంటూ కట్టడి చేశారు. ఇంట్లో అణువణువూ సోదా చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మొదలైన హంగామా, తెల్లవారు ఝాము 4 గంటల వరకూ కొనసాగింది. మొత్తం కలిపి రూ.34,400 స్వాధీనం చేసుకున్నారు.


కుమార్తె బీటెక్‌ కోసం తెచ్చిన సొమ్మన్నా...

కుమార్తె బీటెక్‌ సీటు కోసం డబ్బులు సిద్ధంగా ఉంచినట్లు ఎంత చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఓటర్లకు పంచడానికి సొమ్ము తెచ్చినట్లు పంచనామా రాసివ్వాలంటూ శివశంకర్‌ను బెదిరించారు. సోమవారం తన బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.1.37 లక్షలు డ్రా చేశానని, స్థలం అమ్మగా రూ.2 లక్షలు బయానాగా ఇచ్చారని, అందుకు సంబంధించి అగ్రిమెంట్‌ కూడా ఉందని శివశంకర్‌ చెప్పారు. భార్య డ్వాక్రా గ్రూపు లీడర్‌ కావడంతో వాటికి సంబంధించిన డబ్బులు కూడా ఉన్నాయని తెలిపారు. పోలీసులు శంకర్‌ చెప్పే వివరణను వినడానికి సిద్ధపడలేదు. ముందుగానే నిర్ణయించుకుని వచ్చిన ప్రకారమే శంకర్‌ను బెదిరించారు. శంకర్‌ ససేమిరా అనడంతో ‘మీ ఆవిడను, కూతురిని స్టేషన్‌కు తీసుకుపోతాం’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. దీంతో చేసేది లేక శంకర్‌ సంతకం పెట్టారు. అనంతరం శంకర్‌ తనను కలసిని మీడియాతో మాట్లాడుతూ, ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారంతో తనను, తన భార్యా, పిల్లలను పోలీసులు భయబ్రాంతులకు గురిచేసి, నగదు స్వాధీనం చేసుకున్నారంటూ విలపించారు.


కనీసం రసీదు కూడా ఇవ్వలేదని వాపోయారు. మేదరమెట్ల ఎస్‌ఐ చంద్రశేఖర్‌ దీనిపై స్పందిస్తూ... ‘మాకు వచ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించాం. ఆధారాలు లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేశాం’ అని తెలిపారు. కాగా, ఇది వైసీపీ వారి పన్నాగమేనని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మేదరమెట్లలో కార్యకర్త ఇంట్లో పోలీసులు ఊహించినట్లుగా ఎమ్మెల్యే రవికుమార్‌ రూ.5 కోట్లు ఉంచుతారంటే ఎవరూ నమ్మరని చెప్పారు. గ్రామానికే చెందిన పెద్ద వైసీపీ నేత ఇచ్చిన సమాచారం మేరకు భారీ బలగాలతో సోదాలకు వచ్చారని అందరూ అనుమానిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువుకు, ఆసుపత్రి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బులను పోలీసులు సోదాల పేరుతో ఎత్తుకెళ్లడం అన్యాయమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సోదాలపై పోలీసులు పత్రిలకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2024 | 11:41 AM