Share News

AP Elections: బాబోయ్.. లేడీ బాస్‌ గౌతమి చుక్కలు చూపిస్తున్నారుగా..!

ABN , Publish Date - May 26 , 2024 | 04:56 PM

గౌతమి శాలి.. ఇప్పుడీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్పీని మార్చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని (IPS Gowthami Sali ) నియమించడం జరిగింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది.!

AP Elections: బాబోయ్.. లేడీ బాస్‌ గౌతమి చుక్కలు చూపిస్తున్నారుగా..!
IPS Gowthami Sali

అనంతపురం, ఆంధ్రజ్యోతి మే 26: గౌతమి శాలి.. ఇప్పుడీ పేరు ఎక్కడ చూసినా వినిపిస్తోంది..! ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Elections) పోలింగ్ తర్వాత ఉమ్మడి అనంతపురం జిల్లాలో, ముఖ్యంగా తాడిపత్రిలో పెద్ద ఎత్తున గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఎస్పీని మార్చేసిన ఎన్నికల కమిషన్.. జిల్లా ఎస్పీగా గౌతమి శాలిని (IPS Gowthami Sali ) నియమించడం జరిగింది. మేడమ్ అనంతలో అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతోంది.! గొడవలకు దిగాలన్నా రాజకీయ నేతలు, రౌడీ షీటర్లు బయపడిపోతున్నారు. ఇక ఇప్పటి వరకూ అధికార వైసీపీకి అనుకూలంగా ఉండి, వత్తాసు పలికిన వారు కూడా జంకుతున్న పరిస్థితి. ఫలానా పోలీసు కానీ.. ఉన్నతాధికారి గానీ రాజకీయ నేతకు సపోర్టు చేస్తున్నారని తెలిస్తే చాలు, క్రాస్ చెక్ చేసి గంటల వ్యవధిలోనే ఇంటికి పంపించేస్తున్నారు గౌతమి.


IPS-Gowthami-Shalini-2.jpg

తాజాగా ఇదీ పరిస్థితి!

ఎస్పీగా గౌతమి శాలి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తప్పుచేసిన అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే.. వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని అనంతపురం స్పెషల్ బ్రాంచ్ సీఐ జాకీర్ హుస్సేన్‌పై ఆరోపణలు రావడంతో వెంటనే ఎస్పీ రంగంలోకి దిగిపోయారు. సీఐపై చర్యలకు అధికారులను ఆదేశించారు. చర్యల్లో భాగంగానే జాకీర్ హుస్సేన్‌ను రాష్ట్ర పోలీస్ డీజీ కార్యాలయంలో సరెండర్ కావాలని ఎస్పీ ఆదేశించారు. కాగా.. జాకీర్ హుస్సేన్ పదేళ్లకు పైగా అనంతపురంలోని పలు పోలీస్ స్టేషన్‌‌లలో విధులు నిర్వహించారు. అధికార పార్టీ నేతలతో అంటకాగుతూ టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని ఆయన పెద్దఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు సీఐ‌పై టీడీపీ నేతలు కూడా పలుమార్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సందర్భాలు చాలానే ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మేడమ్ రావడంతో.. జాకీర్ పాపం పండిందని సీఐ బాధితులు చెప్పుకుంటున్నారు.


IPS-Gowthami-Shalini-3.jpg

తీగలాగితే..!

జాకీర్ హుస్సేన్‌ టూ టౌన్ సీఐగా పనిచేస్తున్నప్పుడు కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఆర్యవైశ్య వృద్ధులను బెదిరించినట్లు పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం కూడా పోలీస్ హైకమాండ్‌కు తెలియడంపై అతనిపై చర్యలకు ఆదేశించడం జరిగింది. బళ్లారికి చెందిన ఆర్యవైశ్యుల భూమిని కబ్జా చేయడానికి యత్నించిన ఓ వైసీపీ నేతకు.. జాకీర్ వంత పాడారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. వైసీపీ నేతల ఒత్తిడితో భూ యజమానుల బంధువులపై కూడా అక్రమ కేసులు పెట్టినట్లు ఎస్పీ గౌతమిశాలికి బళ్లారికి చెందిన సత్యనారాయణ శెట్టి ఫిర్యాదు చేశారు. నాటి నుంచి నేటి వరకూ ఆయనపై ఉన్న ఆరోపణలు, చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. దీంతో జాకీర్‌ను రాష్ట్ర పోలీసు డీజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ గౌతమి శాలి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.


IPS-Gowthami-Shalini.jpg

అటు వార్నింగ్.. ఇటు ప్రశంసలు!

ఈ చర్యలతో ఇకపై ఎవరైనా ప్రజల కోసం కాకుండా రాజకీయ పార్టీలు, నేతలకు వత్తాసు పలుకుతూ పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ.. పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు పోలీసు అధికారులకు క్లియర్ కట్‌గానే అర్థం అయ్యే ఉంటుందేమో..! ఇక సోషల్ మీడియా వేదికగా అయితే గౌతమిని మెచ్చుకుంటున్నారు.. ఇన్నిరోజులు ఎక్కడున్నారు మేడమ్.. ఇక తాటతీసేయండి..! అని కొందరు..‘ మేడమ్ సార్.. మేడమ్ అంతే’ అని మరికొందరు నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. వాస్తవానికి గౌతమి ఎక్కడ విధులు నిర్వహించినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా పనిచేస్తారన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అనంతలో కూడా తన మార్క్ పోలీసింగ్ చూపించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని సామాన్యులు సైతం ప్రశంసిస్తున్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - May 26 , 2024 | 05:00 PM