Share News

AP Elections: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీఐ సంచలన నిర్ణయం.. వారిపై తప్పని వేటు..!

ABN , Publish Date - Feb 24 , 2024 | 03:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సందర్భంగా అధికారుల బదిలీలపై భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల్లో భాగంగా...

AP Elections: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈసీఐ సంచలన నిర్ణయం.. వారిపై తప్పని వేటు..!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (Andhra Pradesh Assembly Elections) జరగనున్న సందర్భంగా అధికారుల బదిలీలపై భారత ఎన్నికల సంఘం (ECI) ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనల్లో భాగంగా మూడేళ్లు సర్వీసు దాటిన అధికారులు.. ఒకే పార్లమెంటు నియోజకవర్గంలో ఉండకూడదని ఈసీఐ స్పష్టం చేసింది. ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణిస్తామని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శకాల ప్రకారం అధికారుల పోస్టింగ్.. రెండు వేర్వేరు జిల్లాలకు జరిగినా, ఒకే పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉండకూడదని స్పష్టం చేసింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా బదిలీలు చేస్తే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

సదరు అధికారులు ఎన్నికల విధులకు ఆటంకం కలిగించకుండా ఈసీఐ పటిష్టమైన చర్యలు చేపడుతుందని తెలిపింది. అధికారుల బదిలీలు రెండు వేర్వేరు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉండేలా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. ఎన్నికల నిబంధనల మేరకు బదిలీ చేసినట్టు మభ్యపెట్టకుండా యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. ఇప్పటివరకూ చేసిన అన్ని బదిలీలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది. ఎన్నికలతో సంబంధం ఉన్న వారితో పాటూ పర్యవేక్షణ స్థాయిలో ఉన్న అధికారులు ఒకే ప్రాంతంలో మూడేళ్లుగా ఉంటే.. బదిలీ చేయాల్సిందేనని ఈసీఐ తేల్చి చెప్పింది. ఎన్నికల్లో సమాన అవకాశాలు లేకుండా చేసే వారిపట్ల ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలిపింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు పూర్తైన 5 రాష్ట్రాల్లో సీనియర్ స్థాయిలోని అధికారులపైనా బదిలీ వేటు వేసినట్టు స్పష్టం చేస్తూ.. భారత ఎన్నికల సంఘం నోట్ విడుదల చేసింది.

Updated Date - Feb 24 , 2024 | 03:01 PM