Share News

AP Elections: రాజానగరం 'రాజు' ఎవరు..?

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:01 PM

ఏపీలో ఎన్నికల యుద్ధానికి పార్టీలు సిద్ధమయ్యాయి. నాలుగో విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ(TDP), జనసేన(janasena), బీజేపీ (BJP) కూటమికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది.

AP Elections: రాజానగరం 'రాజు' ఎవరు..?
Rajanagaram Assembly constituency

ఏపీలో ఎన్నికల యుద్ధానికి పార్టీలు సిద్ధమయ్యాయి. నాలుగో విడతలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తైంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ(TDP), జనసేన(janasena), బీజేపీ (BJP) కూటమికి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వైసీపీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా.. టీడీపీ 144, జనసేన 21, బీజేపీ 10 స్థానాల్లో పోటీకి సిద్ధమయ్యాయి. అభ్యర్థులు ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నారు. నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉండగా.. ఇక్కడ ఎక్కువ సీట్లు గెలిచినవాళ్లదే అధికారం అనే నానుడి ఉంది. దీంతో ఈ జిల్లాపై అన్ని పార్టీలు ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా ఈ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుండగా.. అందులో ఒకటి రాజానగరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పోటీ చేస్తుండగా.. టీడీపీ,జనసేన, బీజేపీ కూటమి తరపున జనసేన అభ్యర్థి బలరామకృష్ణ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉంది.. ఇక్కడ అభ్యర్థుల విజయంపై ప్రభావం చూపించే అంశాలు ఏమిటో తెలుసుకుందాం.

YS Sunitha.. వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి: వైఎస్‌ సునీత

వైసీపీ బలం, బలహీనతలు..

వైసీపీ తరపున జక్కంపూడి రాజా పోటీ చేస్తున్నారు. ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో నియోజకవర్గ ప్రజలతో ఎక్కువ పరిచయాలు ఉన్నాయి. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు గతంలో మంత్రిగా పని చేశారు. జక్కంపూడి కుటుంబం సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉంటూ వస్తోంది. రామ్మోహనరావు మరణం తర్వాత ఆమె భార్య విజయలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా 2014 ఎన్నికల్లో రాజానగరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019లో ఆ సీటు జక్కంపూడి విజయలక్ష్మి కుమారుడు రాజాకు కేటాయించారు. యువకుడు కావడం, నియోజకవర్గంలో తన సామాజిక వర్గం ప్రజలు ఎక్కువుగా ఉండటంతో.. 30 వేల మెజార్టీతో ఆయన గెలిచారు. ఈ నియోజకవర్గం రాజమండ్రి, కాకినాడ నగరాలకు దగ్గరగా ఉంటుంది. అయినప్పటికి పూర్తి గ్రామీణ వాతావరణం కలిగిన నియోజకవర్గం. ఇక్కడ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. దీంతో నియోజకవర్గం అభివృద్ధికి రాజా ఇచ్చిన హామీలు ఆయనను 2019లో గెలిచేలా చేశాయి.

ఐదేళ్ల కాలంలో నియోజకవర్గం అభివృద్ధికి చెప్పుకోదగ్గ స్థాయిలో చేయలేదనే అభిప్రాయంతో నియోజకవర్గం ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. సొంత సామాజిక వర్గాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అసంతృప్తితో కొందరు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలోని కొన్ని పల్లెలకు బస్సు సౌకర్యమూ లేదంటే ఆశ్చర్యం కాదు. పేరుకు మండల కేంద్రమైనా.. రాజానగరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. దీంతో పదో తరగతి పూర్తైన తర్వాత.. ఇంటర్మీడియట్ చదవాలంటే ఈ మండలానికి చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కావాలని రాజానగరం ప్రజలు కోరుకుంటున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఉన్న ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవు. తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తే రాజానగరం సమీపంలో ఉన్న ఓ వైద్య కళాలకు చెందిన ఆసుపత్రికి లేదా రాజమండ్రికి వెళ్లాల్సిన పరిస్ధతి. దీంతో ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయినప్పటికి గెలుపు కోసం జక్కంపూడి రాజా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యర్థి సొంత సామాజిక వర్గమే కావడం రాజాకు కొంత మైనస్‌గా చెప్పుకోవచ్చు.

జనసేనకు బలం, బలహీనతలు..

2008 నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా రాజానగరం నియోజకవర్గం ఏర్పడింది. 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 2009, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ గెలుపొందారు. ప్రస్తుతం పొత్తులో భాగంగా కూటమి తరపున జనసేన అభ్యర్థి బ‌త్తుల బ‌ల‌రామ‌కృష్ణ పోటీ చేస్తున్నారు. సామాజిక వర్గ సమీకరణలు బలరామకృష్ణకు కలిసిరానున్నాయి. ఓ వైపు టీడీపీ మద్దతు ఉండటం జనసేనకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడిగా గుర్తింపు పొందారు. సొంత డ‌బ్బుల‌తో ఆప‌ద‌లో ఉన్న పేద ప్ర‌జ‌ల‌కు ఆర్థిక చేయూత‌నందిస్తూ ఉండటం ఈ ఎన్నికల్లో బలరామకృష్ణకు ప్లస్‌గా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకత జనసేన అభ్యర్థికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ ప్రభావం ఈ నియోజకవర్గంపై పడే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ పోటీలో ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో కూటమి ముందుకు వెళ్తోంది. మరోవైపు నియోజకవర్గం వ్యాప్తంగా బూత్ స్థాయిలో జనసేన క్యాడర్‌ను బలోపేతం చేసుకోలేదనే విమర్శ ఉంది. పార్టీపై అభిమానం ఉన్న వాళ్లు ఎక్కువమంది ఉన్నా.. వారందరినీ సభ్యులుగా చేర్చుకుని.. బూత్ స్థాయి కమిటీలో పూర్తి స్థాయిలో వేయకపోవడం మైనస్‌గా చెప్పుకోవచ్చు. కూటమి తరపున పోటీ చేస్తుండటంతో టీడీపీ క్యాడర్ పూర్తిస్థాయిలో సహకరిస్తే ఇక్కడ జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రాజానగరం రాజు ఎవరనేది జూన్ 4న తేలనుంది.

AP Elections: ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 02 , 2024 | 07:07 PM