CM Chandrababu : పతనం నుంచి పునరుత్థానం
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:44 AM
2019లో సీఎం పీఠాన్ని అధిరోహించిన జగన్.. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన ప్రారంభించారు.

చరిత్రలో నిలిచిపోయేలా 2024 ప్రజాతీర్పు
విర్రవీగిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ
విధ్వంస పాలనకు చరమగీతం
కూటమి రాకతో అభివృద్ధికి రాచబాట
నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు
సీఎం కృషితో పుంజుకున్న రాజధాని పనులు
పోలవరం నిర్మాణానికి కేంద్రం నిధులు
భారీ పెట్టుబడులతో తరలి వస్తున్న పరిశ్రమలు
ఆరు నెలల్లోనే స్పష్టంగా కనిపిస్తున్న మార్పు
2024 నవ్యాంధ్ర చరిత్రలో చిరకాలం నిలిచిపోతుంది. ఐదేళ్ల పాటు వైసీపీ ప్రభుత్వ అరాచకాలతో విసుగెత్తి పోయిన ప్రజలు 2024లోనే తిరుగులేని తీర్పిచ్చారు. మాకు ఎదురేలేదు అని విర్రవీగిన పాలకులకు ప్రతిపక్షంలో కూడా కూర్చునే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రజలు దాదాపు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పు.. ఆంధ్రప్రదేశ్‌లో నవశకానికి నాంది పలికింది. వైసీపీ అరాచకాలతో అథఃపాతాళానికి పడిపోయిన రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వ చొరవతో మళ్లీ ఊపందుకుంటోంది. ఐదేళ్ల పతనం తర్వాత పునరుత్థానం దిశగా నవ్యాంధ్ర పయనం ప్రారంభించింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
2019లో సీఎం పీఠాన్ని అధిరోహించిన జగన్.. ప్రజావేదిక కూల్చివేతతో తన విధ్వంసక పాలన ప్రారంభించారు. మూడు రాజధానులు అంటూ అమరావతి నిర్మాణాన్ని నిలిపేశారు. ఐదేళ్ల పాటు రాజధాని పేరు చెప్పుకోలేని పరిస్థితి కల్పించారు. ఉన్న పరిశ్రమలను వెళ్లగొట్టారు. వచ్చే వాటిని అడ్డుకున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, కొత్త పెట్టుబడులు నిలిచిపోయాయి. దీంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. నిరుద్యోగులు పెరిగిపోయారు. చదువుకున్న యువత ఉపాధి వెతుక్కుంటూ పొరుగురాష్ట్రాలకు వలస వెళ్లిపోయింది. ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఇవ్వాల్సిన డబ్బును దారి మళ్లించి వారిని ఇబ్బందికి గురిచేశారు. ఇసుక నిలివేయడంతో పనుల్లేక భవన నిర్మాణ కార్మికులు విలవిల్లాడిపోయారు.
ఇసుక, మద్యం, గనులు దోపిడీదారులకు రాజమార్గాలయ్యాయి. ప్రైవేట్, ప్రభుత్వ భూములను వైసీపీ నేతలు కబ్జా చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని హింసించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను జైళ్లకు పంపి రాజకీయంగా వేధించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఈ ఏడాది మే నెలలో జరిగాయి. వైసీపీ నేతలు తలెత్తుకోలేని విధంగా ప్రజలు తీర్పిచ్చారు. టీడీపీ నాయకత్వంలోని కూటమి అప్రతిహత మెజారిటీతో అధికార పీఠాన్ని అధిరోహించింది. నాలుగోసారి చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అధికార మార్పిడి రాష్ట్రంలో ప్రజలు స్వేచ్ఛగా గాలి పీల్చుకొనే వాతావరణాన్ని కల్పించింది.
పాలనలో స్పష్టమైన మార్పు
పాలనలో కూడా ప్రజలకు ఊరటనిచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. తమపై ఎవరో నిరంతరం నిఘా పెట్టారన్న భయకంపిత వాతావరణం నుంచి విముక్తమయ్యామని ప్రజలే చెబుతున్నారు. ధాన్యాన్ని అమ్మితే రైతులకు గతంలో మూడు నాలుగు నెలల వరకూ డబ్బులు అందేవి కావు. ఇప్పుడు రెండు రోజుల్లోపే వారికి చేరుతున్నాయి. పేదల పింఛను రూ. నాలుగు వేలకు, దివ్యాంగుల పింఛను రూ. ఆరు వేలకు పెంచారు. రోడ్ల మరమ్మతులకు రూ. వెయ్యి కోట్లు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. మద్యంలో నాణ్యత తక్కువగా ఉన్న బ్రాండ్లను తొలగించి పాపులర్ బ్రాండ్లను ప్రవేశపెట్టారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి ట్రాక్టర్ల ద్వారా ఎవరైనా రేవుల్లోకి వెళ్ళి తెచ్చుకొనే అవకాశం కల్పించారు. నిర్మాణ రంగం పుంజుకోవడంతో భవన నిర్మాణ కార్మికులకు పనులు పెరిగాయి. కేంద్రం నుంచి రూ. లక్ష కోట్ల విలువైన జాతీయ రహదారులు మంజూరు కావడంతో పలు ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. ఓ పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమంతో రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదాన పరుగులు పెట్టిస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది.
అభివృద్ధి దిశగా అడుగులు..
కూటమి పార్టీలు ఏకంగా తొంభై మూడు శాతం సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించాయి. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్ధానాల్లో గెలిచి నూరు శాతం స్ర్టైక్ రేటు సాధించింది. లోక్‌సభ సీట్లలో కూడా ఇదే మాదిరి ఘన విజయం దక్క డం ఆంధ్రప్రదేశ్‌కు అనుకోని అదృష్టంగా మారింది. కేంద్రం లో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ మద్దతు కీలకంగా మారింది. దీంతో ఢిల్లీలో పలుకుబడిని పెంచింది. రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులను సాధించడానికి ఈ పరిస్ధితిని వినియోగించుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టారు. దీనితో కొద్ది నెలల్లోనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మొదలు పెట్టింది.
వేగంగా అమరావతి, పోలవరం పనులు
కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి వంద రోజుల్లోనే రాజధాని అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల మేర ప్రపంచ బ్యాంక్ రుణం మంజూరుకు మార్గం సుగమమైంది. మరో రూ. 16 వేల కోట్లు రుణంగా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ హడ్కో ముందుకు వచ్చింది. దీనితో రాజధాని నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజధాని పూర్తవుతుందన్న నమ్మకం కూడా పజల్లో కలిగింది. అమరావతిలో జనవరి నుంచి పనులు ప్రారంభించి మూడేళ్లలో వాటిని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా వేగంగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలతో ఈ ప్రాజెక్టు తొలి దశ పూర్తికి రూ. 35 వేల కోట్లు మంజూరుకు కేంద్రం అంగీకరించింది. దీనితో ఈ ప్రాజెక్టు పనులు కూడా పట్టాలెక్కబోతున్నాయు.
పెట్టుబడుల వరద
కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో తిరిగి అడుగు పెట్టబోనని గత ప్రభుత్వ హయాంలో ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయిన లులూ గ్రూప్ తిరిగి విశాఖలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది. రూ. 95 వేల కోట్ల పెట్టుబడితో నెల్లూరు జిల్లాలోని రామాయపట్నంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్ ముందుకు వచ్చింది. సౌదీ ఆరాం కో ఇందులో భాగస్వామి కాబోతోంది. ఆర్సెలార్ నిప్పన్ సంయుక్త సంస్థ రూ. 1.40 లక్షల కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లాలో భారీ ఉక్కు పరిశ్రమ నెలకొల్పబోతోంది. గూగుల్ సంస్థ విశాఖలో ఏఐకి సంబంధించి డేటా సెంటర్ నిర్మాణానికి ఎంఓయూ కుదుర్చుకొంది. విశాఖలో సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. బిట్స్ పిలానీ, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అమరావతిలో క్యాంప్‌సలు ఏర్పాటు చేస్తున్నాయి. విశాఖ వద్ద కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక ఫార్మా సెజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తిలో పారిశ్రామిక క్షేత్రాల ఏర్పాటు కానున్నాయి. సుమారుగా ఇరవై రంగాలకు సంబంధించిన విధానాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అసెంబ్లీలో ఆమోదించి పెట్టుబడిదారులకు భరోసా కల్పించింది.