CM Chandrababu : రాష్ట్రానికి కొత్తగా 9 భారీ ప్రాజెక్టులు
ABN , Publish Date - Dec 31 , 2024 | 03:58 AM
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ...

మరో 1.82 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు
2.63 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
చంద్రబాబు అధ్యక్షతన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు భేటీ
సకాలంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశం
మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని నిర్దేశం
అమరావతి, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్), టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తదితర దిగ్గజ పారిశ్రామిక సంస్థలు సహా పలు కంపెనీలు రాష్ట్రంలో మరో రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న 9 ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలిపింది. ఈ కొత్త ప్రాజెక్టుల ద్వారా 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంలో వివిధ సంస్థలు ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుల గురించి సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించారు. వాటిపై చర్చించి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న పారిశ్రామిక సంస్థలకు భూ కేటాయింపులతో పాటు అవసరమైన మౌలిక వసతులను శరవేగంగా కల్పించాలని, అదే సమయంలో ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సమయంలో ప్రాజెక్టులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాల ద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షించాలని సూచించారు. తాజా ప్రాజెక్టులు, వాటి పెట్టుబడులు, తద్వారా లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. గత నెల 19న జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపిన వివిధ ప్రాజెక్టుల పురోగతి గురించి కూడా చంద్రబాబు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ
నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6వేల ఎకరాల్లో రూ. 96,862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీని బీపీసీఎల్ ఏర్పాటు చేయనుంది. 2,400 మందికి ఉపాధి కలుగుతుంది. 9 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఐదు బ్లాకుల్లో రానున్న ఈ ప్రాజెక్టులో టౌన్‌షిప్, లెర్నింగ్ సెంటర్, రిఫైనరీ, పెట్రో కెమికల్స్ యూనిట్స్, క్రూడ్ ఆయిల్ టెర్మినల్, గ్రీన్ హెచ్2, అడ్మినిస్ట్రేషన్ బ్లాకులు నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రానికి రూ.88,747 కోట్ల ఆదాయం లభిస్తుంది. 2029లోగా ప్రాజెక్టు పూర్తయ్యేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
విశాఖలో టీసీఎస్
విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్‌లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎస్) రూ. 80 కోట్ల పెట్టుబడితో కార్యాలయాన్ని పెట్టనుంది. ఇందులో 2వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
సత్యసాయి జిల్లాలో ఆజాద్ మొబిలిటీ ఇండియా ప్రాజెక్టు
శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మొబిలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థ 70.71 ఎకరాల్లో ఎలక్ట్రిక్ త్రీ వీలర్, ట్రక్కులు, బస్సులు, బ్యాటరీ ప్యాక్‌ల గ్రీన్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. రూ.1,046 కోట్ల పెట్టుబడితో వచ్చే ఆరేళ్లలో మూడు దశలుగా ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఇందులో 2,381 మందికి ఉపాధి కలుగుతుంది.
రాంబిల్లిలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ యూనిట్
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో 106 ఎకరాల విస్తీర్ణంలో బాలాజీ యాక్షన్ బిల్డ్‌వెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీఎఫ్/ పర్టికల్ బోర్డు ప్లాంట్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పనుంది. రూ.1,174 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌లో 1,500 మందికి ఉపాధి లభిస్తుంది.
క్లిక్ అయిన క్లీన్ ఎనర్జీ పాలసీ
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీ వల్ల పలు సంస్థలు భారీ పెట్టుబడులతో రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. కొత్తగా ఐదు సంస్థలు రూ.83 వేల కోట్ల పెట్టుబడితో వివిధ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నాయి. దీంతో క్లీన్ ఎనర్జీ రంగంలోనే రెండున్నర లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కాకినాడలో ఏఎం గ్రీన్ అమ్మోనియా తయారీ
ఏఎం గ్రీన్ అమ్మోనియా(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కాకినాడలో 592 ఎకరాల్లో మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత అమ్మోనియా తయారీ కేంద్రంను రూ.12,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రంలో 2,600 మందికి ఉపాధి కలుగనుంది.
జాన్ కోకిరిల్ గ్రీన్‌కో..
కాకినాడలోని40 ఎకరాల్లో జాన్ కోకిరిల్ గ్రీన్‌కో హైడ్రోజన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2 గిగావాట్ల సామర్థ్యంతో ఎలకో్ట్రలైజర్ తయారీ యూనిట్‌ను రూ.2 వేల కోట్లతో స్థాపించనుంది. ఇక్కడ 500 మందికి ఉపాధి కలుగుతుంది.
కర్నూలు జిల్లాలో టాటా పవర్..
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సంస్థ కర్నూలు జిల్లాలోని హోసూరు, పెద్ద హుల్తిల్లో మొత్తం 1,800 ఎకరాల్లో రూ.2 వేల కోట్ల పెట్టుబడితో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఇందులో 1,380 మందికి ఉపాధి లభిస్తుంది.
కడప, నంద్యాల జిల్లాల్లో క్లీన్ ఎనర్జీ..
కడప జిల్లాలోని మైలవరం, కొండాపురం, నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్లలో మొత్తం 1,080 ఎకరాల్లో 119 మెగావాట్ల పవన శక్తి, 130 మెగావాట్ల సౌర శక్తి హైబ్రీడ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రిడ్ త్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ .2 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. వీటిలో 650 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ బయోగ్యాస్ ప్లాంట్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రాష్ట్రంలో తాజాగా రూ.65 వేల కోట్ల పెట్టుబడులు పెడుతోంది. రాష్ట్రమంతటా 5 లక్షల ఎకరాల్లో 11 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. వీటిలో 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. 2028 కల్లా ఈ ప్రాజెక్టు పూర్తికానుందని, దీని ద్వారా రాష్ట్రానికి రూ.4,095 కోట్ల ఆదాయం రానుందని అధికారులు సీఎంకు వివరించారు.