Share News

Nara Lokesh: అక్కడ కిమ్‌.. ఇక్కడ జిమ్‌!

ABN , Publish Date - Mar 11 , 2024 | 09:08 AM

Nara Lokesh: ‘నార్త్‌ కొరియాలో ఒక నియంత కిమ్‌ ఉన్నాడు.. ఆంధ్రాలోనూ ఓ నియంత ఉన్నాడు.. ఇతడి పేరు జిమ్‌. హెయిర్‌ స్టైల్‌లో తప్ప ఇద్దరూ సేమ్‌ టు సేమ్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. మలి విడత శంఖారావంలో భాగంగా.. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు.

Nara Lokesh: అక్కడ కిమ్‌.. ఇక్కడ జిమ్‌!

 • హెయిర్‌ స్టైల్‌ తప్ప.. ఇద్దరూ ఒకటే: లోకేశ్‌

 • కొరియా పాలకుడికి 17 ప్యాలెస్‌లు

 • ఇక్కడ జగన్‌కు ఆరు ప్రాసాదాలు

 • బాబాయిని, అన్నను కిమ్‌ లేపేశాడు

 • ఆంధ్రా జిమ్‌ బాబాయిని వేశాడు

 • జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో

 • తాడేపల్లి భవంతిలో టీవీలు పగిలాయ్‌

 • జగన్‌లా పరదాల మాటున లేను...

 • తప్పుచేసి ఉంటే అరెస్టు చేసుకోవచ్చు

 • సూపర్‌ సిక్స్‌తో అన్ని వర్గాలకు న్యాయం

 • కార్యకర్తలూ 2 నెలలు కష్టపడండి

 • రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది మనమే

 • శంఖారావంలో యువనేత స్పష్టీకరణ

అనంతపురం మార్చి 10 (ఆంద్రజ్యోతి):

‘నార్త్‌ కొరియాలో ఒక నియంత కిమ్‌ ఉన్నాడు.. ఆంధ్రాలోనూ ఓ నియంత ఉన్నాడు.. ఇతడి పేరు జిమ్‌. హెయిర్‌ స్టైల్‌లో తప్ప ఇద్దరూ సేమ్‌ టు సేమ్‌’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఎద్దేవాచేశారు. మలి విడత శంఖారావంలో భాగంగా.. ఆదివారం అనంతపురం జిల్లా ఉరవకొండ, రాయదుర్గం, కల్యాణదుర్గంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కిమ్‌లాగే జగన్‌ నియంత పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయన అధికారంలోకి వచ్చాక.. ప్రశ్నించే వారి గొంతు నొక్కడం పరిపాటైందని దుయ్యబట్టారు.

‘కిమ్‌కు 17 ప్యాలెస్‌లుంటే.. ఆంధ్రా జిమ్‌ జగన్‌కు 6 ప్యాలెస్‌లున్నాయి. కిమ్‌ సొంత బాబాయిని, అన్ననే లేపేశాడు.. ఆంధ్రా జిమ్‌ కూడా బాబాయిని లేపేశాడు. తల్లి, చెల్లిని మెడపట్టి బయటకు గెంటేశాడు. కిమ్‌ వీడియో గేమ్‌లాడితే.. జిమ్‌ పబ్జీ ఆడుతున్నాడు. కిమ్‌ దొంగ నోట్లు, గంజాయి, సిగరెట్లు తయారు చేసి అమ్ముతుంటే.. జిమ్‌ గంజాయి, డ్రగ్స్‌, నకిలీ మందు, బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, త్రీ కేపిటల్‌ అమ్ముతున్నాడు. కిమ్‌ 340 మందిని చంపేయడంతోపాటు వేలాది మందిని జైలుకు పంపించాడు. జిమ్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులను ఇబ్బంది పెట్టి అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు’ అని విరుచుకుపడ్డారు. కిమ్‌ తన వద్ద ఉన్న వారికి విలాసవంతమైన భవనాలు కట్టిస్తాడనీ, జగన్‌ అదే తరహాలో పనికిమాలిన సలహాదారులను పెట్టుకుని రూ.కోట్లు తగలేస్తున్నాడన్నారు. ‘నాయనా జగన్‌.. డేటు, టైం నువ్వు ఫిక్స్‌ చెయ్‌.. నువ్వు పెట్టిన బూమ్‌ బూమ్‌ మద్యం షాపు వద్దకు వెళదాం. ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో విందాం. అందుకు నీవు సిద్ధమా’ అని సవాల్‌ విసిరారు. జగన్‌ రోజూ ఏం తాగుతాడని ప్రజలను ఆయన ప్రశ్నించారు. బూమ్‌ బూమ్‌.. ప్రెసిడెంట్‌ మెడల్‌.. ఆంధ్రా గోల్డ్‌.. ప్రజల రక్తమా అని అడుగగా.. వీటిలో నాలుగో ఆప్షన్‌.. ప్రజల రక్తం తాగుతాడని జనం చేతులెత్తి చూపించారు. ‘అనకాపల్లి టౌన్‌లో ఒక తల్లి మూడు జే బ్రాండ్‌ మద్యం బాటిళ్లు పట్టుకొని వచ్చింది. ఈ జే బ్రాండ్లు తాగి తన ఇంట్లో ముగ్గురు చనిపోయారని వాపోయిం ది. జే బ్రాండ్లు విషం కంటే దారుణంగా ఉన్నాయనీ, ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని కోరింది. ప్రతి ఊరిలో మనుషులు చనిపోతున్నారు. ఎప్పుడూలేని విధంగా లివర్‌ ఫెయిల్‌ అయి, జనం ఆస్పత్రి పాలవుతున్నారు. ఇది తెలిశాక ఈ జే బ్రాండ్లను ల్యాబ్‌ టెస్టులకు పంపించాను. ఏం తేలిందంటే.. పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు చస్తాయో లేదో తెలియదు గానీ.. ఈ జే బ్రాండ్‌ మందు కొడితే మాత్రం పురుగు పారిపోతుందని చెప్పారు’ అని తెలిపారు.


ఇంకా ఏమన్నారంటే.. మీ పాలిట మూర్ఖుడిని..

ఎన్టీఆర్‌ దేవుడు.. చంద్రబాబు రాముడైతే.. వైసీపీ నాయకుల పాలిట లోకేశ్‌ మూర్ఖుడు. చట్టాన్ని ఉల్లంఘించి ఇబ్బందులు పెట్టిన అధికారులు, వైసీపీ నాయకుల పేర్లు ఈ రెడ్‌ బుక్‌లో ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జ్యుడీషియల్‌ విచారణ చేయించి, ఆయా అధికారులను ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయడంతోపాటు జైలుకు పంపించే బాధ్యత నాది. ఈ రెడ్‌బుక్‌ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. లోకేశ్‌ ఊరూరా వెళ్లి రెడ్‌ బుక్‌పేరుతో బెదిరిస్తున్నాడని.. నాపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ ఇవ్వాలని అడిగారు. నేను తప్పుచేసి ఉంటే అరెస్టు చేసుకోవచ్చు. పసుపు సైనికుల పేరుతో జన సైనికులను తిట్టినట్లు.. జనసైనికుల పేరుతో పసుపు సైనికులను తిట్టినట్లు వైసీపీ కుట్ర పన్నుతోంది. టీడీపీ, జనసేన శ్రేణులందరూ అప్రమత్తంగా ఉండాలి. మంగళగిరి నుంచి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు నాకు ఫోన్‌ చేశాడు. తాడేపల్లి చెత్తబుట్టలన్నింటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయని చెప్పాడు. ఎందుకని అడిగితే... టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో టీవీలన్నీ ఈ సైకో జగన్‌ పగలగొట్టాడని చెప్పాడు.

ప్రతి బీసీ సోదరుడికీ నెలకు 4 వేలు!

జగన్‌.. ఐదేళ్లలో బీసీలకు నువ్వు చేసిందేంటి? 26 వేల మంది బీసీలపై దొంగ కేసులు పెట్టావు. 300 మంది బీసీలను నీ ప్రభుత్వం చంపేసింది. స్థానిక సంస్థల్లో వారికి 10 శాతం రిజర్వేషన్‌ను తొలగించావు. బీసీలకు రావాల్సిన 30 సంక్షేమ పథకాలు రద్దు చేశావ్‌. బీసీ సబ్‌ ప్లాన్‌ కింద రావాల్సిన రూ.75 వేల కోట్ల నిధులను దారి మళ్లించావు. బీసీ సోదరులకు టీడీపీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. జయహో బీసీ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించాం. 50 ఏళ్లు నిండిన బీసీ సోదరులకు ప్రతి నెలా రూ.4 వేల చొప్పున అందిస్తాం. ప్రిజనరీ జగన్‌.. విజినరీ చంద్రబాబుకు మధ్య తేడా గుర్తించండి. చంద్రబాబు కేవలం 600 ఎకరాలను సేకరించి కియ పరిశ్రమ తెచ్చారు. తద్వారా 50 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సీఎంగా ఉన్నపుడు లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కోసం 8,844 ఎకరాలు, సైన్స్‌ సిటీ కోసం 8వేల ఎకరాలు సేకరించారు. ఇంత భూమి సేకరించినా.. ఒక్క పరిశ్రమ వచ్చిందా.. ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? మా కూటమి అధికారంలోకి రాగానే ఆ భూములను వెనక్కి తీసుకుని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. రూ.10 వేల కోట్ల విలువైన లేపాక్షి నాలెడ్జ్‌ భూములను కేవలం రూ.500 కోట్లతో కొనేందుకు జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రయత్నం చేశాడు.


Selfie-Challange.jpg

జగన్‌కు సెల్ఫీ చాలెంజ్‌!

రాయలసీమ బిడ్డనని చెప్పుకొనే జగన్‌కు లోకేశ్‌ సెల్ఫీ చాలెంజ్‌ విసిరారు. ఆయన పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. గజ దొంగ జగన్‌ కావాలో.. విజనరీ లీడర్‌ చంద్రబాబు కావాలో సీమ ప్రజలు ఆలోచించాలని కోరారు. ఉరవకొండ నుంచి రాయదుర్గానికి రోడ్డుమార్గాన వెళ్తుండగా.. కణేకల్లు మండలం మాల్యం గ్రామం వద్ద సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లను చూసి లోకేశ్‌ చలించిపోయారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి, ఇసుక, భూ, మద్యం, మైన్‌ దందాలతో ప్రజల రక్తాన్ని తాగుతున్న జగన్‌ రాయలసీమ బిడ్డ కాదనీ... ఈ ప్రాంతానికి పట్టిన కేన్సర్‌ గడ్డని మండిపడ్డారు. ఐదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడు జగన్‌. ఆయనది దరిద్ర పాదం. గత 50 ఏళ్లలో ఎన్నడూలేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. టీడీపీ హయాంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా లక్షలాది మంది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపి, కరువు సీమలో కియ పరిశ్రమ ద్వారా కార్ల పంట పండించిన అపర భగీరథుడు చంద్రబాబు’ అని తెలిపారు.

Updated Date - Mar 11 , 2024 | 09:13 AM