Share News

New year 2024: న్యూ ఇయర్ వేడుకలకు బయటకు వెళ్తున్నారా..మీకు షాకింగ్ న్యూస్!

ABN , Publish Date - Dec 28 , 2023 | 01:54 PM

ఏడాది ముగింపులో యువత హంగామా అంతా ఇంతా కాదు. ముఖ్యంగా డిసెంబర్ 31న రాత్రి తెగ రెచ్చిపోతుంటారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో మద్యం సేవించి రోడ్లపై బైకులతో ఫీట్లు చేస్తుంటారు.

New year 2024: న్యూ ఇయర్ వేడుకలకు బయటకు వెళ్తున్నారా..మీకు షాకింగ్ న్యూస్!

డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు. అనేక మంది యువకులు అడ్డు అదుపు లేకుండా మద్యం సేవించి ద్విచక్రవాహనాలపై షికారు చేస్తుంటారు. ఆ క్రమంలో కొంత మంది యువకులైతే బైకులపై ఇద్దరికంటే ఎక్కువగా ఎక్కి ఫుల్ స్పీడుతో ప్రయాణిస్తుంటారు. మరికొంత మంది బైకులతో రోడ్లపైకి వచ్చి నానా హంగామా చేస్తుంటారు. అయితే అలాంటి వారికి సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ డీవీవీ శ్రీనివాస్ కీలక సూచనలు జారీ చేశారు. ఈ ఏడాది చివరి రోజున అంటే డిసెంబర్ 31న మద్యం సేవించి పోలీసులకు పట్టుబడితే రూ.10 వేల జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఒకటికి మించి ఎక్కువసార్లు మద్యం సేవించి పట్టుబడితే రూ.15 వేల జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.


ఈ నేపథ్యంలో డిసెంబర్ 31న రాత్రి 8 గంటల నుంచే నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో ఎవరైనా బైక్ డ్రైవింగ్ చేస్తూ ధ్రువ పత్రాలు లేకుండా దొరికినా కూడా వాహనాలను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. అంతేకాదు ఆయా బార్లు, పబ్బులు, క్లబ్బులు, వైన్ షాపుల పరిధిలో మద్యం సేవించి పట్టుబడిన వ్యక్తులతో పాటు ఆయా షాపు నిర్వహకులపై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఇక 18 ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపితే వారితోపాటు యజమానులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. మరోవైపు అధిక శబ్దాలు వెలువరించే వాహనాలు, నంబర్ ప్లేటు లేకుండా ఉన్న వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కార్లలో పరిమితికి మించి ఎక్కువ మంది కూర్చోవడం సహా కార్లపై భాగంలో కూడా ఉండకూడదని సూచించారు. అంతేకాదు క్యాబ్, ఆటో డ్రైవర్లు కూడా డిసెంబర్ 31 రోజున ఎక్కువ ఛార్జీలు వసూలు చేయొద్దని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి సమయాల్లో క్యాబ్ డ్రైవర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయాణికుల రైడ్స్ రద్దు చేయోద్దని సూచించారు. ఒకవేళ అలా చేస్తే ప్రయాణికులు 94906 17346కు ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు సూచించారు. అలాంటి వారిపై రూ.500 జరిమానా విధిస్తామని అధికారులు ప్రకటించారు.

దీంతోపాటు ఇదే రోజు ఔటర్ రింగ్ రోడ్, పీవీ ఎక్స్ ప్రెస్ హైవేపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు ఎయిర్ పోర్టుకు వెళ్లేవి కాకుండా ఇతర వాహనాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, షేక్ పేట, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, రోడ్ నంబర్ 45, సైబర్ టవర్స్, ఫోరం మాల్, జేఎన్టీయూ, బాలానగర్, బాబు జగ్జీవన్ రావు ఫ్లైఓవర్లను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మూసీ వేయనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Updated Date - Dec 28 , 2023 | 02:08 PM