BRS : ‘రాజ్య’సంపద బీఆర్‌ఎస్‌దే!
ABN , First Publish Date - 2023-08-19T03:40:10+05:30 IST
దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ(Rajya Sabha) సభ్యుల సంఖ్య 30..! వీరందరి ఆస్తి రూ.1,941 కోట్లు..! మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర(Maharashtra) తరఫున 19 మంది పెద్దల సభలో ఉండగా.. వీరి సంపద రూ.1,070 కోట్లే..! ఇంకో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ 11 మంది ఎంపీల ఆస్తి కేవలం రూ.535 కోట్లు. కానీ, ఏడుగురు తెలంగాణ ఎంపీలందరి ఆస్తి ఏకంగా రూ.5,596 కోట్లు. వీరంతా అధికార బీఆర్‌ఎ్‌స(BRS)కు చెందినవారే.
పెద్దల సభలో ధనిక పార్టీ..
ఏడుగురు బీఆర్‌ఎస్ ఎంపీల ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు
ఆంధ్రప్రదేశ్‌లో 11 మంది సభ్యుల సంపద రూ.3,823 కోట్లు
యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో 60మంది ఆస్తి 3,546 కోట్లే
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రె్‌సను మించి బీఆర్‌ఎస్, వైసీపీ
225 మంది పెద్దల సభ సభ్యుల్లో 12 శాతం బిలియనీర్లు
వీరిలో ఏపీలో ఐదుగురు.. తెలంగాణ నుంచి ముగ్గురు
రాజ్యసభలో అత్యంత సంపన్న ఎంపీ బండి పార్థసారథిరెడ్డి
రెండో స్థానంలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి: ఏడీఆర్ నివేదిక
న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే రాజ్యసభ(Rajya Sabha) సభ్యుల సంఖ్య 30..! వీరందరి ఆస్తి రూ.1,941 కోట్లు..! మరో పెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర(Maharashtra) తరఫున 19 మంది పెద్దల సభలో ఉండగా.. వీరి సంపద రూ.1,070 కోట్లే..! ఇంకో పెద్ద రాష్ట్రం మధ్యప్రదేశ్ 11 మంది ఎంపీల ఆస్తి కేవలం రూ.535 కోట్లు. కానీ, ఏడుగురు తెలంగాణ ఎంపీలందరి ఆస్తి ఏకంగా రూ.5,596 కోట్లు. వీరంతా అధికార బీఆర్‌ఎ్‌స(BRS)కు చెందినవారే. మరో విశేషం ఏమంటే వీరిలోనూ బండి పార్థసారథిరెడ్డి దేశంలోనే అత్యంత సంపన్న రాజ్యసభ ఎంపీ. 11 మంది ఆంధ్రప్రదేశ్ ఎంపీల ఆస్తుల విలువ రూ.3,823 కోట్లు. వీరిలో 9మంది అక్కడి అధికార పార్టీ వైఎస్సార్‌సీపీ వారు. ఇందులోనూ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి దేశంలోనే రెండో అత్యంత ధనిక ఎంపీ కావడం గమనార్హం. ఈ లెక్కన.. ఉత్తరప్రదేశ్ 30 మంది ఎంపీల సంపద తెలంగాణ సభ్యుల ఆస్తుల్లో నాలుగో వంతుకు కాస్త ఎక్కువంతే. ఏపీ ఎంపీల ఆస్తుల్లో సగం అన్నమాట. ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్) ఈ మేరకు వివరాలు వెల్లడించింది. నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ)తో కలిసి అధ్యయనం సాగించిన ఏడీఆర్ 233 మంది ఎంపీలకు గాను 225 మంది ఆర్థిక, నేర, ఇతర నేపఽథ్యాలను అప్‌డేట్ చేసింది. దీనిప్రకారం.. దేశంలో అత్యధిక సంపన్న రాజ్యసభ సభ్యులు తెలంగాణ వారే. ఏడుగురు ఎంపీల్లో ముగ్గురికి రూ.100కోట్ల(బిలియన్)పైగా ఆస్తులున్నాయి. వైసీపీకి చెందిన 9 మందిలో నలుగురు బిలీయనుర్లు. వీరందరి సంపద రూ.3,561 కోట్లు. మిగతా ఇద్దరు సభ్యుల్లో ఒకరు బీజేపీకి, మరొకరు టీడీపీకి చెందినవారు.
బిలియనీర్ల సభ
రాజ్యసభలో 12 శాతం మంది ఎంపీలు బిలియనీర్లు. రాష్ట్రాల వారీగా తెలంగాణ ఎంపీల్లో 43 శాతం, ఏపీ ఎంపీల్లో (బీజేపీ ఎంపీని కూడా కలుపుకొంటే) 45% బిలీయనీర్లు. పార్టీల వారీగా పరిగణిస్తే వైసీపీలో నలుగురు (44 శాతం), బీఆర్‌ఎ్‌సలో ముగ్గురు (43 శాతం) బిలియనీర్లున్నారు. వ్యక్తిగతంగా.. మహారాష్ట్ర ఎంపీల్లో ముగ్గురు (16%), ముగ్గురు ఢిల్లీ ఎంపీల్లో ఒకరు(33%), ఏడుగురు పంజాబ్ సభ్యుల్లో ఇద్దరు(29%), ఐదుగురు హరియాణా ఎంపీల్లో ఒకరు(20%), 11 మంది మధ్యప్రదేశ్ సభ్యుల్లో ఇద్దరు(18%) తమకు రూ.100 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్ పేర్కొంది. మొత్తంమీద 17మంది ఎంపీలు బిలీయనర్లని వివరించింది.
33% మందిపై క్రిమినల్ కేసులు
ఏడీఆర్ నివేదిక ప్రకారం.. 225 మంది ఎంపీల్లో 75 మంది (33 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నాయి. 41 మంది(18 శాతం) తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో, ఇద్దరు హత్యానేరం కేసుల్లో ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్నారు.
ముగ్గురు వైసీపీ సభ్యులపై..
తెలంగాణ ఎంపీల్లో 43శాతం మందిపై క్రిమినల్, 14 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. ఏపీలో 36 శాతం ఎంపీలపై క్రిమినల్, 27 శాతం మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు ఏడీఆర్ తెలిపింది. తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ముగ్గురు వైసీపీ ఎంపీలు అఫిడవిట్లలో పేర్కొన్నారు. బీజేపీకి చెందిన 85 మంది సభ్యుల్లో 23 మంది, 30 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 12 మంది, 13 మంది టీఎంసీ వారిలో నలుగురిపై, ఆరుగురు ఆర్జేడీ ఎంపీల్లో ఐదుగురు, పది మంది ఆప్ ఎంపీల్లో ముగ్గురు క్రిమినల్ కేసుల్లో ఉన్నారని ఏడీఆర్ వివరించింది.
తెలుగు పార్టీల ఎంపీలే ధనికులు!
బీజేపీకి అత్యధికంగా 85 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అఫిడవిట్‌లో వెల్లడించిన ప్రకారం వీరందరి ఆస్తి కలిపినా రూ.2,579 కోట్లే. కాంగ్రె్‌సకు చెందిన 30మంది సభ్యుల సంపద రూ.1,549 కోట్లు. ఆప్‌నకు 10మంది సభ్యులుండగా వీరి ఆస్తి రూ.1,316 కోట్లు. దీనిప్రకారం.. బీజేపీ దేశవ్యాప్త ఎంపీలందరి కంటే రెట్టింపుపైగా సంపద బీఆర్‌ఎస్ ఏడుగురు ఎంపీలకు ఉండడం గమనార్హం. ఇది కాంగ్రెస్ సభ్యులతో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు. ఏపీలో వైసీపీకి చెందిన 9 మంది రాజ్యసభ ఎంపీల ఆస్తి రూ.3,561 కోట్లు. బీజేపీ సభ్యుల కంటే రూ.వెయ్యి కోట్లు, కాంగ్రెస్ ఎంపీల కంటే రెట్టింపు సంపద వీరి వద్ద ఉంది.
టాప్ 1లో బండి, టాప్ 2 ఆళ్ల..
దేశంలోనే ధనికులైన రాజ్యసభ ఎంపీల్లో బీఆర్‌ఎ్‌సకు చెందిన బండి పార్థసారథిరెడ్డి (రూ.5,300 కోట్లు), వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి (రూ.2,577 కోట్లు) మొదటి, రెండు స్థానాల్లో ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. మూడో స్థానంలో అమితాబ్ బచ్చన్ భార్య, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ (రూ.1,001 కోట్లు) ఉన్నారు. వైసీపీ మద్దతుతో ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన పరిమళ్ నత్వానీ (రూ.396 కోట్లతో) దేశంలోని ధనిక రాజ్యసభ ఎంపీల జాబితాలో 9వ స్థానంలో ఉన్నారు. కాగా, అప్పుల్లో నత్వానీ (రూ.209 కోట్లు), అయోధ్య రామిరెడ్డి (రూ.154 కోట్లు), జయా బచ్చన్ (రూ.105 కోట్లు) టాప్-3లో ఉన్నారు.