Rains : హైదరాబాద్ వర్షాల పరిస్థితి... ఏపీ మంత్రులు అన్నారని కాదు కానీ అసలు కథ ఇదీ..

ABN , First Publish Date - 2023-04-13T16:03:27+05:30 IST

హైదరాబాద్ వర్షాలపై ఇప్పుడు హాట్ టాపిక్ నడుస్తోంది. మంత్రి హరీష్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో హైదరాబాద్‌లో వర్షాల టాపిక్ వచ్చింది. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్షాల గురించి హైలైట్ చేశారు.

Rains : హైదరాబాద్ వర్షాల పరిస్థితి... ఏపీ మంత్రులు అన్నారని కాదు కానీ అసలు కథ ఇదీ..

హైదరాబాద్ : హైదరాబాద్ వర్షాలపై ఇప్పుడు ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. మంత్రి హరీష్ రావు వర్సెస్ ఏపీ మంత్రుల మధ్య జరుగుతున్న మాటల యుద్ధంలో హైదరాబాద్‌లో వర్షాల టాపిక్ రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వర్షాల గురించి హైలైట్ చేశారు. పట్టుమని ఓ వర్షం కురిస్తే హైదరాబాద్‌ ఢమాల్‌ అని ఎద్దేవా చేశారు. ‘‘అక్కడ ఇళ్ల మీద నుంచి నీళ్లు వెళ్లిపోతున్నాయి. ఏమైనా చేయగలిగారా మీరు? తెలంగాణను తగలేసి ఏపీ గురించి మాట్లాడతారా? మీ బొక్కలు, మీ లొసుగులు మీ ప్రతిపక్షాలే చెబుతాయి’’ అంటూ హరీష్​రావుకు కారుమూరి కౌంటర్ ఇచ్చారు.

వాస్తవ పరిస్థితుల్లోకి వెళితే..

ఇప్పుడు కారుమూరి అన్నారని కాదు కానీ హైదరాబాద్‌.. నిజానికి చినుకు పడితే చిత్తడే అని భాగ్యనగర వాసులు ఆందోళన చెందిన పరిస్థితులు చాలానే ఉన్నాయి. చిన్నపాటి వర్షానికే ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతాయి. వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని ప్రాంతాల్లో అయితే బోట్లు వేసుకుని మరీ వెళ్లాల్సిన పరిస్థితి. రెండేళ్ల క్రితం వాన పడితే పాతబస్తీ మొత్తం మునిగిపోయిన విషయం తెలిసిందే. ఇళ్లన్నీ మునిగిపోయాయి.. అప్పుడంటే వందేళ్లలో ఇలాంటి వర్షం ఎప్పుడూ కురవలేదు కాబట్టి ఇలా జరిగిందని సరిపెట్టుకున్నా కూడా నిజానికి హైదరాబాద్ పరిస్థితి అదే కదా? నాళాల రిపేర్ అని మొదలు పెడతారు. దానికి నెల సమయం అని చెబుతారు కానీ వాహనాలన్నింటినీ దారి మళ్లిస్తుంటారు. కానీ కామెడీ ఏమిటంటే వర్షాకాలం వెళ్లేంతవరకూ అది పూర్తవదనే హైదరాబాదీలు గగ్గోలు పెట్టుకున్న సందర్భాలున్నాయి.

వర్షాలు వస్తే ఇలా ఉంటది..!

జంట నగరాల్లో పలువురు ఎమ్మెల్యేలను నీట మునిగిన ప్రాంతాల వాసులను పరామర్శించేందుకు వెళితే ప్రజలు కన్నెర్రజేయడంతో చేసేదేమీ లేక వెనుదిరిగారు. అప్పట్లో మీడియాలో, సోషల్ మీడియా దీని తాలుకూ వీడియోలు వైరల్ అయిన విషయం విదితమే. ఇక వర్షాకాలం వచ్చిందంటే చాలు సీఎం కేసీఆర్ గురించి సోషల్ మీడియాలో వీడియోలు, మీమ్స్ తెగ వైరల్ అవుతుంటాయి. దానికి కారణం ఒక్క ఆడబిడ్డ కూడా నీళ్ల కోసం బయటకు వెళ్లే పరిస్థితి కల్పించబోనని గతంలో ఎన్నికల సమయంలో ఆయన చెప్పిన మాటలే. ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయిన వీడియోలకు ఆ మాటలను జత చేసి మరీ వైరల్ చేస్తుంటారు నెటిజన్లు. మరి ఇన్ని ఏళ్లుగా ఇంత వైరల్ అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరిగినా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలు లేకపోలేదు. కనీసం వర్షాకాలం రావడానికి ముందే అవసరమైన మరమ్మతులు చేసుకుని రోడ్లతో పాటు పలు ఏరియాల్లో నీళ్లు నిలవకుండా చేసుకుంటే ఇతర రాష్ట్రాల వారు తెలంగాణ వైపు వేలెత్తి చూపే అవకాశమే ఉండదు కదా అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా ఆ వైపుగా దృష్టి సారిస్తే మంచిదేనేమో..!

Updated Date - 2023-04-13T16:22:03+05:30 IST