Rahul Gandhi Disqualified : మోదీ నియంతృత్వానికి పరాకాష్ట

ABN , First Publish Date - 2023-03-25T03:40:32+05:30 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు.

Rahul Gandhi Disqualified : మోదీ నియంతృత్వానికి పరాకాష్ట

ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజు

రాహుల్‌పై అనర్హత వేటు అన్యాయం: సీఎం కేసీఆర్‌

అనర్హత వేటు అప్రజాస్వామికం: కేటీఆర్‌

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: హరీశ్‌

హైదరాబాద్‌,(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం అన్యాయమని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వ దురహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట అని బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇది చీకటి రోజని, విపక్ష నేతలపై కేంద్రం ప్రతీకార రాజకీయ చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. మోదీ పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ధ్వజమెత్తారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాద ని, రాజ్యాంగబద్ధ సంస్థలను దుర్వినియోగం చేయడమే కాకుండా.. అత్యున్నత ప్రజాస్వామ్య వేదికయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యల కోసం వినియోగించుకోవడం అన్యాయమని విమర్శించారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించిందని, ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయిందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ దుశ్చర్యలను ప్రజాస్వామ్య వాదులందరూ ముక్తకంఠంతో ఖండించాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

అప్రజాస్వామికమంటూ మంత్రుల ధ్వజం

రాహుల్‌ గాంధీపై వేటు వేయడం అప్రజాస్వామికం అని మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బీజేపీ ది నియంతృత్వ చర్య అని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. రాహుల్‌పై అనర్హత వేటు ప్రధాని మోదీ దురహంకారానికి నిదర్శనమని మంత్రి సత్యవతి మండిపడ్డారు. ప్రశ్నించే తత్వాన్ని సహించలేని స్థితిలో బీజేపీ నాయకత్వం ఉందని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. దేశంలో చీకటి రోజులు మొదలయ్యాయని మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. ప్రశ్నించే గొంతులపై బీజేపీ ఉక్కుపాదం మోపుతోందని మంత్రి ఎర్రబెల్లి, బీజేపీ అక్రమాలను ప్రశ్నిస్తారనే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని మంత్రి కొప్పుల, బీజేపీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని మంత్రి గంగుల అన్నారు.

రాహుల్‌కు అప్పిలేట్‌ కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వకుండా కేంద్ర సర్కారు.. ఆయనపై వేటు వేయడం అన్యాయమని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ వినోద్‌కుమార్‌ విమర్శించారు. తమ వైఫల్యాలు, అవినీతి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీజేపీ కుట్రకు దిగిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఫాసిస్టు విధానాలను అవలంబిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నయా హిట్లర్‌లా వ్యవహరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.

Updated Date - 2023-03-25T05:22:13+05:30 IST