Hyderabad: రేవంత్‌, సంజయ్‌కు లీగల్‌ నోటీసులు!

ABN , First Publish Date - 2023-03-24T06:38:25+05:30 IST

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ గురువారం తెలిపారు.

Hyderabad: రేవంత్‌, సంజయ్‌కు లీగల్‌ నోటీసులు!

అప్రతిష్ఠపాలు చేసేందుకే అసత్య ఆరోపణలు..

రాజకీయ దురుద్దేశంతోనే నా పేరు లాగుతున్నారు

కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు: మంత్రి కేటీఆర్‌ ధ్వజం

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ గురువారం తెలిపారు.

రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న కనీస అవగాహన కూడా లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. కానీ, ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నట్లుగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు సంజయ్‌, రేవంత్‌ తెరలేపారని కేటీఆర్‌ ఆరోపించారు. పాలనా వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలను సహించబోనన్నారు.

కొవిడ్‌ సమయంలో రూ.10 వేల కోట్ల టీకా కుంభకోణం జరిగిందని, రూ.వేల కోట్ల విలువ చేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్‌ నవ్వులపాలయ్యారని అన్నారు. బండి పోతే బండి ఫ్రీ అంటూ సంజయ్‌ చేసిన అర్థరహిత వ్యాఖ్యలను కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్‌, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.

ఉద్యోగాలను నిలిపేయాలన్న కుతంత్రం..

టీఎ్‌సపీఎస్సీ అంశంలో కాంగ్రెస్‌, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుట్ర ఉందని కేటీఆర్‌ అన్నారు. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ల కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని యువతకు కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్తులో పరీక్షలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.

Updated Date - 2023-03-24T06:39:27+05:30 IST