Share News

Telangana Elections : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే..?

ABN , First Publish Date - 2023-11-15T21:58:02+05:30 IST

తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. బుధవారం నాటికి తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

 Telangana Elections : తెలంగాణలో ముగిసిన నామినేషన్ల గడువు.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారంటే..?

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. బుధవారం నాటికి తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ల పరిశీలన అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో 2,898 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలల్లో 4,798 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో అధికంగా కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లో 86 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అదేవిధంగా అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. అయితే పరిశీలనలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు 606 మంది నామినేషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్‌ అధికారులు గుర్తులు కేటాయించనున్నారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేయనున్నారు. వాటి ఆధారంగా బ్యాలెట్‌ రూపొందించి ఈ నెల 30వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలో ఉన్న 15 నియోజ‌క‌వ‌ర్గాల‌కు 312 మంది అభ్య‌ర్థులు పోటీలో ఉన్నారు. ఈ 15 నియోజ‌క‌వ‌ర్గాలల్లో 20 మంది అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 6 నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలో 173 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఇబ్ర‌హీంప‌ట్నంలో 28 మంది, ఎల్‌బీన‌గ‌ర్‌లో 38, మ‌హేశ్వ‌రంలో 27, రాజేంద్ర‌న‌గ‌ర్‌లో 25, శేరిలింగంప‌ల్లిలో 33, చేవెళ్ల‌లో 12 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వికారాబాద్ జిల్లాలోని 3 నియోజ‌క‌వ‌ర్గాలల్లో 48 మంది పోటీలో ఉన్నారు. ప‌రిగిలో 15, వికారాబాద్‌లో 12, తాండూరులో 21 మంది బరిలో ఉండనున్నారు.

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గంలో 44 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. 70 మంది అభ్య‌ర్థులు త‌మ నామినేష‌న్ల‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో 39 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఇక్క‌డ 19 మంది త‌మ నామినేష‌న్లను ఉప‌సంహ‌రించుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాలో మొత్తం 173 మంది బరిలో మిగిలారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి అత్యధికంగా 24 మంది పోటీ చేస్తుండగా, గద్వాల నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నారాయణపేటలో కేవలం ఏడుగురు మాత్రమే పోటీలో ఉన్నారు.

కామారెడ్డిలో...

కామారెడ్డి నియోజకవర్గ బరిలో 39 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు. 19 మంది అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి, బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డిలతో పాటు 36 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Updated Date - 2023-11-15T21:58:10+05:30 IST