Viral Video: మైదానంలోనే భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే?..

ABN , First Publish Date - 2023-07-22T15:39:38+05:30 IST

సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: మైదానంలోనే భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం.. అసలు ఏం జరిగిందంటే?..

ఎమర్జింగ్ ఆసియా కప్‌ సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్-ఏ జట్టుపై టీమిండియా-ఏ ఘనవిజయం సాధించింది. 51 పరుగుల తేడాతో జయభేరి మోగించిన భారత జట్టు ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో ట్రోఫీ కోసం పాకిస్థాన్-ఏ జట్టుతో భారత్-ఏ జట్టు తలపడనుంది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య ఆటపరంగానే కాకుండా మాటల పరంగానూ పోటీ నెలకొంది. ఈ పోటీ రెండు జట్ల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రధానంగా 26వ ఓవర్లో భారత ఆటగాడు హర్షిత్ రానా, బంగ్లాదేశ్ ఆటగాడు సౌమ్య సర్కార్ మధ్య మాటల తూటాలు పేలాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


అసలు ఏం జరిగిదంటే.. భారత్ విసిరిన 212 పరుగుల లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ పోరాడుతుంది. బంగ్లాదేశ్ జట్టు 25 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ఈ సమయంలో టీమిండియా కెప్టెన్ యష్ ధూల్.. 26వ ఓవర్‌ను ఆఫ్ స్పిన్నర్ యువరాజ్‌సిన్హ్ దోదియాకు ఇచ్చాడు. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం.. ఆ ఓవర్ రెండో బంతిని సౌమ్య సర్కార్ షాట్ ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. దీంతో బంతి ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని స్లిప్‌లో ఫీల్డింగ్ చేసిన నికిన్ జోస్ వద్దకు వెళ్లింది. ఆ బంతిని నికిన్ జోస్ ముందుకు డైవ్ చేసి మరి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. దీంతో జోస్‌తోపాటు ఇతర భారత ఆటగాళ్లు ఔట్‌కు అప్పీల్ చేశారు. అంపైర్ సౌమ్య సర్కార్‌ను ఔట్ అయినట్టుగా ప్రకటించాడు. మ్యాచ్‌లో కీలక వికెట్ కావడంతో భారత ఫీల్డర్లు గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఇది నచ్చని సౌమ్య సర్కార్ ఏదో అన్నాడు. దీంతో సౌమ్య మోహం ముందు హర్షిత్ రానా గట్టిగా అరుస్తూ పంచులు గుద్దుతూ సంబరాలు చేసుకున్నాడు. సౌమ్య సర్కార్‌ను పెవిలియన్‌కు వెళ్లమంటూ సైగ చేశాడు. అది నచ్చని సౌమ్య సర్కార్.. రానాతో వాగ్వాదానికి దిగాడు. దానికి ఏ మాత్రం తగ్గని రానా.. సౌమ్య సర్కార్‌కు తగిన రీతిలో సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నెలకొంది. ఇంతలోనే ఇతర భారత ఆటగాళ్లు, అంపైర్లు అక్కడికి చేరుకుని రానా, సౌమ్యను విడదీశారు. ఇద్దరికీ సర్ది చెప్పారు. ఇంతలో సాయి సుదర్శన్ అక్కడికి వచ్చి సౌమ్య సర్కార్‌ను దూరం తీసుకెళ్లాడు. ఆ తర్వాత సౌమ్య సర్కార్ పెవిలియన్‌కు వెళ్తూ కూడా భారత ఆటగాళ్లను ఏదో అనడం వీడియోలో కనిపించింది.

అయితే మ్యాచ్‌లో ఈ గొడవ జరగడానికి, భారత ఆటగాళ్లు గట్టిగా సంబరాలు చేసుకోవడానికి, గొడవలో హర్షిత్ రానా స్పందించడానికి ఓ కారణం ఉంది. అదేటంటే.. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతిగా ప్రవర్తించారు. మన బ్యాటర్లు ఔటైన ప్రతిసారి గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నారు. హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ యష్ ధూల్ ఔటైన సందర్భంలో అయితే సౌమ్య సర్కార్ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడాడు. యష్ ధూల్‌ను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశాడు. ఇది మనసులో పెట్టుకున్న భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్ బ్యాటింగ్ సమయంలోనూ అదే రీతిలో ప్రవర్తించారు. ముఖ్యంగా సౌమ్య సర్కార్‌ను దెబ్బకు తీశారు. అతను ఔటవ్వగానే ‘‘నువ్వు మొదలు పెట్టావు. నేను పూర్తి చేశా. లెక్క సరిపోయింది’’ అంటూ హర్షిత్ రానా కామెంట్ చేయడం స్టంప్ మైక్‌లో రికార్డైంది. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు బంగ్లాదేశ్ ఆటగాళ్లకు భారత ఆటగాళ్లు గట్టి బుద్ది చెప్పారని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య గొడవలు జరగడం ఇది మొదటి సారి ఏం కాదు. సీనియర్ జట్లు పోటీనప్పుడు ఈ మోతాడు కాస్త ఎక్కువగానే కనిపించింది. 2011 ప్రపంచ కప్‌లో విరాట్ కోహ్లీ, రూబెల్ హొస్సేన్ మధ్య గొడవ జరిగింది. ఇక 2015 ప్రపంచకప్, 2020 అండర్ 19 ప్రపంచకప్‌లో కూడా భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య గొడవలు జరిగాయి.

Updated Date - 2023-07-22T15:44:33+05:30 IST