IND vs NEP: 6 రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు

ABN , First Publish Date - 2023-09-05T15:22:27+05:30 IST

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 6 ఫోర్లు, 5 సిక్సులతో 59 బంతుల్లోనే 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 6 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు.

IND vs NEP: 6 రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. సచిన్, గంగూలీ రికార్డులు గల్లంతు

పల్లెకెలె: ఆసియా కప్ 2023లో భాగంగా నేపాల్‌‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్‌కు తోడు మరో ఓపెనర్ గిల్ కూడా అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం నేపాల్‌పై టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు సూపర్ 4లో అడుగుపెట్టింది. దీంతో ఈ ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మరోసారి తలపడనున్నాడు. సూపర్ 4లో భాగంగా ఈ నెల 10న భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో సూపర్ 4లోనైన పూర్తి మ్యాచ్ జరగాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 6 ఫోర్లు, 5 సిక్సులతో 59 బంతుల్లోనే 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 6 రికార్డులను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అలాగే భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ రికార్డులు బద్దలయ్యాయి. దీంతో హిట్ మ్యాన్ చరిత్ర సృష్టించాడు.


10- నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన పరుగులు ఆసియా కప్ చరిత్రలో రోహిత్ శర్మకు 10వ 50+ స్కోర్. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు 50+ పరుగులు సాధించిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ నిలిచాడు. ఈ క్రమంలో 9 సార్లు 50+ స్కోర్లు సాధించిన దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. అలాగే మొత్తంగా అత్యధిక 50+ స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు. 12 సార్లు 50+ స్కోర్లు సాధించిన శ్రీలంక మాజీ బ్యాటర్ కుమార సంగక్కర ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

22- ఈ మ్యాచ్‌లో రోహిత్ 5 సిక్సులు బాదాడు. దీంతో ఆసియాకప్‌లో 22 సిక్సులకు చేరుకున్నాడు. ఈ క్రమంలో ఆసియా కప్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. మొత్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ కంటే ముందు షాహిద్ ఆఫ్రిదీ(26), సనత్ జయసూర్య(23) ఉన్నారు.

1,101- ఈ మ్యాచ్‌లో చేసిన 74 పరుగుల ద్వారా ఆసియా కప్ మొత్తంలో రోహిత్ శర్మ చేసిన పరుగులు 1,101కి చేరుకున్నాయి. దీంతో ఆసియా కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. 1,220 పరుగులు చేసిన శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్య ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

250- ఈ మ్యాచ్‌లో కొట్టిన 5 సిక్సుల ద్వారా రోహిత్ శర్మ వన్డేల్లో ఓపెనర్‌గా 250 సిక్సులను పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. కాగా వన్డేల్లో మొత్తంగా హిట్‌మ్యాన్ 280 సిక్సులు కొట్టాడు.

5- ఈ మ్యాచ్‌లో కొట్టిన 5 సిక్సుల ద్వారా ఆసియా కప్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన మూడో భారత ఆటగాడిగా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనాతో కలిసి రోహిత్ సమంగా ఉన్నాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ(7), ధోని(6) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

38- ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్‌కు ఇది 38వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ క్రమంలో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో సౌరవ్ గంగూలీ(37)ను అధిగమించిన హిట్‌మ్యాన్ మూడో స్థానంలో నిలిచాడు. రోహిత్ వన్డేల్లో 22, టీ20ల్లో 12, టెస్టుల్లో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (76), విరాట్ కోహ్లీ(63) మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు.

Updated Date - 2023-09-05T15:22:27+05:30 IST