IND vs AUS: మూడో వన్డేకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ABN , First Publish Date - 2023-09-25T15:57:32+05:30 IST

ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే.

IND vs AUS: మూడో వన్డేకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

రాజ్‌కోట్: ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే. మూడో వన్డే నాటికి అక్షర్ పటేల్ కోలుకుంటాడని అంతా భావించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారాం ప్రకారం గాయం నుంచి అక్షర్ పటేల్ ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్‌సీఏలోనే ఉన్న అక్షర్ పటేల్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు కూడా దూరం కానున్నాడు. అక్షర్ పటేల్ ప్రపంచకప్ నాటికి కూడా కోలుకోవడం కష్టమనే కథనాలు ఉన్నాయి. కానీ వాటిని బీసీసీఐ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ప్రపంచకప్ వామప్ మ్యాచ్‌ల సమయానికి అక్షర్ పటేల్ కోలుకుంటాడని చెబుతున్నాయి.


ఇక అక్షర్ పటేల్ స్థానంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపికైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు. రెండు వన్డేల్లోనూ పొదుపుగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో అయితే కీలక సమయంలో 3 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. తొలి రెండు వన్డేల నుంచి విశ్రాంతి తీసుకున్న సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా బుధవారం జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు. ఇక 3 వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే 2-0తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

Updated Date - 2023-09-25T16:39:48+05:30 IST