Share News

World Cup: నేడు న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-11-09T08:30:31+05:30 IST

New Zealand vs Sri Lanka: వరల్డ్ కప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.

World Cup: నేడు న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోవాలని కోరుకుంటున్న టీమిండియా ఫ్యాన్స్.. ఎందుకంటే..?

వరల్డ్ కప్‌లో నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత ప్రపంచకప్ పరంగా చూస్తే ఈ మ్యాచ్‌ న్యూజిలాండ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఎందుకంటే ఆ జట్టు సెమీస్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. టోర్నీ ఆరంభంలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచిన న్యూజిలాండ్ అందరి కంటే ముందే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకునేలా కనిపించింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో ఇప్పటికే మూడు సెమీస్ బెర్త్‌లు ఖరారు కావడంతో మిగిలిన ఒక స్థానం కోసం పోరాడుతోంది. అది కూడా మరో రెండు జట్లతో కావడం గమనార్హం. దీంతో కివీస్ సెమీస్ చేరాలంటే శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిందే. అప్పుడు కూడా కివీస్ కచ్చితంగా సెమీస్ చేరుతుందని చెప్పలేం. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిస్తే మూడు జట్ల ఖాతాలో పదేసి పాయింట్ల చొప్పున ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేటు ఉన్న జట్టు సెమీస్ చేరుతుంది. ప్రస్తుతం పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ కన్నా కివీస్‌కు మెరుగైన రన్ రేటు ఉంది. కానీ ఒక వేళ పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిస్తే వారి రన్ రేటు న్యూజిలాండ్ కన్నా మెరుగుపడే అవకాశాలున్నాయి. ఒక వేళ లంక చేతిలో న్యూజిలాండ్ ఓడితే సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి.


టీమిండియా ఫ్యాన్స్ మాత్రం ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడితే సెమీస్ రేసులో వెనుకబడుతుంది. పాకిస్థాన్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిస్తే నాలుగో స్థానంతో సెమీస్ చేరే అవకాశాలున్నాయి. అదే జరిగితే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలో ఉండే పాకిస్థాన్ జట్లు సెమీస్‌లో తలపడతాయి. దీంతో ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో భారత్, పాకిస్థాన్ పోరు చూడాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడితే ఆ మజానే వేరు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను రెండు జట్ల అభిమానులే కాకుండా క్రికెట్‌తో సంబంధం లేని వారు కూడా వీక్షిస్తారనే సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉన్న క్రేజు అలాంటింది. దీంతో టోర్నీకి కూడా భారీ స్థాయిలో హైపు వస్తోంది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా జరిగే వ్యాపారం సైతం భారీ స్థాయిలోనే ఉంటుంది. దీంతో టోర్నీ నిర్వాహకులు కూడా సెమీస్‌లో భారత్, పాకిస్థాన్ తలపడాలని కోరుకోవచ్చు. న్యూజిలాండ్ ఓడిపోయి పాకిస్థాన్ సెమీస్ చేరాలని టీమిండియా అభిమానులు కోరుకోవడానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. 2015, 2019 ప్రపంచకప్‌లలో మన జట్టు సెమీస్‌ను దాటలేకపోయింది. అయితే వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఒకసారి కూడా ఓడిపోలేదు. ప్రస్తుతం ఉన్న ఫామ్ పరంగా చూసుకున్న భారత్‌కు పోటీ ఇచ్చే స్థాయిలో పాకిస్థాన్ లేదు. దీంతో సెమీస్‌లో ఈ రెండు జట్లు తలపడితే అభిమానులకు కావాల్సినంత వినోదం పాటు టీమిండియా గెలిచి ఫైనల్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా 2011 ప్రపంచకప్ సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన టీమిండియా ఫైనల్ చేరి కప్ గెలిచింది. దీంతో ఆ సెంటిమెంట్ కూడా టీమిండియాకు అనుకూలంగా ఉండనుంది. అందుకే న్యూజిలాండ్ ఓడిపోయి పాకిస్థాన్ సెమీస్ చేరాలని భారత జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.

ఒక వేళ శ్రీలంక చేతిలో న్యూజిలాండ్ ఓడినప్పటికీ.. పాకిస్థాన్ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడితే ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా తయారవుతాయి. అఫ్ఘానిస్థాన్ కూడా తమ చివరి మ్యాచ్‌లో ఓడితే మూడు జట్ల పాయింట్లు సమానంగానే ఉంటాయి. అప్పుడు నెట్ రన్ రేటు కీలకం అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చిత్తుగా ఓడిపోవాలిన భారత అభిమానులు ఆశిస్తున్నారు. కివీస్ రన్ రేటు పాక్ కన్నా దిగజారుతుంది. పాకిస్థాన్ సెమీస్ చేరే అవకాశాలుంటాయి. ఒకవేళ న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడి.. సౌతాఫ్రికాపై అఫ్ఘానిస్థాన్ గెలిస్తే అనూహ్యంగా ఆ జట్టు సెమీస్ చేరుతుంది. అయితే శ్రీలంకకు కూడా న్యూజిలాండ్‌తో మ్యాచ్ కీలకమైనదే. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి అర్హత పొందాలంటే ఈ మ్యాచ్‌లో శ్రీలంక కచ్చితంగా గెలిచి తీరాల్సిందే.

Updated Date - 2023-11-09T08:35:02+05:30 IST