Favouritism: ఇది చాలు రాహుల్ ఆటతీరు చెప్పేందుకు.. సంచలన కామెంట్స్ చేసిన వెంకటేశ్ ప్రసాద్

ABN , First Publish Date - 2023-02-12T18:08:46+05:30 IST

ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు

Favouritism: ఇది చాలు రాహుల్ ఆటతీరు చెప్పేందుకు.. సంచలన కామెంట్స్ చేసిన వెంకటేశ్ ప్రసాద్

నాగ్‌పూర్: ఆస్ట్రేలియా(Australia)తో జరిగిన తొలి టెస్టులో భారత జట్టు భారీ విజయం సాధించినప్పటికీ టీం సెలక్షన్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఫామ్ లేమితో కొట్టుమిట్టాడుతున్న కేఎల్ రాహుల్‌(KL Rahul) పదేపదే జట్టుకు ఎంపికవుతుండడంపై క్రికెట్ పండితులే కాదు, అభిమానులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ 71 బంతులు ఆడి 20 పరుగులు మాత్రమే చేసి పేలవంగా అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ విమర్శలు మరింత పదునెక్కాయి. ప్రస్తుతం భారత జట్టులో ఒక్కో స్థానం కోసం కనీసం ఇద్దరు ఆటగాళ్లు పోటీపడుతున్న వేళ రాహుల్ ఇంకా చోటు దక్కించుకుంటుండడం ‘ఫేవరిటిజం’(Favouritism) కాకపోతే మరేంటంటూ టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్(Venkatesh Prasad) తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

అక్కడితో వెంకటేశ్ ప్రసాద్ ఊరుకోలేదు. గడిచిన ఎమిదేళ్ల రాహుల్(Rahul) గణాంకాలను బయటకు తీశాడు. గత ఎనిమిదేళ్లలో రాహుల్ గొప్పగా ఆడిన సందర్భం ఒక్కటి కూడా లేదని విమర్శించాడు. 46 టెస్టులు ఆడిన తర్వాత సగటు 34 మాత్రమే ఉందంటే అతడి బ్యాటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినప్పటికీ అతడికి అన్ని అవకాశాలు ఎలా లభిస్తున్నాయో అర్థం కాలేదంటూ వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డాడు.

యువ ఆటగాడు శుభమన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడన్న వెంకటేశ్ ప్రసాద్.. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) దున్నిపడేస్తున్నాడన్నాడు. ఇలాంటి వారిని పక్కనపెడుతూ రాహుల్‌కు వరుసగా అవకాశాలు ఎందుకు ఇస్తున్నట్టని ప్రశ్నించాడు. ప్రదర్శన బట్టి కాకుండా ఫేవరిటిజంతో రాహుల్‌ను జట్టులోకి తీసుకుంటున్నారన్న వెంకటేశ్ ప్రసాద్.. దీనిని పక్షపాతం కాక మరేమంటారని ప్రశ్నించాడు. అంతేకాదు, అతడిని జట్టుకు వైస్ కెప్టెన్‌ను చేయడం మరింత దారుణమైన విషయమని వాపోయాడు.

రాహుల్ కంటే వెటరన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌(Ravichandran Ashwin)కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం ఉత్తమమన్నాడు. లేదంటే పుజారా(Pujara) ఉండనే ఉన్నాడని పేర్కొన్నాడు. రాహుల్ కంటే మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) మంచి ఆటగాడని కితాబిచ్చాడు. దీనిపై స్పందించేందుకు ‘మాజీ’లు భయపడుతున్నారని, నోరెత్తితే ఐపీఎల్‌లో సమస్యలు వస్తాయని వెనక్కి తగ్గుతున్నారని వెంకటేశ్ విమర్శించాడు. ఓ ఫ్రాంచైజీ కెప్టెన్‌తో గొడవ పడితే ఐపీఎల్‌లో తమకు పని దొరకదని మాజీలు భయపడుతున్నారని, అందుకే వారు రాహుల్ విషయంలో నోరు మెదపడం లేదన్నాడు.

కేఎల్ రాహుల్ విషయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేసినప్పటికీ రాహుల్‌కు మరికొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2023-02-12T18:08:48+05:30 IST