India vs New Zealand: టాస్ గెలిచిన భారత్.. కివీస్‌తో చావోరేవో!

ABN , First Publish Date - 2023-02-01T18:52:44+05:30 IST

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్(Team India)-

India vs New Zealand: టాస్ గెలిచిన భారత్.. కివీస్‌తో చావోరేవో!

అహ్మదాబాద్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్(Team India)-న్యూజిలాండ్(New Zealand) మధ్య చివరిదైన మూడో టీ20 ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లో చెరో మ్యాచ్‌లో విజయం సాధించిన ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో ఎవరు నెగ్గితే సిరీస్ వారి సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్‌లో హోరాహోరీ తప్పకపోవచ్చు.

భారత జట్టు టాపార్డర్ వైఫల్యం మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది. రోహిత్‌, కోహ్లీ, రాహుల్‌ గైర్హాజరీని యువ బ్యాటర్లు గిల్‌, ఇషాన్‌, త్రిపాఠి సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. లఖ్‌నవూ మ్యాచ్‌లో 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సాధించేందుకు భారత జట్టు ఆపసోపాలు పడింది. ఎట్టకేలకు చివరి ఓవర్‌లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. మరోవైపు, 99 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకునేందుకు కివీస్ బౌలర్లు చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. పేసర్లకు పిచ్ అనుకూలించే అవకాశం ఉండడంతో యుజ్వేంద్ర చాహల్‌ను బెంచ్‌కు పరిమితం చేసి ఉమ్రాన్‌ మాలిక్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. కివీస్ కూడా ఒక్క మార్పుతోనే దిగుతోంది. జాకోబ్ డఫీ స్థానాన్ని బెన్ లిస్టెర్‌తో భర్తీ చేసింది.

కివీస్‌కు అద్భుత అవకాశం

భారత గడ్డపై న్యూజిలాండ్‌ ఏ ఫార్మాట్‌లోనూ ద్వైపాక్షిక సిరీస్‌ గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌ ద్వారా వారికి అద్భుత అవకాశం వచ్చింది. నేటి మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆ రికార్డును ఒడిసిపట్టుకోవాలని భావిస్తోంది. కివీస్ టాపార్డర్‌ మెరుగ్గానే కనిపిస్తున్నా మిడిలార్డర్‌ వైఫల్యం ఇబ్బందిపెడుతోంది. ఫిలిప్స్‌ ప్రతీ మ్యాచ్‌లోనూ నిరాశపరుస్తున్నాడు. చాప్‌మన్‌, బ్రేస్‌వెల్‌ల నుంచి భారీ స్కోర్లు రావాల్సి ఉంది.

Updated Date - 2023-02-01T18:52:53+05:30 IST