IND vs AUS: ఏం కొట్టుడు బాబోయ్.. మార్ష్ దెబ్బకు ఆసీస్ గ్రాండ్ విక్టరీ

ABN , First Publish Date - 2023-03-19T17:47:22+05:30 IST

విశాఖ వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. 118 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆసీస్ ఊదేసింది. 11 ఓవర్లకే 121 పరుగులు చేసి..

IND vs AUS: ఏం కొట్టుడు బాబోయ్.. మార్ష్ దెబ్బకు ఆసీస్ గ్రాండ్ విక్టరీ

విశాఖ వన్డేలో టీమిండియాపై ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. 118 పరుగుల టార్గెట్‌ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఆసీస్ ఊదేసింది. 11 ఓవర్లకే 121 పరుగులు చేసి కథ ముగించేసింది. టీమిండియా నిర్దేశించిన టార్గెట్‌ను ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ సునాయాసంగా అధిగమించారు. చెరొక హాఫ్ సెంచరీ చేసుకుని ఆసీస్‌కు మరపురాని విజయాన్ని అందించారు. మిచెల్ మార్ష్ అయితే ఊచకోతతో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 36 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్లతో 66 పరుగులు చేసి టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రావిస్ హెడ్ కూడా 30 బంతుల్లో 10 ఫోర్లతో 51 పరుగులు చేసి తానేమీ తక్కువ కాదని నిరూపించుకున్నాడు.

సిరాజ్ ఓవర్లలో అయితే పరుగుల వరద పారిందని చెప్పక తప్పదు. 3 ఓవర్లలో 37 పరుగులు ఆసీస్‌కు సిరాజ్ సమర్పించుకున్నాడు. మార్ష్ అయితే మరీ హార్ష్‌గా సిరాజ్ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. మరో పేసర్ షమీ బౌలింగ్ చేసిన 3 ఓవర్లలో 29 పరుగులు రావడం గమనార్హం. టీమిండియా పేసర్లనే కాదు స్పిన్‌‌ విభాగాన్ని కూడా ఆసీస్ బ్యాటర్లు వదిలిపెట్టలేదు. మొత్తంగా చెప్పాలంటే.. తొలి వన్డేలో 200 పరుగుల లోపే ఆలౌట్ అయి కేఎల్ రాహుల్ నిలదొక్కుకోవడంతో ఓటమి పాలైన ఆసీస్ మంచి కమ్‌బ్యాక్ ఇచ్చింది.

రెండో వన్డేలో అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ ఆసీస్ ఆల్ రౌండ్‌ షోతో సత్తా చాటింది. ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 117 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ 4 కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాను గట్టి దెబ్బ కొట్టాడు. రోహిత్ శర్మ, గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ వికెట్లను తీసి టీమిండియాను స్టార్క్ బెంబేలెత్తించాడు. చివర్లో మహ్మద్ సిరాజ్ వికెట్‌ను కూడా స్టార్క్ తీశాడు. దీంతో.. ఈ ఆసీస్ బౌలర్ ఖాతాలో 5 వికెట్లు పడటం గమనార్హం.

టీమిండియాలో సగం మందిని ఇతనే కూల్చేశాడు. అబాట్‌ కూడా 3 వికెట్లతో రాణించాడు. ఎల్లిస్‌కు రెండు వికెట్లు దక్కాయి. మొత్తంగా చూసుకుంటే.. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా విలవిలలాడిపోయింది. అక్షర్ పటేల్ రెండు సిక్స్‌లతో జోష్ పెంచినా సిరాజ్ వికెట్ పడటంతో టీమిండియా 117 పరుగులకే ఆలౌట్‌గా వెనుదిరగక తప్పలేదు. బ్యాటింగ్ విభాగంలోనూ ఆసీస్ అదరగొట్టింది. ఫలితంగా రెండో వన్డేలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. చెరో మ్యాచ్ గెలవడంతో చెన్నైలో జరగనున్న మూడో వన్డే సిరీస్ ఎవరిదో తేల్చనుంది.

Updated Date - 2023-03-19T17:47:27+05:30 IST