Ind vs Aus: నిప్పులు చెరిగిన బౌలర్లు.. బెంబేలెత్తి వికెట్లు పారేసుకున్న ఆస్ట్రేలియా

ABN , First Publish Date - 2023-03-17T16:44:46+05:30 IST

బౌరత బౌలర్లు నిప్పులు చెరిగారు. అనుభవజ్ఞుడైన షమీ ఓ పక్క వరస వికెట్లు తీసి

Ind vs Aus: నిప్పులు చెరిగిన బౌలర్లు.. బెంబేలెత్తి వికెట్లు పారేసుకున్న ఆస్ట్రేలియా

ముంబై: భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. అనుభవజ్ఞుడైన షమీ(Shami) ఓ పక్క వరస వికెట్లు తీసి ఆసీస్‌(Australia)ను దెబ్బకొడితే, సిరాజ్(Siraj), జడేజా(Ravindra Jadeja) దానిని కొనసాగించారు. ఫలితంగా భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు వ్యూహాత్మకంగా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకానికి నిలబెట్టిన మహమ్మద్ సిరాజ్ రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ (5)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత మార్ష్, స్మిత్ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాక స్మిత్ అవుటయ్యాడు.

ఆ తర్వాత బౌలర్లు బంతులకు పదునుపెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్ పతనాన్ని శాసించారు. మరీ ముఖ్యంగా షమీ.. మూడు వరుస ఓవర్లలో జోష్ ఇంగ్లిష్ (26), కామెరాన్ గ్రీన్ (12), స్టోయినిస్ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 184 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. మ్యాక్స్‌వెల్(8)ను జడేజా అవుట్ చేయగా, సీన్ అబాట్(0), ఆడం జంపా(0) వికెట్లను సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఆసీస్ ఇన్నింగ్స్ 35.4 ఓవర్లలోనే 188 పరుగుల వద్ద ముగిసింది.

ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే భారత బౌలర్లను ధైర్యంగా ఎదురొడ్డి పరుగులు సాధించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. ఆరు ఓవర్లు వేసిన షమీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

**************************

* RCB: ఐపీఎల్‌కు ముందు ఆర్సీబీకి బిగ్ షాక్!

* Sunrisers Hyderabad: ఎస్ఆర్‌హెచ్‌కు కొత్త జెర్సీ.. ఆటగాళ్ల ఫొటోషూట్!

* WTC Final: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్.. దినేశ్ కార్తీక్ బోల్డ్ కామెంట్స్!

Updated Date - 2023-03-17T16:48:56+05:30 IST