Rohit Sharma: బొద్దుగా ఉన్నా కోహ్లీ లాగే రోహిత్ కూడా ఫిట్.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన కోచ్
ABN , First Publish Date - 2023-12-11T14:44:38+05:30 IST
ప్రస్తుత క్రికెటర్లు ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన వర్కౌట్లతో శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కాలంటే నైపుణ్యం ఒకటి ఉంటే సరిపోదు ఫిట్‌నెస్ కూడా ఉండాలి.
ప్రస్తుత క్రికెటర్లు ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యం ఇస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, తగిన వర్కౌట్లతో శరీరం ఎప్పుడూ ఫిట్‌గా ఉండేలా చూసుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కాలంటే నైపుణ్యం ఒకటి ఉంటే సరిపోదు ఫిట్‌నెస్ కూడా ఉండాలి. జట్టుకు ఎంపిక కావాలంటే ఆటగాళ్లు యో యో వంటి ఫిట్‌నెస్ టెస్టులో కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని బీసీసీఐ నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాస్త బొద్దుగా కనిపిస్తుంటాడు. దీంతో ఫిట్‌గా ఉండడనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదట. రోహిత్ శర్మ చూడడానికి అలా కనిపిస్తాడు కానీ చాలా ఫిట్‌గా ఉంటాడట. ప్రపంచంలోనే ఆటగాళ్లందరికీ ఫిట్‌నెస్‌లో ఆదర్శంగా నిలిచే విరాట్ కోహ్లీతో సమంగా హిట్‌మ్యాన్ ఫిట్‌నెస్ ఉంటుందట. బీసీసీఐ ప్రవేశపెట్టిన యో యో టెస్టులో కూడా హిట్‌మ్యాన్ ఎప్పుడు ఉత్తీర్ణత సాధిస్తున్నాడట. బీసీసీఐ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అంకిత్ కాలియార్ ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు.
"రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్. మంచి ఫిట్‌నెస్‌తో ఉంటాడు. అతను కొంచెం బొద్దుగా కనిపిస్తాడు కానీ ఎప్పుడూ యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడు. విరాట్ కోహ్లిలా ఫిట్‌గా ఉంటాడు. మైదానంలో రోహిత్ చురుకుదనం అద్భుతంగా ఉంటుంది. ఫిట్‌గా ఉండే క్రికెటర్ల జాబితాలో రోహిత్ కూడా ఉంటాడు.’’ అని అంకిత్ కాలియార్ తెలిపాడు. కోహ్లీ గురించి మాట్లాడుతూ జట్టు ఫిట్‌నెస్ సంస్కృతిలో మార్పు తీసుకొచ్చిన సూపర్‌స్టార్ అని కొనియాడాడు. "ఫిట్‌నెస్ విషయంలో విరాట్ కోహ్లీ ఒక మంచి ఉదాహరణ. అతను జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని సృష్టించాడు. మీ టాప్ ప్లేయర్ చాలా ఫిట్‌గా ఉన్నప్పుడు, ఇతరులకు ఆదర్శంగా మారతారు. అతను ఇతరుల్లో విశ్వాసాన్ని నింపుతాడు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరూ ఫిట్‌గా ఉండేలా చూసుకున్నాడు. జట్టులో ఫిట్‌నెస్ అతని ప్రధాన పారామీటర్. ఆ సంస్కృతిని, క్రమశిక్షణను జట్టులో సృష్టించాడు. ఆ వాతావరణాన్ని విరాట్ భాయ్ తీసుకొచ్చాడు. ఇది మెచ్చుకోదగ్గ విషయం. భారత ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉండడానికి అతనే కారణం" అని అంకిత్ కాలియర్ చెప్పుకొచ్చాడు.
ఇక యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ చాలా ఫిట్‌గా ఉంటాడని, అతను ఈ విషయంలో విరాట్ కోహ్లీ నుంచి ప్రేరణ పొందుతున్నాడని ఆయన చెప్పాడు. బ్యాటింగ్ అయినా, ఫిట్‌నెస్ అయినా గిల్ కోహ్లీనే అనుసరిస్తాడని తెలిపాడు. అలాగే రాబోయే రోజుల్లో జట్టు కోసం గిల్ బాగా రాణిస్తాడని తాను కచ్చితంగా నమ్ముతున్నట్టు అంకిత్ కాలియర్ చెప్పాడు.