Asian Games: 9 బంతుల్లోనే 50.. యువీ, రోహిత్ రికార్డులు బద్దలు.. 20 ఓవర్లలోనే 314 రన్స్!

ABN , First Publish Date - 2023-09-27T11:05:03+05:30 IST

ఏషియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు బదలయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నేపాల్ బ్యాటర్లు కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టారు.

Asian Games: 9 బంతుల్లోనే 50.. యువీ, రోహిత్ రికార్డులు బద్దలు.. 20 ఓవర్లలోనే 314 రన్స్!

ఏషియన్ గేమ్స్‌లో భాగంగా నేపాల్, మంగోలియా మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు బదలయ్యాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ మొదటి మ్యాచ్‌లోనే పరుగుల వరద పారింది. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన నేపాల్ బ్యాటర్లు కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్.. టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ రికార్డులను బద్దలుకొట్టారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను, అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 314 పరుగుల కొండంత స్కోర్ చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోర్‌గా నిలిచిపోయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు ఆప్ఘనిస్థాన్ పేరు మీద ఉన్న 278 పరుగులు రికార్డు బద్దలైంది. ఆ జట్టు బ్యాటర్లు కుశల్ మల్లా, దీపేంద్ర సింగ్, రోహిత్ పౌడేల్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించారు. కుశాల్ మల్లా 34 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ క్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ రికార్డును బద్దలుకొట్టాడు. వీరిద్దరు 35 బంతుల్లోనే సెంచరీలు చేయగా.. తాజాగా కుశాల్ 34 బంతుల్లోనే సాధించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టీ20ల్లో వేగంగా సెంచరీ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. అతనికి కెప్టెన్ రోహిత్ పౌడేల్ కూడా సహకరిచండంతో వీరిద్దరు కలిసి 63 బంతుల్లోనే 193 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 27 బంతులు ఎదుర్కొన్న రోహిత్ రెండు ఫోర్లు, 6 సిక్సులతో 27 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు.


ఇక 19వ ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన దీపేంద్ర సింగ్ 8 సిక్సులతో 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీని బాదేశాడు. దీంతో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ రికార్డు బద్దలైంది. వేగంగా హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా దీపేంద్ర సింగ్ కొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో దీపేంద్ర సింగ్ వరుసగా 5 సిక్సులు బాదాడు. అలాగే అంతర్జాతీయ టీ20 చరిత్రలో 300 పరుగుల మార్క్ అందుకున్న తొలి జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. 8 ఫోర్లు, 12 సిక్సులతో 50 బంతుల్లోనే 137 పరుగులు చేసిన కుశాల్ మల్లా, 8 సిక్సులతో 10 బంతుల్లోనే 52 పరుగులు చేసిన దీపేంద్ర సింగ్ నాటౌట్‌గా నిలిచారు. దీపేంద్ర సింగ్, కుశాల్ మల్లా కలిసి నాలుగో వికెట్‌కు అజేయంగా 11 బంతుల్లోనే 55 పరుగులు నెలకొల్పారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఏకంగా 26 సిక్సులు నమోదయ్యాయి. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సులు నమోదు చేసిన జట్టుగా నేపాల్ చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఆప్ఘనిస్థాన్(22) పేరు మీద ఉండేది.

నేపాల్ బ్యాటర్ల విధ్వంసం దెబ్బకు మంగోలియా బౌలర్లంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఏకంగా ముగ్గురు బౌలర్లు 50కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. దవాసురేన్ జమ్యాన్సురేన్ 4 ఓవర్లలోనే 60 పరుగులు ఇవ్వగా.. తుర్ముఖ్ తుముర్సుఖ్ 3 ఓవర్లలోనే 55 పరుగులు, ముంగున్ అల్తాంఖుయాగ్ 2 ఓవర్లలోనే 55 పరుగులు ఇచ్చాడు. నేపాల్ బ్యాటర్లను ఆపడానికి మంగోలియా ఏకంగా ఏడుగురు బౌలర్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. మంగోలియా బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలోనే ఏకంగా 29 పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 315 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా జట్టు 13.1 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 41 పరుగులకే కుప్పకూలింది. 10 పరుగులు చేసిన దవాసురేన్ జమ్యాన్సురేన్ ఆ జట్టు బ్యాటర్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మంగోలియా బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అయ్యారు. దీంతో 273 పరుగుల భారీ తేడాతో నేపాల్ ఘనవిజయం సాధించింది. టీ20 క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయంగా రికార్డులకెక్కింది.

Updated Date - 2023-09-27T15:11:05+05:30 IST