Nandyal : నిండు గర్భిణీని తిప్పించుకుంటున్న గ్రామసచివాలయ సిబ్బంది.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

ABN , First Publish Date - 2023-01-23T22:02:14+05:30 IST

పాపం ఆరు నెలలక్రితమే భర్తను కోల్పోయింది. కుటుంబాన్ని నెట్టుకొచ్చే తోడును మధ్యలోనే పోగొట్టుకోవడంతో మూడేళ్ల కూతురికి ఇక అన్నీ తానే అయ్యింది.

Nandyal : నిండు గర్భిణీని తిప్పించుకుంటున్న గ్రామసచివాలయ సిబ్బంది.. మరీ ఇంత నిర్లక్ష్యమా?

డోన్: పాపం ఆరు నెలలక్రితమే భర్తను కోల్పోయింది. కుటుంబాన్ని నెట్టుకొచ్చే తోడును మధ్యలోనే పోగొట్టుకోవడంతో మూడేళ్ల కూతురికి ఇక అన్నీ తానే అయ్యింది. పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుకొని కడుపులో మరో బిడ్డను మోస్తూ (Pregnant) ఉపాధి కోసం పట్టణం (Town) వలస వెళ్లిందో మహిళ. అయితే సొంతూరిలో నివసించకపోవడమే ‘వితంతు పింఛను’ (Widow pension) తిరస్కరణకు కారణమైంది. ఫలితంగా 9 నెలల నిండు గర్భిణీ గ్రామ సచివాలయం (village secretariat) చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లాలో (Nandyal district) వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

డోన్ (Dhone) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన లాల్‌బీ అనే మహిళ భర్త అల్లాబాకష్‌ ఆరు నెలలక్రితం మరణించాడు. దీంతో మూడేళ్ల కూతురు, కడుపులోని బిడ్డ భారం తనపై పడింది. అనూహ్య పరిస్థితుల కారణంగా గర్భవతి అయినప్పటికీ ఉపాధి వెతుకుంటూ డోన్ పట్టణానికి వలస వెళ్లింది. అక్కడ అద్దె నివాసం ఉంటూ కూతురిని పోషించుకుంటోంది. అయితే వితంతు పింఛను వస్తే ఎంతోకొంత ఆసరా ఉంటుందని ఆమె భావించింది. ఇదే విషయమైన గత ఆరు నెలలుగా సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంతవరకు పింఛను మంజూరు కాలేదు. కుటుంబాన్ని పోషించేవాళ్లు ఎవరూ లేరని, గర్భిణీని కాబట్టి పనికి పోలేని స్థితిలో ఉన్నానని వేడుకున్నా కనికరించలేదు.

డోన్‌లో కాపురం ఉంటున్నావు కాబట్టి అక్కడికి వెళ్లమంటూ కొత్తపల్లి సచివాలయం సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక డోన్ సచివాలయంలో అడిగితే కొత్తపల్లి సచివాలయంలో సంప్రదించాలని చెబుతున్నారని వాపోయింది. కుటుంబ భారం మోయలేక వితంతు పింఛను వస్తే తనకు కాస్త ఊరటగా ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెబుతోంది. ఆరు నెలలుగా సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా సచివాలయం సిబ్బంది పట్టించుకోవడంలేదని గోడు వెళ్లబోసుకుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. కుటుంబ పోషణ కోసం ఎటువంటి ఆదాయం లేదని, వితంతు పింఛను మంజూరు చేయాలని వేడుకుంది. ఈ పరిణామంతో అధికారులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారో లేదో వేచిచూడాలి.

Updated Date - 2023-01-23T22:02:17+05:30 IST