7 Dollars Mistake: 7 డాలర్లకు కక్కుర్తి పడ్డాడు.. 370,000 డాలర్లు పోగొట్టుకున్నాడు.. ఆ ఒక్క తప్పు చేయకపోతే?

ABN , First Publish Date - 2023-08-10T22:25:30+05:30 IST

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా రావొచ్చు. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. కేవలం 7 డాలర్ల కోసం కక్కుర్తి పడ్డ ఆ వ్యక్తి..

7 Dollars Mistake: 7 డాలర్లకు కక్కుర్తి పడ్డాడు.. 370,000 డాలర్లు పోగొట్టుకున్నాడు.. ఆ ఒక్క తప్పు చేయకపోతే?

ఒక్కోసారి మనం చేసే చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. కొన్నిసార్లు ప్రాణాల మీదకు కూడా రావొచ్చు. ఇప్పుడు ఓ వ్యక్తి విషయంలో కూడా దాదాపు ఇలాగే జరిగింది. కేవలం 7 డాలర్ల కోసం కక్కుర్తి పడ్డ ఆ వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా 3,70,000 డాలర్ల బిల్లు భరించాల్సి వచ్చింది. ఒకే ఒక్క చిన్న మిస్టేక్ వల్ల అతనికి అంత భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..

బ్లేక్ గిబ్ అనే 30 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని లాంబోంగాన్ ద్వీపానికి హాలిడేస్ కోసం వెళ్లాడు. స్కూటర్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి విహరిస్తున్న సమయంలో.. మలుపును అధిగమించేందుకు ప్రయత్నించాడు. అప్పుడు స్కూటర్ అదుపు తప్పి సిమెంట్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా.. లోపలున్న మెదడు గట్టిగా దెబ్బతింది. దీంతో.. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. బాలిలోని ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్‌లో అత్యవసర శస్త్రచికిత్స అందించారు. ఈ ఘటనలో అతని ముఖం బాగా దెబ్బతిన్నప్పటికీ.. ప్రాణాలతో మాత్రం బయటపడ్డాడు.


అయితే.. బ్లేక్ గిబ్ తన ప్రయాణ బీమాలో 7 డాలర్ల మోటార్‌సైకిల్ కవరేజ్ పాలసీని జోడించుకోకపోవడం వల్ల, అతని సర్జరీల కోసం కుటుంబానికి భారీ మొత్తమే చెల్లించాల్సి వచ్చింది. గిబ్ చికిత్స కోసం సుమారు 370,000 ఖర్చు అవుతుందని అతని తల్లి రోస్లిన్ గిబ్ అంచనా వేశారు. గిబ్ స్నేహితులు అర్థరాత్రి 1 గంట సమయంలో అతడ్ని ఆసుపత్రికి తీసుకొని వెళ్లారని.. అయితే ఆసుపత్రిలో చేర్పడానికి ముందు ముందస్తుగా 4 వేల డాలర్లు కట్టాల్సి ఉండటంతో.. అతని ఫ్రెండ్స్ తమకు ఫోన్ చేశారని రోస్లిన్ తెలిపారు. లాంబోంగాన్ ద్వీపం నుంచి అతడ్ని పడవలో బాలికి తీసుకొచ్చారని, అక్కడి నుంచి ఆడిలైడ్‌కి తరలించారని చెప్పారు.

ఇప్పుడు గిబ్ రాయల్ ఆడిలైడ్ ఆసుపత్రిలో మెల్లగా కోలుకుంటున్నాడు. అయితే.. చికిత్సకు చాలా డబ్బు కావాలి కాబట్టి, అతని కుటుంబ సభ్యులు ‘గోఫండ్‌మీ’లో ఫండ్స్ రైజ్ చేశారు. అతనికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కి కొన్ని వారాలపాటు ట్రీట్మెంట్ ఇచ్చి, ఆపై న్యూరోలాజికల్ వార్డుకి తరలించారు. అనంతరం పునరావాస కేంద్రానికి పంపుతారు. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తై, అతడు పూర్తిగా కోలుకోవడానికి రెండేళ్ల సమయం పడుతుంది. ఒకవేళ గిబ్ తన ప్రయాణ బీమాలో 7 డాలర్ల మోటార్‌సైకిల్ కవరేజ్ పాలసీని జోడించి ఉంటే, ట్రీట్మెంట్ కోసం ఇంత కష్టపడాల్సిన అవసరం వచ్చేది కాదు.

Updated Date - 2023-08-10T22:25:30+05:30 IST