Ragging : ర్యాగింగ్ భూతాన్ని తరమాలంటే.. ఈ చర్యలు సరిపోతాయా?

ABN , First Publish Date - 2023-02-27T16:24:36+05:30 IST

ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది.

Ragging : ర్యాగింగ్ భూతాన్ని తరమాలంటే.. ఈ చర్యలు సరిపోతాయా?
Ragging

విద్యతో భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవలసిన విద్యార్థులు మారుతున్న కాలంలో వికృత చేష్టలకు అడ్రస్ అవుతున్నారు. కొత్తగా కాలేజీలో చేరిన విద్యార్థులతో స్నేహాన్ని బలపరుచుకునే విధానాన్ని మార్చి, సాటి విద్యార్థి మానసికంగా కృంగిపోయి చనిపోయే విధంగా హంసకు ప్రేరేపిస్తున్నారు. దీనికే ర్యాగింగ్ అనే పేరు పెట్టి, సాటి విద్యార్థులను చావు దాకా తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ర్యాగింగ్ అనేది జూనియర్ కాలేజీలకంటే మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం.

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ఎక్కడో అక్కడ ఈ ర్యాగింగ్ భూతానికి ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే విద్యార్థుల ఆలోచన తీరులో కనిపిస్తున్న క్రూరమైన మనస్థత్వం భవిష్యత్ తరాలు ఎలా ఉండబోతున్నాయోననే భయాన్ని కలిగిస్తున్నాయి. ఇవాళ్టికీ కాలేజీలు, యూనివర్సిటీలతో సహా పలు విద్యాసంస్థల్లో విజృంభిస్తున్న భూతం. ఎన్ని చర్యలు చేపట్టినా తెలుగు రాష్ట్రాల్లో ఈ ర్యాగింగ్ సంఘటలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఒక్క 2015లోనే 90కి పైగా ర్యాగింగ్ ఫిర్యాదులు నమోదవడం గమనించాలి. మొన్నా మధ్య రిషితేశ్వరి ఘటన మరువకముందే మానసిక క్షోభకు గురై, మరో ప్రీతి బలవంతంగా ప్రాణాలను తీసుకుంది.

ర్యాగింగ్ అంటే..

సీనియర్ విద్యార్థులు కొత్తగా వచ్చిన విద్యార్థులకు మనస్థాపం కలిగించేలా ప్రవర్తించడం, ఇది ఇతర దేశాలతో పోల్చితే మన భారతదేశంలో ఎక్కువగా ఉంది. ఎంతలా అంటే బలవంతంగా ప్రాణాలు తీసుకునేంతలా ఈ ర్యాగింగ్ భూతం విస్తరిస్తుంది.

ప్రభుత్వాలు తెస్తున్న చట్టాలు..

అస్సాం ప్రభుత్వం పాఠశాలలో ర్యాగింగ్‌ను నేరంగా పరిగణిస్తూ చట్టం చేసింది. విద్యార్థలంతా ఒకే మనస్తత్వంతో ఉండరు. కొందరు సున్నిత మనస్కులై చిన్న విషయాలకే ఉద్రేకానికి గురవుతారు. ఇలాంటి వారు పిరికిగా చనిపోవాలనే నిర్ణయాన్ని తీసుకునే అవకాశం లేకపోలేదు. అలా జరిగిన సంఘటనలు కూడా కోకొల్లలు. ఇంత తెలిసినా ఎక్కడో ఒకచోట ర్యాగింగ్ జరుగుతూనే ఉంది.

కళాశాలల చర్యలు..

ర్యాగింగుకు పాల్పడే విద్యార్థులకు కాలేజీ నుంచి సస్పెన్షన్, విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే పంపేయడం, జరిమానా విధించడం, బహిరంగ క్షమాపణలు చెప్పడం వంటి కఠినమైన శిక్షలు వేసినా సమస్య తగ్గడం లేదు. కాలేజీలో చేరే ముందు ప్రతి విద్యార్థితోనూ కొన్ని విద్యాసంస్థలు ర్యాగింగ్ జరగదనే హామీ పత్రాన్ని కూడా తీసుకుంటుంది. సీనియర్ విద్యార్థులు, చేసే ర్యాగింగ్‌కు కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్, ఇతర అధ్యాపకులు తరచూ కొత్తగా చేరిన కళాశాలలోనైనా ర్యాగింగ్ జరిగినట్లయితే యాజమాన్యం, ప్రిన్సిపాల్ బాధ్యత వహించాలని సుప్రింకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ర్యాగింగును అరికట్టేందుకు జాతీయ స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఎన్ని చర్యలు తీసుకుంటే ఏం లాభం..

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం తీసుకుంటే.. ఆర్కిటెక్చర్ ఎంట్రన్స్‌లో రిషితేశ్వరికి 112 ర్యాంకు వచ్చింది. గుంటూరులో ఇంజినీరింగ్ లో చేరింది. మొదటిరోజే సీనియర్ విద్యార్థితో చేదు అనుభవం ఎదురైంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మద్యం మత్తులో అసభ్యంగా ప్రవర్తించాడు. 'ఆరోజే నాకు చనిపోవాలనిపించింది' అని రాసుకుంది రిషితేశ్వరి. ఆ తరువాత నుంచి సీనియర్ల నుంచి చాలా వేధింపులు ఎదురయ్యాయి. రూమ్ ఖాళీ చేయమని సీనియర్లు ఒత్తిడి చేశారు. అదీ తన డైరీలో రాసుకుంది రిషితేశ్వరి. తను అనుభవించిన మానసిక చిత్రవధను డైరీకి మాత్రమే చెప్పుకుంది. అబ్బాయిలనే కాదు అమ్మాయిలూ రిషితేశ్వరిని వేధించారు. అర్థనగ్నంగా నడిపించి వీడియో తీసి వేధించారు. నాన్నతో చివరిసారి మాట్లాడిన రిషితేశ్వరి అదే రోజు హాస్టల్ రూమ్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. రిషితేశ్వరిని ఆత్మహత్య చేసుకొనేలా ప్రేరేపించారంటూ, భారత శిక్షా స్మృతిలోని 306వ సెక్షన్, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని 4వ సెక్షన్ కింద ముగ్గురు సీనియర్ విద్యార్థులపై కేసు నమోదుచేసి, అరెస్టు చేశారు. అయితే ఏమైంది ఎంతో భవిష్యత్ ఉన్న ఓ ఆర్కిటెక్ట్ చనిపోయింది. అదీ తనలాంటి విద్యార్థుల చేతిలోనే క్రూరంగా వేధించబడి మరీ చనిపోయింది.

మళ్లీ అదే తీరుగా మరో ఘటన..

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి మహాత్మాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో శిక్షణలో ఉన్న సమయంలో తెల్లవారు జామున 6:30 సమయంలో విషపూరితమైన ఇంజక్షన్ తీసుకుని అపస్మారక స్థితిలోనికి వెళిపోయింది. సైఫ్ అనే సీనియర్ మెడికో స్టూడెంట్ వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఐదురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. చివరకు బ్రెయిన్ డెడ్ కావడంతో ప్రాణాలను వదిలింది. సైఫ్‌కి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలో మెడికల్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్, వేధింపులు అరికట్టడంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసకుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.

Updated Date - 2023-02-27T16:24:37+05:30 IST