Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!

ABN , First Publish Date - 2023-07-27T19:10:36+05:30 IST

సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానే ఉండిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు..

Infertility Reasons: ఏవేవో అనుకుంటుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు..!

సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానే ఉండిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు.. ‘‘మా కర్మ ఇంతేనేమో’’ అని సరిపెట్టుకుంటూ జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. అయితే ఎక్కువ శాతం.. తాము తెలీక చేసే తప్పుల వల్లే సంతానలేమి సమస్య ఎదురవుతోందని మాత్రం గుర్తించరు. చాలా మంది ఏవేవో అనుకుంటారు కానీ.. పిల్లలు పుట్టకపోవడానికి ఈ 8 అంశాలే అసలు కారణాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలో సుమారు 2.75 కోట్ల జంటలు సంతాన లేమి సమస్యతో బాధపడుతున్నాయని ఇటీవల ఓ సర్వేలో వెళ్లడైంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఐవీఎఫ్ (In vitro fertilisation) సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రపంచంలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చుతున్న మహిళలు.. అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. కొన్నిసార్లు ఈ ప్రక్రియ కూడా విఫలమవుతోంది. జీవనశైలిలో మార్పుల కారణంగానే ఎక్కువ శాతం మహిళలు సంతాన లేమి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. జంక్ ఫుడ్, ఊబకాయం, వయసు సంబంధిత సమస్యల కారణంగా గర్భదారణ విషయంలో సమస్య తలెత్తుతోందని అంటున్నారు. ప్రధానంగా ఈ 8 కారణాల వల్లే సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొంటున్నారు.


కొందరు రోజూ రెండు కంటే ఎక్కవ టీలు, కాఫీలు తాగడంతో పాటూ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గర్భస్రావం జరుగుతుంది. శరీరంలో కేఫిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా గర్భస్రావం, శిశు మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిలో సంతాన లేమి సమస్య (Infertility) ఎక్కువగా కనిపిస్తుంటుంది.

సంతానలేమి సమస్య తలెత్తడానికి ధూమపానం (smoking) మరో ప్రధాన సమస్య. పొగాకులో (tobacco) కాడ్మియం, కోటినిన్ వంటి విషపూరిత మూలకాలు ఉండడం వల్ల.. ధూమపానం చేసే స్త్రీలలో అండం ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే అండం గోడలు మందంగా మారడం వల్ల శుక్రకణాలు (Sperm cells) ప్రవేశించడానికి అవకాశం ఉండదు. తద్వారా సంతానం అందడం కష్టమవుతుంది.

women-trending-news.jpg

అదేవిధంగా మద్యపానం చేసే స్త్రీల శరీరంలో.. గర్భధారణకు అవసరమైన విటమిన్ బి, జింక్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు తుక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇలాంటి స్త్రీలు గర్భం దాల్చడం కష్టం అవుతుంది. ఒకవేల గర్భం దాల్చినా అబార్షన్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా పారిశ్రామిక రసాయనాలు (Industrial chemicals) లేదా రేడియేషన్‌కు గురికావడం వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతుంటుంది.

సంతానం కలగకపోవడానికి డ్రగ్స్ వ్యసనం (Drug addiction) కూడా మరో కారణం కావొచ్చు. ఈ వ్యసనం కారణంగా ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరక సంబంధాలు కొనసాగించే ప్రమాదం ఉంది. దీనివల్ల క్లామిడియా, ఎయిడ్స్ (Aids) వంటి వ్యాధులు సోకుతాయి. దీని కారణంగా సంతానలేమి సమస్య ఎక్కువ అవుతుంది. అలాగే ఉన్నట్టుండి బరువు పెరగడం, అదేవిధంగా ఉన్నట్లుండి బరువు తగ్గడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది..ః


కొందరు గర్భం వాయిదా వేసేందుకు వివిధ రకాల మందులు తీసుకుంటూ ఉంటారు. మరికొందరు గర్భం దాల్చకుండా ఉండేందుకు ఇంజెక్షన్లు కూడా తీసుకుటుంటారు. ఇలాంటి వారిలో కూడా సంతానం కలగడం కష్టంగా మారుతుంటుంది. అదేవిధంగా అండాశయం నుంచి అండం విడుదలవడంలో సమస్య ఉండడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంటుంది. ఉదరం లేదా పొత్తికడుపుకి శస్త్ర చికిత్స జరిగి ఉండడం వల్ల కూడా సంతానలేమి సమస్య తలెత్తుతుంది.

శరీరం బరువు పెరగడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. శరీరం బరువు ఎక్కువగా ఉండడం వల్ల గర్భస్రావం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంటుంది. మహిళ తల్లి అవడానికి బీఎమ్ఐ (body mass index) 30 కంటే ఎక్కువ ఉండకూడదని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా గర్భాశయంలో గడ్డలు, గర్భాశయం ఆకారం సరిగా లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది.

Infertility.jpg

పుట్టుకతో వచ్చే వివిధ రకాల రుగ్మతల వల్ల కూడా సంతానలేమి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో పాటూ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది. మరోవైపు ఒత్తిడి, ఆందోళన కారణంగా గర్భధారణ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురువుతుంటాయి. మానసిక సమస్యల వల్ల గర్భం దాల్చే సామర్థ్యం తక్కువగా ఉంటుందని పలు సర్వేల్లో వెళ్లడైంది.

స్త్రీలలో ఎక్కువగా హార్మోన్స్‌ ఇన్‌బ్యాలెన్స్, ట్యూబల్‌ బ్లాక్స్, లో ఓవేరియన్‌ డిఫెక్ట్, గర్భాశయ, ఎండో మెట్రియాసిస్‌ సమస్యలు సంతానలేమికి కారణమవుతున్నాయి. కొందరు సకాలంలో సంతానం కలగలేదనే ఉద్దేశంతో నాటు వైద్యాలను ఆశ్రయిస్తుంటారు. అవగాహన లేకుండా ఇలాంటి పనులు చేయడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

women.jpg

దంపతులు సంతానలేమికి గల నిజమైన కారణాన్ని తెలుసుకుని, దానికి తగినట్టు వారికి వైద్య చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా యోగా, మెడిటేషన చేయడం వల్ల మహిళల్లో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటు పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే రుతుక్రమం సకాలంలో రాని మహిళలు.. వెంటనే గైనకాలజిస్టును సందర్శించి, తగిన చికిత్స తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Marriage: పెళ్లి వేడుకలో ఫన్నీ గేమ్.. వరుడే గెలిచాడు కానీ.. పెళ్లయ్యాక అతడి పరిస్థితేంటో.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

Updated Date - 2023-07-27T19:12:47+05:30 IST