Sania Akhtar: సీమా, అంజుల తర్వాత సానియా.. ప్రేమికుడి కోసం ఏడాది కొడుకుతో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి వచ్చిన మహిళ

ABN , First Publish Date - 2023-08-22T19:44:36+05:30 IST

ఎలాగైతే తమ ప్రేమికుల కోసం సీమా హైదర్ (పాకిస్తాన్ నుంచి భారత్), అంజు థామస్ (భారత్ నుంచి పాకిస్తాన్) దేశాలు దాటారో.. ఇప్పుడు సానియా అఖ్తర్ అనే మహిళ తన ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్..

Sania Akhtar: సీమా, అంజుల తర్వాత సానియా.. ప్రేమికుడి కోసం ఏడాది కొడుకుతో బంగ్లాదేశ్ నుంచి భారత్‌కి వచ్చిన మహిళ

ఎలాగైతే తమ ప్రేమికుల కోసం సీమా హైదర్ (పాకిస్తాన్ నుంచి భారత్), అంజు థామస్ (భారత్ నుంచి పాకిస్తాన్) దేశాలు దాటారో.. ఇప్పుడు సానియా అఖ్తర్ అనే మహిళ తన ప్రేమికుడి కోసం బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చింది. అయితే.. ఈమె కథ ఆ ఇద్దరి కంటే కాస్త భిన్నమైనది. ఒక ఏడాది కొడుకుతో నోయిడా వచ్చిన సానియా.. తన ప్రియుడు మోసం చేశాడని వాపోతోంది. తొలుత ప్రియుడు తనకు పెళ్లి కాలేదని నమ్మించి, తనని పెళ్లి చేసుకున్నాడని.. తీరా పిల్లాడు పుట్టాక పెళ్లయ్యిందని షాకిచ్చాడని.. ఆపై తనని విడిచిపెట్టి భారత్‌కి వచ్చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

2017లో ఉద్యోగం నిమిత్తం సౌరభ్ కాంత్ తివారీ అనే వ్యక్తి బంగ్లాదేశ్ వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో చేరాడు. అదే కంపెనీలో పని చేసే సానియా అఖ్తర్‌తో అతనికి పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే.. సౌరభ్ వయసు 50 సంవత్సరాలు కాగా, సానియా వయసు కేవలం 27 ఏళ్లు. వయసులో తనకంటే చాలా పెద్దవాడు అయినప్పటికీ.. సానియా అతడ్ని ప్రేమించింది. తనకు పెళ్లి అవ్వలేదని సౌరభ్ నమ్మించడంతో.. అతని ప్రేమలో పడింది. అంతేకాదు.. సానియాని వివాహమాడేందుకు సౌరభ్ బంగ్లాదేశ్‌లో మతం కూడా మార్చుకున్నాడు. తన కోసం ఇంత చేయడం చూసి.. వయసు తేడా పట్టించుకోకుండా సానియా అతడ్ని పెళ్లి చేసుకుంది.


అయితే.. పెళ్లయి బాబు పుట్టిన తర్వాత తనకు ఆల్రెడీ పెళ్లై, పిల్లలున్నారన్న విషయాన్ని సౌరభ్ చెప్పాడని సానియా తెలిపింది. అప్పటివరకూ అతడు తన పెళ్లి విషయాన్ని సీక్రెట్‌గానే ఉంచాడని చెప్పింది. తనని భారత్‌కి తీసుకెళ్తానని సౌరభ్ మాటిచ్చాడని, కానీ అతడు ఇండియాకు వెళ్లాక తనతో కాంటాక్ట్‌లో లేకుండా పోయాడంది. అందుకే తాను అతడ్ని వెతుక్కుంటూ భారత్‌కి వచ్చానని సానియా పేర్కొంది. తాను ఇదివరకే భారత్‌కి వచ్చానని, అప్పుడు ఎలాంటి సమాచారం లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయానని చెప్పింది. ఇప్పుడు మళ్లీ రెండోసారి భారత్ వచ్చిన ఆమె.. నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ఈ నేపథ్యంలోనే.. ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.

మరోవైపు.. సానియా వ్యాఖ్యల్ని సౌరభ్ కాంతి తివారీ తోసిపుచ్చాడు. తన చేత బలవంతంగా మత మార్పిడి చేయించారని, తన నుంచి డబ్బులు కూడా కొట్టేశారని ఆరోపించాడు. తనని పదే పదే బెదిరించారని అన్నాడు. 2017లో బంగ్లాదేశ్ వెళ్లిన తాను.. అతికష్టం మీద 2022 డిసెంబర్‌లో అక్కడి నుంచి భారత్‌కి తిరిగొచ్చానని చెప్పాడు. బంగ్లాదేశీ చట్టం ప్రకారం తాను ఆల్రెడీ విడాకులకు దరఖాస్తు చేశానని కుండబద్దలు కొట్టాడు. తాను సానియాతో కలిసి ఉండాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. కానీ.. సానియా మాత్రం తనకు సౌరత్ కావాలని, అతనితోనే కలిసి ఉంటానని చెప్తోంది. మరి, వీరి కథ ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Updated Date - 2023-08-22T19:44:36+05:30 IST