YSRCP: అసలు విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు..ఇకపై.. అలాంటి పనులకు చెక్‌ పెట్టాలని డిసైడ్‌..!

ABN , First Publish Date - 2023-02-27T13:11:29+05:30 IST

ఎన్నికలకు ముందు జరిగే పరిణామాలు ప్రజల్లో నాటుకుపోతాయి. ప్రతి అంశం ఆయా పార్టీల ఖాతాల్లో జమ అవుతుంటుంది. ప్రజల్లో చర్చనీయాంశంగా ...

YSRCP: అసలు విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు..ఇకపై.. అలాంటి పనులకు చెక్‌ పెట్టాలని డిసైడ్‌..!

టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో వైసీపీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఆయన్ను అడ్డుకుంటూ.. అనూహ్య ప్రచారం కల్పించడంతో.. ప్రజల్లో సానుభూతి పెరుగుతోందని ఆలస్యంగా గుర్తించారు. తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందని తెలుసుకున్న నేతలు.. ఇప్పుడు ఆ పరిస్థితులకు కారకులెవరనే అంశంపై ఆరా తీస్తున్నారు. ఇకపై.. అలాంటి పనులకు చెక్‌ పెట్టాలని డిసైడ్‌ అయ్యారు. ఇంతకీ.. వైసీపీ అగ్రనేతలు ఎందుకు ఆలోచనలో పడ్డారు?.. ఇన్నాళ్లు లేనిది.. వైసీపీ ఇప్పుడెందుకు ఆరా తీస్తోంది?..అనే మరిన్ని విషయాలను ఏబీఎన్ ఇన్‎సైడ్‎లో తెలుసుకుందాం..

Untitled-2754.jpg

వైసీపీలో వణుకు పుట్టిస్తోంది..

ఎన్నికలకు ముందు జరిగే పరిణామాలు ప్రజల్లో నాటుకుపోతాయి. ప్రతి అంశం ఆయా పార్టీల ఖాతాల్లో జమ అవుతుంటుంది. ప్రజల్లో చర్చనీయాంశంగా మారతాయి. మంచి, చెడులను రచ్చ బండలపై చర్చించుకుంటారు. అదే సమయంలో.. ఎన్నికల వేళ ఏపీ అధికార పార్టీకి తాజా పరిణామాలు అస్సలు కలిసి రావడం లేదని, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలే విశ్లేషిస్తున్నారు. ఈ మధ్యకాలంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగా.. ఆయన పలు జిల్లాలకు వెళ్లి రోడ్డు షోలు, సభలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సభలకు ఎన్నడూ లేని విధంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం వైసీపీలో వణుకు పుట్టిస్తోంది.

Untitled-2245.jpg

ప్రభుత్వమే ఫుల్‌ మైలేజ్‌ ఇస్తుందని ఓ సీనియర్ మంత్రి విశ్లేషణ

మరోవైపు... ప్రకాశం జిల్లా కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట జరగ్గా 8 మంది మరణించడం, గుంటూరులో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ ప్రభుత్వం జీవో నెంబరు వన్‌ తీసుకొచ్చింది. ఆ జీవోని అడ్డుపెట్టుకొని చంద్రబాబు ర్యాలీలు, బహిరంగ సభలను అడ్డుకుంటున్నారు. సహజంగా చంద్రబాబు కార్యక్రమం యథావిథిగా జరగనిస్తే.. ఆయన ఓ గంటసేపు మాట్లాడి వెళ్లిపోయేవారు. పత్రికల్లో లోపల పేజీల్లో, ఛానల్స్‌లో ఓ అరగంట లైవ్ ఇచ్చి వదిలేసేవారు. కానీ.. లేనిపోని ఆంక్షలతో అడ్డుకుని చంద్రబాబుకు అధికార పక్షమే ఫుల్‌ మైలేజ్‌ ఇస్తుందని ఓ సీనియర్ మంత్రి విశ్లేషించడం ఆసక్తిగా మారుతోంది. జీవో నెంబరు వన్‌ సాకుతో.. కుప్పంలో, ఆ తర్వాత.. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడం, ఆయన నిచ్చెన ద్వారా బస్సు పైకి ఎక్కి మాట్లాడడం, అనపర్తిలో ఏడు కిలోమీటర్లు మేర పాదయాత్ర చేసి బహిరంగ సభలో మాట్లాడడంతో హైప్‌ క్రియేట్‌ అయింది.

Untitled-245.jpg

73ఏళ్ల వయస్సులో అలుపు లేకుండా నడవడం

ఇక.. చంద్రబాబు సభా వ్యవహారమంతా మీడియాలో దాదాపుగా నాలుగు గంటల పాటు నిరాటంకంగా ప్రసారమైంది. సోషల్ మీడియాలో చంద్రబాబు ఏడు కిలో మీటర్లు నడిచిన విజువల్స్ ట్రెండ్ అయ్యాయి. పత్రికల్లో పతాక శీర్షికల్లో ప్రచురితమైంది. చివరికి.. పల్లెల్లోని రచ్చబండలపైనా చంద్రబాబు.. 73ఏళ్ల వయస్సులో అలుపు లేకుండా ఏడు కిలోమీటర్లు నడవడం, అలవోకగా నిచ్చెన ఎక్కి బస్సు మీద నుంచొని మాట్లాడటాన్ని ఆయన స్టామినాగా సోషల్ మీడియా ట్రోల్ చేసింది. ఆయా వ్యవహారాలన్నీ ప్రజా బాహుళ్యంలోకి వెళ్లడం, అదే సమయంలో చంద్రబాబు పట్ల ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్‌ తెరపైకి రావడం.. వైసీపీకి పెద్ద మైనస్‌గా మారాయి.

Untitled-234.jpg

ఎన్నికలకు ముందు అలా చెయ్యొచ్చా?

ఇదిలావుంటే... గన్నవరం గరగరం పాలిటిక్స్‌ ఏపీ వ్యాప్తంగా హీట్‌ పుట్టించాయి. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు గన్నవరం వెళ్లిన పట్టాభిరామ్‌పై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసు నమోదు చేయడం, టీడీపీ కార్యాలయం విధ్వంసం, వాహనాల దగ్ధం, పోలీస్ కస్టడీలో థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆయన చెప్పడం కూడా అధికార పార్టీకి నష్టం కలిగించిందని తాడేపల్లిలోనూ చర్చ జరిగింది. అతను ఫిర్యాదు చేసి వెళ్తే ఎవరికీ తెలిసేది కాదని, కేవలం వైసీపీపై విమర్శలు చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతన్నాయి. దాంతో.. అసలు.. ఆ సంఘటనల వెనుక ఎవరున్నారు?..

Untitled-26584.jpg

ఎన్నికలకు ముందు అలా చెయ్యొచ్చా?.. చంద్రబాబుకు మనమే ప్రచారం కల్పించడం ఏంటని సీనియర్ మంత్రులేకాదు.. వైసీపీ ముఖ్య నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సన్నిహితుల దగ్గర అసంతృప్తి వ్యక్తం చేయడమే కాదు.. ఎవరో ఒకరు తాడేపల్లికి సమాచారం ఇవ్వాల్సిందేనని, లేకపోతే అందరం మునుగుతామని కూడా వ్యాఖ్యానించినట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే.. పార్టీలో కూడా ఆయా అంశాలపై చర్చ జరిగి.. అసలు.. ఆ ఆదేశాలు ఇస్తుందెవరని పెద్దలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల్లో కొంతమంది వీరవిధేయులైన అధికారులు వ్యవహరిస్తున్న తీరు కూడా ఇప్పుడు వైసీపీకి నష్టం కలిగిస్తుందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: భారతదేశంలో ప్రతి 40 సెకన్లకు ఒక వీడియో క్యాప్చర్ అవుతోంది..ఆ సైట్‎లను చూసే ముందు ఆలోచించండి..!


Untitled-28544.jpg

మొత్తంగా.. చంద్రబాబు సభలకు ఆటంకాలు సృష్టించిన వైసీపీ పెద్దలు.. ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు. చంద్రబాబుకు ప్రజల్లో అనవసర మైలేజ్‌ కల్పిస్తున్నామని గుర్తించి దిగులు చెందుతున్నారు. ఏదేమైనా.. ఆలస్యంగానైనా.. అసలు విషయం తెలుసుకున్న అధికార పార్టీ నేతలు.. రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్తారో చూడాలి మరి.

Updated Date - 2023-02-27T13:11:41+05:30 IST