NCBN Arrest: తెలుగు సినీ ప్రముఖులకు ఏమైంది? ఎందుకు స్పందించడం లేదు?

ABN , First Publish Date - 2023-09-13T14:16:37+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. దేశం సంగతి అటుంచితే.. తెలుగు వారి ఖ్యాతిని చాటిన పార్టీ అధినేత కష్టాల్లో ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తే అభిమానులకు ఉండే స్థైర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రముఖ వ్యక్తుల్లో కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నట్టి కుమార్ లాంటి వాళ్లే స్పందించారు.

NCBN Arrest: తెలుగు సినీ ప్రముఖులకు ఏమైంది? ఎందుకు స్పందించడం లేదు?

తెలుగు సినీ పరిశ్రమ ఈరోజు గొప్ప స్థాయిలో ఉందంటే దానికి కారణం ఎన్టీఆర్, ఆయన స్థాపించిన తెలుగు దేశం పార్టీ. థియేటర్లు మూతపడుతున్న కాలంలో ఆనాడు స్లాబ్ సిస్టమ్‌తో పాటు టీడీపీ ప్రభుత్వం తీసుకున్న ఎన్నో నిర్ణయాలు చిత్ర పరిశ్రమకు భరోసా కల్పించాయి. టీడీపీ హయాంలో హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చెందడం కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు కలిసొచ్చింది. టీడీపీ 14 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏనాడు చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. అదే ఇప్పుడు ఏపీలోని జగన్ ప్రభుత్వం గురించి చెప్పుకుంటే గత నాలుగేళ్లలో చిత్ర పరిశ్రమను ఎన్ని తిప్పలు పెట్టారో అందరూ చూశారు. చిరంజీవి వంటి పరిశ్రమ పెద్దతో దండం పెట్టించుకుని మానసిక ఆనందం పొందిన వ్యక్తి జగన్. ఇలాంటి పరిస్థితులు టీడీపీ హయాంలో అభిమానులు చూడలేదు. మహేష్, ప్రభాస్ వంటి హీరోలు కూడా స్వయంగా జగన్‌ను కలిసి తమ చిత్రాలకు టిక్కెట్ రేట్లు పెంచాలని అడుక్కోవాల్సిన దుస్థితి వైసీపీ హయాంలోనే చూశాం.

కట్ చేస్తే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు. దేశం సంగతి అటుంచితే.. తెలుగు వారి ఖ్యాతిని చాటిన పార్టీ అధినేత కష్టాల్లో ఉన్న సమయంలో చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు స్పందిస్తే అభిమానులకు ఉండే స్థైర్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ప్రముఖ వ్యక్తుల్లో కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నట్టి కుమార్ లాంటి వాళ్లే స్పందించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను వాళ్లు ముక్తకంఠంతో ఖండించారు. టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణానికి సంబంధించి చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చిన రాజమౌళి మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. అటు గోదావరి పుష్కరాల సమయంలో బోయపాటి శ్రీనుకు కూడా టీడీపీ ప్రాధాన్యం కల్పించింది. ఆయన కూడా చంద్రబాబు అరెస్ట్‌పై మౌనంగానే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించిన మెగాస్టార్ చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి హీరోలు కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించడానికి ఇష్టపడటం లేదు.

ఇది కూడా చదవండి: NCBN Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు జైలు దృశ్యాలు లీక్ చేస్తోందెవరు?

నందమూరి బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యేగా, ఫ్యామిలీ మెంబర్‌గా టీడీపీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమై క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. ప్రముఖ నిర్మాత మురళీమోహన్ కూడా పార్టీ మెంబర్‌గా ప్రత్యేకంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్‌లో చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారు. అటు జనసేన అధినేతగా ఉన్న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు అరెస్ట్ అయిన క్షణం నుంచి టీడీపీ శ్రేణులకు అండగా నిలిచారు. స్వయంగా ఓ వీడియో విడుదల చేసి వైసీపీపై తాను పోరాటం చేస్తానని ధైర్యం కల్పించారు. కానీ మిగతా హీరోల నుంచి స్పందన రాకపోవడానికి కారణం వాళ్లు భయపడుతున్నారని టీడీపీ క్యాడర్ భావిస్తోంది. ఇప్పటికే మూడు చెరువుల నీళ్లు తాగించిన జగన్ ప్రభుత్వం ఇంకా తమ సినిమాలను, తమను ఏమైనా చేస్తుందేమోనని ఆలోచిస్తున్నారని.. అందుకే వాళ్లు మౌనంగా ఉన్నారని టీడీపీ అభిమానులు నెట్టింట్లో చర్చించుకుంటున్నారు. అసలు స్పందించకుండా ఉంటే తమకు వచ్చిన నష్టమేమీ లేదని భావిస్తున్నట్లు కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల భోళాశంకర్ మూవీ సమయంలో తమపై పెట్టిన దృష్టి రోడ్లు, అభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేదని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ఎందుకు అని చిరంజీవి కామెంట్ చేసినందుకు మెగా హీరోలను వైసీపీ నేతలు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. ఇప్పుడు మరోసారి రాజకీయ అంశంపై స్పందించి ట్రోల్ అవ్వడం దేనికి అని చిత్ర ప్రముఖులు ఆలోచిస్తున్నట్లు టీడీపీ క్యాడర్ అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-09-13T16:12:19+05:30 IST