YSRCP : ఏపీలో 56 మంది IAS ల బదిలీల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. వైఎస్ జగన్ వ్యూహం ఇదేనా.. బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టిందెవరు..!?

ABN , First Publish Date - 2023-04-07T15:16:40+05:30 IST

ఏపీలో ఎన్నికల సీజన్ అప్పుడే మొదలైందా..? మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారా..? ఏడాది ముందుగానే ఇందు కోసం అన్నీ సమకూర్చుకుంటున్నారా..?

YSRCP : ఏపీలో 56 మంది IAS ల బదిలీల వెనుక ఇంత పెద్ద కథ ఉందా.. వైఎస్ జగన్ వ్యూహం ఇదేనా.. బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టిందెవరు..!?

ఏపీలో ఎన్నికల సీజన్ అప్పుడే మొదలైందా..? మరోసారి అధికారం చేజిక్కించుకునేందుకు సీఎం వైఎస్ జగన్ (YS Jagan) అస్త్రశస్త్రాలు రెడీ చేస్తున్నారా..? ఏడాది ముందుగానే ఇందు కోసం అన్నీ సమకూర్చుకుంటున్నారా..? ఈ మధ్య వరుసగా మంత్రివర్గ సమావేశాలు, ఏప్రిల్-3న జరిగిన ఎమ్మెల్యేలతో సమావేశం కార్యక్రమం దేనికి సంకేతాలు..? ఇవన్నీ ఒక ఎత్తయితే.. ఊహించని రీతిలో 10 కాదు 20 కాదు ఏకంగా 56 మంది ఐఏఎస్‌లను (IAS Officers) బదిలీ చేయడం వెనుక ఆంతర్యమేంటి..? పక్కా వ్యూహంతోనే జగన్ ఇవన్నీ చేస్తున్నారా..? ఏపీలో జరుగుతున్న తాజా పరిణామాలను కాస్త గమనిస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. ఇంతకీ సడన్‌గా ఇంతమంది ఐఏఎస్‌ల బదిలీ వెనుక ఆంతర్యమేంటి..? బదిలీ చేయాల్సిందేనని జగన్‌ను పట్టుబట్టిందెవరు..? ఏరికోరి మరీ నియామకాలు ఎందుకుచేశారు..? ముందుగానే లీకులు చేయడం వెనుక మర్మమేంటి..? అనే ఇంట్రస్టింగ్ విషయాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

IAS-Transfer.jpg

అసలేంటీ బదిలీల కథ..!?

ఏపీలో 8 జిల్లాల కలెక్టర్లు సహా 56 మందికి స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు (జీవో 635) జారీ చేసిన విషయం తెలిసిందే. మరో ఏడాదిలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగంలో కీలకమైన కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్లను భారీగా మార్చడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా ఈ టైమ్‌లోనే జగన్ ఎందుకు మార్పులు, చేర్పులు చేయాల్సి వచ్చిందనే విషయం ఇప్పుడు సామాన్యుడిలో సైతం మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇటు సోషల్ మీడియాలోనూ ఎవరికి తోచినట్లుగా వారు ఓ రేంజ్‌లో ప్రశ్నలు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకొందరైతే ఎన్నికల ముందే ఇవన్నీ మామూలే ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని తెచ్చుకోవడం, నమ్మకస్తులను వారికి కావాల్సిన చోటికి బదిలీ చేసేయడం కామన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా జగన్ పక్కా వ్యూహంతోనే చేసుకుంటూ ముందుకెళ్తున్నారని పక్కాగా అర్థమవుతోంది. ఇప్పట్నుంచే ఆయా జిల్లాలపై కలెక్టర్లు పట్టు పెంచుకుంటే ఎన్నికల టైమ్‌కు అన్నీ సెట్ చేసుకోవచ్చన్నది జగన్ మనసులో ఉందట. అందుకే ఇప్పటికే ఒకట్రెండుసార్లు వాయిదా పడిన ఈ బదిలీల అంశాన్ని ఏప్రిల్-6 నాడు జగన్ కానిచ్చేశారట. అంతేకాదు.. ఈ బదిలీ అయిన వారిలో కొందరు చెప్పిన మాటలు వినట్లేదని.. ప్రభుత్వాన్ని ధిక్కరిస్తున్నారని ఇంకొందర్ని.. మరికొందరిని కావాల్సిన చోటుకు బదిలి చేసేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

YSRCP-Jagan.jpg

ఓహో ఇదా అసలు కథ..!

ఈ బదిలీల వెనుక చాలానే జరిగాయని ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ నడుస్తోంది. జగన్ ఏం చేసినా అందులో ఐప్యాక్ హస్తం (I PAC Team) ఉంటుందన్నది ప్రధాన ఆరోపణ. ఐ ప్యాక్ టీమ్ ఏం చెప్పినా.. చెప్పింది చెప్పినట్లుగానే సీఎం జగన్ అమలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. చాలా రోజులుగా ఏపీలోని కొందరు కలెక్టర్లకు, వైసీపీ ఎమ్మెల్యేలకు పడట్లేదన్నది జగమెరిగిన సత్యమే. పలు సందర్భాల్లో ఈ వ్యవహారాలన్నీ బయటికొచ్చాయి. రానున్న ఎన్నికల్లో ఆ అధికారులే ఉంటే తమకు ఇబ్బందులు తప్పవని.. కచ్చితంగా మార్చి తీరాల్సిందేనని కొందరు ఎమ్మెల్యేలు.. జగన్‌ను పట్టుబట్టారట. మరికొందరు ఎమ్మెల్యేలు అయితే జగన్‌కు పదే పదే ఫిర్యాదులు కూడా చేశారట. ఏప్రిల్-3న జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మరోసారి ఈ విషయాలన్నీ జగన్‌ దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకెళ్లారట. దీంతో ఎమ్మెల్యేల టార్చర్ తట్టుకోలేక ఫైనల్‌గా ఇలా 56 మంది ఐఏఎస్‌లను బదిలీ చేయాల్సి వచ్చిందట. అంతేకాదు త్వరలోనే భారీగా ఎస్పీలు బదిలీ అవుతారని కూడా టాక్ నడుస్తోంది. పలువురు ఎస్పీలపైన కూడా ఇదివరకే జగన్‌కు భారీగానే ఫిర్యాదులు వచ్చాయట.

Jagan-Sad.jpg

కోపం చల్లారకపోవడంతో..!

ఈ మధ్య జగన్ ప్రభుత్వం చెప్పిన మాటలు వినకుండా ధిక్కరించి మరీ కొందరు కలెక్టర్లు ప్రవర్తించారన్నది వైసీపీ నుంచి వస్తున్న ఆరోపణ. దీంతో ఆ కలెక్టర్లపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారట. ముఖ్యంగా రాయలసీమ పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పక్షం కోరినా రీకౌంటింగ్‌కు అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మి సమ్మతించలేదు. దీంతో అందరూ ఊహించినట్లుగానే ఆమెను బదిలీ చేశారు. అయితే ఆమెపై వేటు వేసినట్లుగా కాకుండా.. విజయనగరం కలెక్టర్‌గా పంపారు. ఇక శాప్‌లో ఉద్యోగులతో నిరసన, తీవ్ర వివాదాలు ఎదుర్కొని వెయిటింగ్‌లో ఉన్న ప్రభాకర్‌రెడ్డిని సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్‌ సెక్రటరీగా నియమించారు. గవర్నర్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆర్‌పీ సిసోడియాపై జగన్‌ సర్కారుకు ఇంకా కోపం చల్లారినట్లు లేదు. గత ఫిబ్రవరి 4న ఆయన్ను గవర్నర్‌ కార్యాలయం నుంచి బదిలీ చేసి వెయిటింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల విభాగం (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్‌ జనరల్‌గా నియమించింది. గతంలో సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను అవమానకర రీతిలో తొలగించి ఇదే హెచ్‌ఆర్‌డీకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. అంటే ఇప్పుడు సిసోడియా వంతు వచ్చిందన్న మాట. ఇలా ఈ బదిలీ అయిన చాలా మందిలో ఒక్కొక్కరి ఒక్కో కథే ఉందట.

సోషల్ మీడియాలో ఇలా..!

ఏపీలో భారీగా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు బదిలీ కాబోతున్నారని సోషల్ మీడియాలో గురువారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. కొందరు వైసీపీ కార్యకర్తలు అయితే ఇదిగో ఫలానా కలెక్టర్‌కు ఇలా జరగాల్సిందేనని తెగ హ్యాపీగా ఫీలయ్యారు కూడా. అయితే ఇలా ముందుగానే లీకులు కావడంపై పెద్ద దుమారమే రేగుతోంది. వాస్తవానికి ఎన్నికల నిబంధనలను అనుసరించి ఒకేచోట మూడేళ్లు పనిచేసిన వారికి బదిలీ అనేది తప్పనిసరి. అందుకే జగన్ రెండేళ్లు పనిచేసిన కలెక్టర్లను, ఇతర ఐఏఎస్‌లను మార్చారని ఇందులో పాలిటిక్స్ ఏమీ ఉండవని వైసీపీ సోషల్ మీడియా చెబుతోంది. వచ్చే ఎన్నికల నాటికి అధికారులు కుదరుకుంటారని ప్రతిపక్షాల ఆరోపణలకు వైసీపీ కౌంటరిచ్చే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ఈ ఏడాది పాలనా పరంగా కీలక సమయం కావటంతో అధికారుల నియామకంలో జగన్ భారీగానే కసరత్తులు చేశారని.. ఆ తరువాత ఇలా పెద్ద ఎత్తున బదిలీలు చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే.. గత నెలలోనే బదిలీ జరగాల్సినప్పటికీ సీఎం జగన్ నుంచి ఆమోదం రాకపోవడంతో బదిలీలు నిలిచిపోయాయని తెలుస్తోంది.

YS-Jagan-and-Rajini.jpg

నమ్మకస్తులను ఏరి కోరి మరీ..!

వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి మూడేళ్లు ఒకే చోట పనిచేసిన కలెక్టర్లను, జేసీలను ఎన్నికల సంఘం (ఈసీ) నిబంధనల ప్రకారం మార్చాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న వారిని బదిలీ చేసి మరో చోట పోస్టింగ్‌ ఇచ్చారు. తాము నియమించిన అధికారులను చివరి నిమిషంలో ఈసీ బదిలీ చేయకుండా ముందు జాగ్రత్తగా సర్కారే కీలక మార్పులు చేసింది. అంతేకాదు.. తనకు బాగా నమ్మకంగా ఉన్నవారిని, ఇప్పటికే పలు సందర్భాల్లో విశ్వసనీయతను ప్రదర్శించిన వారికి కలెక్టర్‌, జేసీలుగా పోస్టింగులిచ్చింది. ఎన్నికల సమయంలో జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు నమ్మకస్తులుండాలని ప్రభుత్వం భావిస్తుంటుంది. ఇదే పంథాలో నమ్మకస్తులను ఏరికోరి కీలక జిల్లాలకు బదిలీ చేసింది. ఎన్నికల విధుల్లో కూడా వారు పాల్గొంటారు కాబట్టి జల్లెడపట్టి మరీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌. జేసీగా ఏడాదికాలం పనిచేసిన వారిని కూడా మార్చారు. కొందరిని ఇతర పోస్టులకు బదిలీ చేయగా.. నమ్మకస్తులను ఇతర జిల్లాలకు కలెక్టర్‌, జేసీలుగా పంపించారు. బదిలీ జాబితాను చూస్తే ఇది సర్కారుకు ఎన్నికల టీమ్‌గా ఉందని అధికార వర్గాలే చెబుతున్నాయి. విభాగాధిపతులు, కార్యదర్శుల స్థాయిలో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే కొన్ని కీలక విభాగాలకు అధికారులను మార్చారు. ఆ పోస్టుల్లో కూడా సర్కారుకు బాగా దగ్గరగా ఉన్నవారికే అవకాశం ఇచ్చారు.

చూశారుగా.. ఇదీ ఏపీలో జరిగిన బదిలీల వెనుక కథ ఏంటో. మొత్తానికి చూస్తే పక్కా మాస్టర్ ప్లాన్‌తో జగన్ ఎన్నికలకు వెళ్తున్నారని పక్కాగా అర్థమవుతోంది. మున్ముందు ఇంకా భారీగా మార్పులు, చేర్పులు జరిగినా పెద్ద ఆశ్చర్యపోనక్కర్లేదేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూద్దాం మరి.

Updated Date - 2023-04-07T15:25:47+05:30 IST