Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..

ABN , First Publish Date - 2023-04-24T15:56:23+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Viveka Murder Case : సుప్రీంకోర్టులో ఎంపీ అవినాష్‌కు చుక్కెదురు.. అరెస్ట్ విషయంలో సీబీఐకు లైన్ క్లియర్..

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (YS Viveka Murder Case) కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్‌పై అటు అవినాష్.. ఇటు సునీత తరఫు లాయర్ల వాదనలు నిశితంగా విన్న ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు (TS High Court) ఉత్తర్వులను తప్పుబడుతూ ముందస్తు బెయిల్‌ను సుప్రీం నిలిపివేసింది. అంతేకాదు విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై (Anticipatory Bail) వివేకా కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. సుప్రీం తాజా తీర్పుతో రేపటి వరకు అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయినట్లే.

గడువు పెంపు..!

అంతేకాదు.. ఇప్పటి వరకూ ఏప్రిల్-30 వరకూ విచారణ ముగించాలని గతంలో గడువిచ్చిన సుప్రీం.. ఇప్పుడు పెంచింది. జూన్-30 లోపు విచారణ పూర్తి చేయాలని న్యాయస్థానం సీబీఐని ఆదేశించింది. హైకోర్టు బెయిల్‌పై తేల్చేంతవరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. ఈ విజ్ఞప్తిని సుప్రీం అంగీకరించలేదు. సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఊహించుకుంటున్నారు..? అని అవినాష్ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా..? అని ఒకింత కోర్టు మండిపడింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని కోర్టు తెలిపింది. ముందస్తు బెయిల్ సంగతేంటో తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు త‌ప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయ‌ని.. అంతేకాదు.. ద‌ర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయ‌న్న సీజేఏ ధర్మాసనం చెప్పుకొచ్చింది.

సీబీఐకి లైన్ క్లియర్

మొత్తానికి చూస్తే.. అవినాష్‌ను అరెస్ట్‌ చేయడానికి సీబీఐ లైన్ క్లియర్ అయినట్లేనని వార్తలు గుప్పుమంటున్నాయి. వైఎస్ సునీతకు అనుకూలంగా సుప్రీంలో తీర్పురావడంతో అవినాష్ శిబిరంలో భయం మొదలైందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో దూకుడు మీదున్న సీబీఐ.. ఇప్పుడు అవినాష్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో 24 గంటల్లో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగానే ఉన్నాయని మాత్రం వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్‌ల ఆరు రోజుల సీబీఐ కస్టడీ ముగిసింది. ఇద్దరినీ సీబీఐ ఆఫీసు నుంచి నాంపల్లి కోర్టుకు అధికారులు తరలించారు.

Updated Date - 2023-04-24T17:50:40+05:30 IST