TS BJP : తెలంగాణ బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయా.. బాబోయ్ ఈ రేంజ్‌లోనా..!

ABN , First Publish Date - 2023-03-13T22:11:49+05:30 IST

తెలంగాణలో బీజేపీలో (TS BJP) ముసలం మొదలైందా..? రాష్ట్ర కమలనాథుల్లో ఒకరంటే ఒకరికి పడట్లేదా..? తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (TS BJP Chief Bandi Sanjay) అంటే సీనియర్లు, సిట్టింగ్‌లకు పడట్లేదా..?

TS BJP : తెలంగాణ బీజేపీలో లుకలుకలు.. కాంగ్రెస్ పరిస్థితులు రిపీట్ అవుతున్నాయా.. బాబోయ్ ఈ రేంజ్‌లోనా..!

తెలంగాణ బీజేపీలో (TS BJP) ముసలం మొదలైందా..? రాష్ట్ర కమలనాథుల్లో ఒకరంటే ఒకరికి పడట్లేదా..? తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (TS BJP Chief Bandi Sanjay) అంటే సీనియర్లు, సిట్టింగ్‌లకు పడట్లేదా..? నేతలంతా ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారా..? బండికి వ్యతిరేకంగా సీనియర్లంతా ఏకమవుతున్నారా..? పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో కాంగ్రెస్ (Congress) కానుందా..? అంటే తాజా పరిస్థితులు, సీనియర్ నేతల హాట్ కామెంట్లను బట్టి చూస్తే అక్షరాలా నిజమనిపిస్తోంది. బండిని ఢిల్లీ బీజేపీ పెద్దలు ఓ రేంజ్‌లో ప్రశంసలతో ముంచెత్తుతుంటే.. రాష్ట్రంలో మాత్రం కమలనాథులంతా ఎందుకింత పగతో రగిలిపోతున్నారు..? ఇంతకీ బండితో నేతలకొచ్చిన సమస్యేంటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం..!

Bandi-Sanjay-1.jpg

ఇక్కడేనా చెడింది..!?

రానున్న ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలిచి తెలంగాణలో అధికారంలోకి రావాలన్నది బీజేపీ టార్గెట్. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే ప్రభుత్వంపై కమలనాథులు ఎనలేని పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా తప్పిదం చేస్తే ఇక నిరసనలు, ర్యాలీలు, ధర్నాలతో నేతలు హోరెత్తిస్తుంటారు. ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఇన్ని రోజులుగా కేసీఆర్ సర్కార్‌పై ఉద్యమిస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో ఏం జరిగిందో తెలియట్లేదు కానీ.. తెలంగాణ బీజేపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా పరిస్థితులు మారిపోయాయ్. ఒక్కసారిగా బండి సంజయ్‌ తీరు సర్లేదని సీనియర్లు, ముఖ్య నేతలు, సిట్టింగ్‌లు మీడియా ముందుకొచ్చి తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయని రాష్ట్ర రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. దేశ వ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. దీనిపై అటు కాంగ్రెస్ నుంచి.. ఇటు బీజేపీ నుంచి పెద్ద ఎత్తునే విమర్శలు వచ్చాయి. కానీ.. బండి సంజయ్ మాత్రం ‘నోటీసులివ్వక ముద్దు పెట్టుకుంటారా..’ అని కామెంట్స్ చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బీఆర్ఎస్ నేతలు (BRS Leaders), కార్యకర్తలు అయితే బండి సంజయ్ దిష్టిబొమ్మలను తగులబెట్టి.. నిరసనలతో హోరెత్తించారు. అయితే ఈ కామెంట్స్ సొంత పార్టీ నేతలకే రుచించలేదు. ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) లాంటి నేతలు బండి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అర్వింద్‌ కామెంట్స్‌ 100కు వంద శాతం కరెక్టే అని.. కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఇతర పెద్దలు చేయాల్సిన పని ఈయన చేశారంటూ కొందరు సీనియర్లు మద్దతిచ్చారు. మరికొందరైతే క్షమాపణలు (Sorry) చెప్పాల్సిందేనని కూడా డిమాండ్ చేశారు. అదేంటి అధ్యక్షుడు అలా.. నేతలు ఇలా రెండు రకాలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారని కార్యకర్తలు, బీజేపీ వీరాభిమానులు అవాక్కయ్యారు. ఇక్కడే అసలు కథ మొదలైందట. సీన్ కట్ చేస్తే.. బీజేపీ నేతల్లో (BJP Leaders) అలా మొదలైన అసమ్మతి బండి సంజయ్‌పై వ్యక్తిగత ఆరోపణల దాకా వెళ్లింది.

Bandi-Sanjay.jpg

బండిపై వస్తున్న ఆరోపణలివేనా..!

బండి సంజయ్ ఎంపీగా ఉన్నప్పట్నుంచి.. అధ్యక్ష పదవి వచ్చే వరకూ, వచ్చిన తర్వాత కూడా తనదైన స్టయిల్ ముందుకెళ్తున్నారు. అదిగో.. అధికారంలోకి వచ్చేస్తున్నాం అన్నట్లుగా బీజేపీ నేతలు, కార్యకర్తలకు భరోసా ఇస్తూ ధీమాగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈసారి ఎలాగైనా సరే తెలంగాణ అధికారంలోకి రావాల్సిందేనని ఇందుకు కావాల్సిన వ్యూహాలు రచిస్తున్నారు కేంద్రంలోని బీజేపీ పెద్దలు. ఎన్నికల సీజన్ కూడా తెలంగాణలో దాదాపు మొదలైనట్లే. సరిగ్గా ఈ టైమ్‌లో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయ్. ఎంతసేపూ పెద్దలు మోడీ, అమిత్ షాలను ప్రసన్నం చేసుకుంటూ బండి నెట్టుకొస్తున్నారనే ఆరోపణలున్నాయి. బండిని కూడా పెద్దలు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. అయితే.. రాష్ట్ర నాయకులు మాత్రం ఆయన్ను అనుసరించట్లేదు.. కనీసం ఆయన మాటలు కూడా లెక్కచేయట్లేదట. మరోవైపు.. అధ్యక్షుడు బండి పరిణితి లేని అసందర్భ మాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ఈ పరిస్థితికి కారణమని సీనియర్ నేత పేరాల శేఖర్ రావ్ (Perala Sekhar Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. అన్ని మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్ మెయిల్, విషయాలన్నీ లేవదీసి అంతర్గతంగా సెటిల్మెంట్‌లు, సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయ లోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, వాడుకోని వదిలేయడం లాంటివి బీజేపీ సంస్కృతి కాదని.. అయినా సరే యధేచ్చగా నడుస్తున్నాయని పేరాల అసహనం వ్యక్తం చేశారు.

Arvind-and-kavitha.jpg

ఈటల పేరు ప్రస్తావించి మరీ..!

కరీంనగర్‌లో (Karimnagar) కొన్ని గ్రానైట్ కంపెనీల వ్యవహారాన్ని లేవదీసి మీడియాలో బండే దగ్గరుండి వార్తలు వేయించి అంతర్గతంగా ఒప్పందాలు చేసుకున్నారని కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఉద్రేకంగా సాగిన హుజురాబాద్ (Huzurabad) ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ను (CM KCR) చిత్తుగా ఓడించిన ఈటెల రాజేందర్ (Etela Rajender) అద్భుతమైన గెలుపు వాతావరణాన్ని ఖతం చేసిన తీరు, మాఫియా స్టయిల్, కొత్త కార్య పద్ధతి వీటన్నింటినీ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని పేరాల బహిరంగంగా ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి 3 అడుగులు ముందుకు.. 6 అడుగులు వెనక్కు లాగా ఉందని.. దీనికి కారణం రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధాలేనన్నారు. అంతేకాదు.. కేసీఆర్, బీఆర్ఎస్ (KCR, BRS) పతనం అవుతున్న టైమ్‌లో ఇలా జరగడం దురదుష్టకరమన్నారు. కేంద్రంలోని పెద్దలు పెద్దఎత్తున మద్దతిస్తున్నా సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నామని పేరాల తన అసంతృప్తిని వెల్లగక్కారు. ఇలా ఒక్కరే కాదు.. బండికి మద్దతుగా కొందరు గ్రూప్ కాగా.. మరికొందరు పూర్తి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారని కూడా ప్రచారం జరుగుతోంది.

Perala-and-Etela.jpg

కమలం వాడిపోతోందా..?

వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) టీడీపీకి (Telugudesam) టాటా చెప్పి కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్న రోజు నుంచి.. నేటి వరకూ అన్నీ వివాదాలే. ముఖ్యంగా అధ్యక్ష పదవి వచ్చాక ఒక్కరంటే ఒక్కరూ రేవంత్‌కు సహకరించిన పరిస్థితుల్లేవనే వార్తలు రోజూ మనం చూస్తూనే ఉన్నాం. రెండ్రోజులు నేతలంతా బాగున్నారంటే మూడో రోజే ఏదో ఒక రాద్దాంతం తెరపైకి వస్తుంది.. ఒక్క మాటలో చెప్పాలంటే మూడునాళ్ల ముచ్చట అనేది సరిగ్గా సరిపోతుందేమో. అంతర్గత కుమ్ములాటలతో రోజూ కుమ్ములాటలే జరుగుతున్నాయ్. అయితే.. కాంగ్రెస్‌లో పరిస్థితులే ఇప్పుడు కమలం పార్టీలో కూడా రిపీట్ అవుతున్నాయని తాజా పరిణామాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోందని సొంత పార్టీకి చెందిన కొందరు సీనియర్లే చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకూ వికసించిన కమలం ఇప్పుడు వాడిపోతోంది బాబోయ్ అంటూ నెట్టింట్లో కొందరు నేతలు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందే పరిస్థితి ఇలా ఉంటే.. మున్ముందు ఎలా ఉంటుందో అని బీజేపీ శ్రేణులు, అధినాయకత్వం ఆందోళనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం మొత్తం రానున్న ఎన్నికలపై పెనుప్రభావం చూపే పరిస్థితులు మెండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినా పట్టించుకోవట్లేదనే ఆరోపణలు లేకపోలేదు.

Rao.jpg

మొత్తానికి చూస్తే.. రోజురోజుకూ కమలం పార్టీలో పెరిగిపోతున్న అసంతృప్తిపై కేంద్ర పెద్దలు ఓ కన్నేస్తే తప్ప పరిష్కారమయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. కేంద్రం పట్టించుకోకపోతే మాత్రం బీజేపీకి గడ్డుపరిస్థితులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి మరి.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

TS BJP : అరెరే.. అమిత్ షా సాక్షిగా బండి, కిషన్ రెడ్డి ఇలా చేశారేంటబ్బా.. ఇదేందయ్యా ఇది.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫొటోలు..!


******************************

Oscar to RRR : ఆహా.. బండి సంజయ్‌లో ఇంత మార్పా.. నాడు తిట్లు.. నేడు ప్రశంసలు.. అప్పుడు భయపడి ఉంటే..!


******************************

Pawan Kalyan : వైసీపీకి ఊహించని షాక్.. జనసేనలో చేరిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు.. ఇలా జరిగిందేంటి..!?


******************************

Delhi Liquor Scam Case : ఇంకా అయిపోలేదు.. మళ్లీ రావాలంటూ కవితకు ఈడీ నోటీసులు..!


*****************************

Updated Date - 2023-03-14T00:10:21+05:30 IST